మాటే సోపానం

23 Apr, 2022 00:37 IST|Sakshi

ఇంటిని చక్కదిద్దుకోవడంలోనే కాదు   వంటలు, ఆటలు, కళలు, రకరకాల వృత్తులు, వ్యాపారాలు .. ఇదీ అన్ని చెప్పలేనంత ప్రతిభను మహిళలు మాత్రమే కనబరుస్తారు.   వీటన్నింటిలో రాణించాలంటే అవసరమైనది మంచి మాట.   ‘నలుగురితో ఎలా మెలగాలో తెలుసుండటంతో పాటు ‘మంచి మాట’ కూడా తోడైతే జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకోగలరు అని వివరిస్తున్నారు డాక్టర్‌ డి.కల్పన. హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో ఉంటున్న ఈ పబ్లిక్‌ స్పీకింగ్‌ ట్రెయినర్‌   గృహిణిగా ఉన్న తన జీవితమే ‘మాట’ను   ఉపాధిగా మార్చుకోవడానికి ఉపకరించిందని తెలియజేశారు.  

‘‘డిగ్రీ పూర్తి చేసిన నాకు పెళ్లి తర్వాత ‘మాట’ సమస్య వచ్చింది. కొన్నాళ్లు నలుగురిలో మాట్లాడటానికి జంకడం నాకు నేనుగా గమనించాను. అది గుర్తించి ఈ సమస్య నుంచి బయటపడాలనుకున్నాను. అందుకు నా కుటుంబం మద్దతుగా నిలిచింది. సమస్య నుంచి బయట పడ్డాను. నాలాగ మొదట మాట తడబడటం అనే సమస్య చాలా మందిలో ఉండటం గమనించాను. కొందరు ‘మాట’తో ఎంతగా వృద్ధిలోకి వస్తున్నారో గమనించాను.

కొందరు ప్రతిభ ఉన్నా వెనకంజలో ఉంటున్నవారినీ చూశాను. ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నవారు. అప్పుడే ‘పబ్లిక్‌ స్పీకింగ్‌’ కాన్సెప్ట్‌పై శిక్షణ అవసరం గ్రహించి, ఇంట్లోవారితో చర్చించాను. అందకు నాకు పూర్తి మద్దతు లభించింది. మీడియా జంక్షన్‌ పేరుతో పబ్లిక్‌ స్పీకింగ్‌పైన 18 ఏళ్లుగా శిక్షకురాలిగా ఉన్నాను. తరగతులకు వచ్చేవారిలో వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నవారి నుంచి రాజకీయాల్లోకి రావాలనుకున్నవారు, వచ్చినవారూ పాల్గొన్నారు. వారందరికీ చెప్పిన విషయాల్లో ముఖ్యమైనవి...  

భయం గడప దాటాలి
ప్రతి ఒక్కరిలోనూ వారి మనసు పొరల్లో ఎన్నో అంశాల దాగి ఉంటాయి. కానీ, వాటిని బయటకు సరిగ్గా వ్యక్తపరచలేరు. కొందరు వ్యక్తపరిస్తే ఆహ్లాదంగా ఉంటుంది. మరికొందరి మాటలను అస్సలు వినలేం. ఎదుటివారిని నొప్పించకుండా ఒప్పించగల నేర్పుతో ‘మాట’ ఉండాలంటే సాధన అవసరం. దానికి ముందు ‘ఏం మాట్లాడితే ఏం అనుకుంటారో’ అనే భయాన్ని వదిలిపెట్టాలి.

