ఏడీహెచ్‌డీకి, ఆటిజమ్‌కు తేడా తెలుసా!?

6 Apr, 2021 13:56 IST|Sakshi

కొంతమంది అటెన్షన్‌ డెఫిసిట్‌ హైపర్‌ యాక్టివ్‌ డిజార్డర్‌ (ఏడీహెచ్‌డీ), ఆటిజమ్‌లను ఒకే రుగ్మతగా అభిప్రాయపడి, పొరబడుతుంటారు. నిజానికి ఏడీహెచ్‌డీ ఉన్న పిల్లలు, ఆటిజమ్‌ ఉన్న చిన్నారులు... ఈ రెండు కండిషన్స్‌లోనూ పిల్లలు అతి చురుగ్గా ఉంటారు. అయితే ఏడీహెచ్‌డీ చిన్నారుల తల్లిదండ్రులు తరచూ వారి పిల్లాడి గురించి చెబుతూ ‘‘మావాడు అతి చురుకు. చాలా వేగంగా నేర్చుకుంటాడు. కానీ స్కూల్లో చెప్పిందేదీ గుర్తుంచుకోడు’ అంటుంటారు. అయితే ఏడీహెచ్‌డీ అనే సమస్య జ్ఞాపకశక్తికి సంబంధించింది కాదు. 

ఇక ఆటిజమ్‌ ఉన్న పిల్లల్లోనూ అతిచురుకుదనం ఉన్నప్పటికీ వారి చురుకుదనమంతా నిర్దిష్టమైన లక్ష్యం లేకుండా, ఏమాత్రం ఫోకస్డ్‌గా లేకుండా ఉంటుంది. ఆటిజమ్‌ ఉన్న పిల్లలు తమదైన ఏదో  లోకంలో ఉన్నట్లుగా ఉంటారు. నేరుగా కళ్లలో కళ్లు కలిపి మాట్లాడలేరు. పైగా వారికి మాట్లాడటంలో సమస్యలు ఉంటాయి. తమ చుట్టూ ఉన్న మనుష్యులూ, వాళ్ల వ్యవహారాలపై ఎలాంటి ఆసక్తీ ఉండదు. 

ఏడీహెచ్‌డీ ఉన్న ప్రతి పిల్లవాడికీ ఆటిజమ్‌ ఉండదు. అయితే అలా ఉందేమోనని ఒకసారి వైద్యనిపుణుల చేత పరీక్షింపజేసి, ఉందా లేదా అని తెలుసుకోవాలి. ఇలా చేయడం వల్ల వీలైనంత త్వరగా సమస్యలకు తగిన చికిత్సకు అవకాశం ఉంటుంది కాబట్టి మెరుగుదలకూ అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ విషయంలో తల్లిదండ్రులు నిర్లక్ష్యం లేకుండా ఉండాలి. 

మరిన్ని వార్తలు