సాధారణ నొప్పులు అనుకోవద్దు.. ఆర్థరైటిస్‌పై అవగాహన అవసరం!

9 Oct, 2022 17:11 IST|Sakshi

12న ఆర్థరైటిస్‌ డే

ఆర్థరైటిస్‌ అంటే కీళ్ల సమస్య (జాయింట్స్‌ ప్రాబ్లమ్‌) అని అర్థం. ప్రపంచ వ్యాప్తంగా డయాబెటిస్, హైబీపీ, క్యాన్సర్‌లాంటి జబ్బుల కంటే ఆర్థరైటిస్‌ సమస్య తీవ్రతే చాలామందిలో ఉంటుంది. కానీ దీనిపై అవగాహన మాత్రం అంతంత మాత్రమే. దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఒక దశలో శరీర వైకల్యాలు రావచ్చు.  పైగా ఎంత త్వరగా గుర్తిస్తే అంత తేలిగ్గా చికిత్స చేసి అదుపులో ఉంచగలగడం సాధ్యం. ఈ నెల 12న ఆర్థరైటిస్‌ డే. ఈ సందర్భంగా ఆర్థరైటిస్‌పై అవగాహన కోసం ఈ కథనం. 

ఆర్థరైటిస్‌ అంటే ఎముకలు, వాటి కణజాలాలకు సంబంధించిన సమస్య. ఇందులోనూ దాదాపు 200 రకాల కంటే ఎక్కువ వ్యాధులే ఉంటాయి. మామూలు ప్రజల అవగాహన కోసం వాటన్నింటినీ కలిపి ‘ఆర్థరైటిస్‌’గా పేర్కొంటారు.  సాధారణంగా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కీళ్ల దగ్గర నొప్పి, వాపు, అవి గట్టిగా (స్టిఫ్‌గా) మారడాన్ని, ఆయా కీళ్లలో కదలికలు తగ్గడాన్ని ‘ఆర్థరైటిస్‌’గా చెప్పవచ్చు. ఈ సమస్యల తీవ్రత సాధారణంగా ఉదయం పూట ఎక్కువగా ఉంటుంది. 

ఆర్థరైటిస్‌లో రకాలు
ఆర్థరైటిస్‌లో చాలా రకాలు ఉంటాయి. అయితే ఇందులో ఆస్టియోఆర్థరైటిస్, రుమటాయిడ్‌ ఆర్థరైటిస్, యాంకైలోజింగ్‌ స్పాండైల్‌ ఆర్థరైటిస్, గౌట్, జువెనైల్‌ ఇడియోఫథిక్‌ ఆర్థరైటిస్‌ (పిల్లల్లో వచ్చే ఆర్థరైటిస్‌), లూపస్, సోరియాటిక్‌ ఆర్థరైటిస్‌ వంటివి కొన్ని.

కొన్ని రకాల ఇన్ఫెక్షన్ల తర్వాతి పరిణామంగా ఆర్థరైటిస్‌ కనిపిస్తుంది. పిల్లల్లో పుట్టుకతో వచ్చే ఆరోగ్య సమస్యల కారణంగా కొందరిలో దేహంలోని ఇతర వ్యవస్థలపై కూడా దుష్ప్రభావం పడవచ్చు. అలాగే మరికొందరిలో ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ సమస్యలూ కనిపించవచ్చు.

నివారణ/తీవ్రత తగ్గించడానికి సూచనలు
అసలు జబ్బే లేనప్పుడు లేదా సమస్య తొలిదశలో ఉన్నప్పుడు ఆరోగ్యకరమైన జీవనశైలి (లైఫ్‌స్టైల్‌)తో దీన్ని నివారించడం అవసరం. ఇందుకోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, తగినంత విశ్రాంతి, కంటినిండా నిద్ర, అన్ని రకాల పోషకాలతో కూడిన సమతులాహారం, ఒత్తిడి లేకుండా ఉండటం వంటి జాగ్రత్తలు అవసరం. పొగతాగడం, మద్యం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి.

వ్యాయామం చాలా కీలకం కాబట్టి కొన్ని విషయాలు  గుర్తుపెట్టుకోవాలి. అవేమిటంటే... అసలే కీళ్లనొప్పులు, కీళ్ల దగ్గర కదలికలు చాలా పరిమితంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి వ్యాయామం చేయడం కష్టం కావచ్చు. అయితే అస్సలు వ్యాయామం చేయకుండా ఉంటే కీలు మరింతగా కదలికలు కోల్పోయే అవకాశం ఉంది. అందుకే నొప్పి కలగనంత మేరకు, అలసట కలగనంతవరకు కీళ్లు కదిలిస్తూ క్రమంగా వ్యాయామాన్ని పెంచుకుంటూ పోవడం మేలు. నడక, ఈత, సైక్లింగ్‌ వంటి వ్యాయామాలు మేలు చేస్తాయి.

చికిత్స
సాధారణంగా లక్షణాల తీవ్రత తగ్గించేలా, కీలు మరింతగా దెబ్బతినకుండా ఉండేలా, వ్యాధికి ప్రభావితమైన అవయవం దాని పనితీరును కోల్పోకుండా చూసేలా చికిత్స ఉంటుంది. అలాగే మందులు ఇచ్చేప్పుడు డాక్టర్లు అవాంఛనీయమైన నష్టాలు, దుష్ప్రభావాలు లేకుండా ఉండటంతో పాటు సైడ్‌ఎఫెక్ట్స్‌ వీలైనంతగా తక్కువగా ఉండేలా చూస్తారు. ఆ మేరకు డాక్టర్లు మందుల మోతాదులను నిర్ణయిస్తారు.