తల్లిగా పిల్లలతో కథల రూపేణా, వారి విషయాలు కనుక్కోవడంలోనూ మాట్లాడుతూ ఉండాలి. పేరెంట్‌ టీచర్‌ మీటింగ్స్‌లో పాల్గొని అక్కడి టీచర్స్‌తో మాట్లాడాలి. అలాగే, ఇంటికి ఎవరో ఒకరు అతిథులుగా వస్తారు. వారితోనూ మాట కలపచ్చు. కాలనీలు, అపార్ట్‌మెంట్‌లలో గెట్‌ టుగెదర్‌ లాంటివి ఏర్పాటు చేసుకొని, మీరు చెప్పాలనుకున్న విషయాన్ని తెలియజేయాలి. వచ్చిన చిన్న అవకాశాన్నే అయినా ఉపయోగించుకొని మాట్లాడుతూ ఉంటే అదే సరైన దారి చూపుతుంది. మాట్లాడటం అనే కళను ఒంటపట్టేలా చేస్తుంది.  
 
చిన్న చిన్న పార్టీలే మాటకు వేదికలు
మాట మనపైన మనకు నమ్మకాన్ని కలిగిస్తుంది. అందుకు మహిళలకు తరచూ తారసపడేవి నలుగురైదుగురితో ఏర్పాటుచేసుకునే కిట్టీపార్టీ, బర్త్‌ డే పార్టీ, చిన్న చిన్న వేడుకలలో ఒక యాక్టివిటీ ప్రోగ్రామ్‌ను ఏర్పాటుచేసి, అందులో పాల్గొనాలి. ఒక్కొక్క పాయింట్‌ మీద ఒక్క నిమిషం మాట్లాడాలి. ఉదాహరణకు.. క్యాండిల్‌ కేర్, పెన్ను, పుస్తకం, బెలూన్స్‌.. ఇలా మీ కళ్ల ముందు ఉన్న వస్తువులను ఉపయోగించుకుంటూ దాని ప్రాముఖ్యాన్ని బయటకు వ్యక్తపరచడం అన్నమాట.  
 
మాటతో సమస్యలు దూరం
డాక్టర్‌ మాట ద్వారానే సగం జబ్బు తగ్గిపోతుందన్న విషయం మనందరికీ తెలిసిందే. అలాగే లాయర్లు కూడా మాట ద్వారానే రాణించాలి. కొన్ని సార్లు మాట కటువుగా, కొన్నిసార్లు మృదువుగా ఉండాలి. ఎక్కడ ఆపాలి, స్వరం ఎక్కడ పెంచాలి అనే విషయాల్లో మనకు పూర్తి ఆత్మవిశ్వాసం వస్తే కోరుకున్న రంగాల్లో కోరుకున్న ప్రగతి సాధించడానికి ‘మాట’ ఎంతగానో సాయపడుతుంది.

 ‘మాట’ సరైన విధంగా ఉపయోగించకపోతే ఆ ‘మాట’నే వారికి అథఃపాతాళానికి చేరుస్తుంది. ఈ విషయాన్ని కూడా ఎప్పుడూ గుర్తుంచుకొని వృద్ధిలోకి రావడానికి ‘మాట’ను మంత్రంగా ఉపయోగించుకొని ఎదుగుదలకు సోపానంగా మలచుకోవాలి’’ అని వివరించారు ఈ ట్రెయినర్‌.  

బొమ్మలతో స్పీచ్‌ సాధ్యమే
నలుగురైదుగురు స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు ఒక చోట చేరినప్పుడు ఒక బాక్స్‌లో చిన్న చిన్న బొమ్మలు,  వస్తువులు వేసి... ఎవరికి ఏ వస్తువు వస్తే ఆ టాపిక్‌ మీద నిమిషం సేపైనా మాట్లాడాలి. దినపప్రతికల్లో వచ్చిన ఏదైనా ఒక వార్త తీసుకొని మాట్లాడవచ్చు. మా దగ్గర నాలుగు రోజుల ప్రోగ్రామ్‌ స్పీకింగ్‌ కోర్స్‌లో, ఒకరోజు ఫుల్‌ డే కేటాయిస్తాం. అందుకు అందరికీ వీలున్న సెలవురోజున ఎంచుకుంటున్నాం.  
డాక్టర్‌ డి. కల్పన

– నిర్మలారెడ్డి

మరిన్ని వార్తలు