ఇందులో భాగంగా డాక్టర్లు నొప్పి నివారణ మందులైన నాన్‌ స్టెరాయిడ్‌ యాంటీ ఇన్‌ఫ్లమేషన్‌ డ్రగ్స్‌ (ఎన్‌ఎస్‌ఏఐడీ), డిసీజ్‌ మాడిఫైయింగ్‌ యాంటీ రుమాటిక్‌ డ్రగ్స్‌ (డీఎమ్‌ఏఆర్‌డీ), బయాలజిక్స్‌ వంటి మందులను వాడుతుంటారు. 

శస్త్రచికిత్స
ఆర్థరైటిస్‌ సమస్యకు తగిన సమయంలో (సాధారణంగా తొలిదశల్లో) చికిత్స తీసుకోనివారిలో కీళ్లు, ఎముకలు దెబ్బతినడం, ఇతరత్రా మరికొన్ని దుష్ప్రభావాలు కనిపించవచ్చు. అలాంటివారిలో కొన్ని సందర్భాల్లో శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం కూడా రావచ్చు.  వీలైనంత త్వరగా డాక్టర్‌ను సంప్రదించడం వల్ల వ్యాధి ముదరకుండా చూసుకోవడంతో పాటు శస్త్రచికిత్స వంటి ఆర్థిక, సామాజిక, కుటుంబ భారాలను కూడా నివారించే అవకాశాలుంటాయి.

లక్షణాలు
ఆర్థరైటిస్‌ లక్షణాలు అందరిలోనూ ఒకేలా ఉండవు. ఇవి కొద్దిపాటి తీవ్రత (మైల్డ్‌) నుంచి తీవ్రమైన (సివియర్‌) లక్షణాల వరకు ఉండవచ్చు. ఒకే వ్యక్తిలో సైతం కాలానుగుణంగా మారుతుండవచ్చు. ఏళ్ల తరబడి కనిపించడంతో పాటు కాలం గడిచేకొద్దీ తీవ్రత పెరగవచ్చు. తొలిదశలో ఆకలి తగ్గడం, జ్వరం, బాగా నీరసించిపోవడం, బరువు తగ్గడం వంటివి కనిపిస్తాయి.

ఇవన్నీ ప్రతి ఒక్కరిలో ఏదో ఒక దశలో సాధారణంగానే కనిపించే సమస్యలు కావడం వల్ల వీటిని తొలిదశలో కనుగొనడం కాస్త కష్టమే. ఈ సమస్య కారణంగా ఏ అవయవం ప్రభావితమైతే... ఆ అవయవానికి సంబంధించిన లక్షణాలు వ్యక్తమవుతూ ఉంటాయి. అయితే ఆర్థరైటిస్‌లో ప్రధానంగా కీళ్లు దెబ్బతినడం జరుగుతుంది. దాని తాలూకు లక్షణాలే బయటకు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. కీళ్లు ఎర్రగా కమిలినట్లుగా ఉండి, విపరీతమైన నొప్పిరావచ్చు. 

ఆర్థరైటిస్‌ గురించి ఎందుకు అప్రమత్తత అవసరమంటే... 
ఇది కేవలం దేహంలోని ఒక వ్యవస్థకే పరిమితం కాకుండా చాలా వ్యవస్థలను దెబ్బతీస్తుంది. చికిత్స అందించకపోతే చాలా రకాల దుష్ప్రభావాలు కనిపించే అవకాశముంది. మంచి చికిత్స అందిస్తే చాలావరకు అదుపు లో ఉంటుంది. ఒకవేళ సరైన చికిత్స అందించకపోతే శరీరంలోని ముఖ్యమైన అవయవాల మీద వీటి ప్రభావం పడి, వాటి పనితీరులలో తీవ్రమైన మార్పు రావచ్చు.

ఒక్కోసారి ఈ సమస్య కారణంగా కొందరి లో చూపుపోవడం, గుండెపోటు, పక్షవాతం, మూత్రపిండాలు దెబ్బతిని డయాలసిస్‌పై ఆధారపడాల్సిన అవసరం రావడం జరగవచ్చు. ఫలితంగా  జీవననాణ్యత (క్వాలిటీ ఆఫ్‌ లైఫ్‌) తగ్గిపోతుంది.

వ్యాధి నిర్ధారణ
ఎక్స్‌–రే, సీటీ స్కాన్, ఎమ్మారై పరీక్షలతో పాటు కొన్ని రకాల అడ్వాన్స్‌డ్‌ రక్తపరీక్షల సహాయంతో వ్యాధినిర్ధారణ జరుగుతుంది. 

ఆర్థరైటిస్‌కు చికిత్స ఉందా?
తొలిదశలోనే ఈ సమస్యను త్వరగా గుర్తిస్తే సమర్థమైన చికిత్స అందించవచ్చు. ఫలితంగా జీవననాణ్యతతో పాటు బాధితుల జీవితకాలాన్ని పెంచవచ్చు.

-డాక్టర్‌ విజయ ప్రసన్న పరిమి
సీనియర్‌ రుమటాలజిస్ట్‌

మరిన్ని వార్తలు