ఆమె తెచ్చిన తియ్యటి విప్లవం

16 Jul, 2021 04:35 IST|Sakshi
షిమ్రే అగస్టీనా

హిమాచల్‌ప్రదేశ్‌ నుంచి మణిపూర్‌కు 3000 కిలోమీటర్లు. అక్కడ మంచు. ఇక్కడ ఎండ. అక్కడ ఆపిల్‌. ఇక్కడ పైనాపిల్‌. ఏం... ఆపిల్‌ ఎందుకు పండించకూడదు అనుకుంది షిమ్రే అగస్టీనా. హిమాచల్‌ప్రదేశ్‌ నుంచి 55 యాపిల్‌ మొక్కలు తెచ్చి తన ఇంటి సమీపంలో నాటింది. రెండేళ్లు గడిచాయి. ఇవాళ ఆమె మణిపూర్‌లో ఆపిల్‌ పంటకు బ్రాండ్‌ అంబాసిడర్‌. ఆపిల్‌ ఎరగని మణిపూర్, మిజోరామ్‌ స్త్రీలు ఆమెలానే ఆ పంట వేసేందుకు ముందుకు వస్తున్నారు. ఆ తియ్యటి విజయం గురించి...

గంగను నేల మీదకు దింపాడని భగీరథుని పేరు చెప్పుకుంటూ ఉంటాం. కాని ఆ గంగా పరీవాహక ప్రాంతంలో ఆపై సకల జీవగర్రల మీద వ్యవసాయంలో స్త్రీలు ఎలా పాల్గొన్నారో ఎన్నెన్ని ఆవిష్కరణలు చేశారో ఏయే పంటలను ఏయే ప్రాంతాలకు మళ్లించారో ఎవరు నిక్షిప్తం చేశారు కనుక. గర్భంలో బిడ్డను దాచడం తెలిసిన స్త్రీలు విత్తనాలు దాచడంలో, పూతను కాపాడటంలో, విరగపండి వెన్నువంచిన పైరును సంరక్షించడంలో ఎంతో శ్రమ చేసి ఉంటారు కదా. ఆధునిక భారతంలో ముఖ్యంగా ఈ టెక్‌ భారతంలో కూడా స్త్రీలు నేల మీద, వ్యవసాయం మీద మమకారం చాటుకొని భూమి నుంచి ఉద్భవించే ఫలం కోసం  ప్రయోగాలు చేస్తున్నారు. కొన్నాళ్ల క్రితం ఉత్తరప్రదేశ్‌లోని ఉష్ణజిల్లాలకు శీతల ప్రాంతానికి చెందిన స్ట్రాబెర్రీ పంటను పరిచయం చేసి, దివ్యంగా పండించి ‘స్ట్రాబెర్రీ గర్ల్‌’గా గుర్తింపు పొందింది గుర్లీన్‌ చావ్లా. ఇప్పుడు ఆపిల్‌ పంటకు ఏమాత్రం అనువుగాని మణిపూర్‌లో ఆపిల్‌ను వాణిజ్యస్థాయిలో విజయవంతం చేసి కొత్త దారి చూపింది షిమ్రే అగస్టీనా. ఆ ప్రాంతానికి సంబంధించి ఇదొక వ్యవసాయ విప్లవమే.

ఉద్యోగం వదిలేసి
షిమ్రే అగస్టీనాది మణిపూర్‌లోని మయన్మార్‌ సరిహద్దు జిల్లా అయిన ఉక్రుల్‌. అందులోని ‘పోయ్‌’ అనే కుగ్రామం ఆమెది. చదువుకుని ‘గోర్డెన్‌ మ్యాక్స్‌’ అనే వజ్రాల కంపెనీలో మేనేజర్‌ స్థాయిలో ఢిల్లీలో పని చేసేది. కాని తల్లిదండ్రులను చూసుకోవడానికి ఆమె ఆ వజ్రంలాంటి ఉద్యోగాన్ని వదిలేసి సొంత ఊరికి వచ్చేసింది. అయితే అక్కడ ఆమె చేయడానికి పని ఏమీ లేదు. ఏదైనా చేయాలన్నా కొత్తగా చేయాలని నిశ్చయించుకుంది. ఆ సమయంలోనే నేషనల్‌ ఉమెన్‌ కమిషన్‌ సభ్యురాలిగా పని చేస్తున్న ఆమె స్నేహితురాలు సోసో షైజానే  ‘మీ ప్రాంతంలో ఆపిల్స్‌ పండించగలవేమో చూడు’ అని సలహా ఇచ్చింది. అంతేకాదు మణిపూర్‌ నుంచి అందుకు ఆసక్తి చూపుతున్న కొంతమందిని హిమాచల్‌ ప్రదేశ్‌లో జరిగిన ఒక ఆపిల్‌ పంట శిక్షణా కేంద్రానికి పంపి అవగాహన కల్పించింది. ఇక పంట వేయడమే తరువాయి.

లో చిల్‌ ఆపిల్స్‌
ఆపిల్‌ పంట పండాలంటే శీతల వాతావరణం అవసరం. 10 నుంచి 12 నెలల్లో ఫలాలు చేతికొచ్చే ఈ పంటలో ఆపిల్‌ చెట్టుకు కనీసం 700 నుంచి 1000 గంటల శీతల వాతావరణం అవసరం. కాని మణిపూర్‌లో ఉష్ణ వాతావరణం ఉంటుంది. అందుకే షిమ్రే లో చిల్‌ ఆపిల్స్‌– అంటే 700 గంటల కన్నా తక్కువ శీతల వాతావరణం ఉన్నా బతికి బట్టకట్టే రకం ఆపిల్స్‌ను ఎంచుకుంది. అయితే ఆ పంటలో దిగాలని చూసినప్పుడు తండ్రి పెదవి విరిచాడు. కారణం అక్కడ పైనాపిల్‌ పండుతుంది తప్ప ఆపిల్‌ పండదు. తల్లి మాత్రం ‘ఆపిల్‌లో దాగిన విత్తు ఇచ్చే ఉద్యానవనాన్ని’ ఊహించగలిగింది. ‘పంట వెయ్‌’ అని ఉత్సాహపరిచింది. తన ఇంటికి కొన్ని గజాల దూరంలోని స్థలంలో 55 ఆపిల్‌ మొక్కల్ని 2019లో నాటింది షిమ్రే. మొదటి పూతను ఆమె పట్టించుకోలేదు. రెండో పూత పెరిగి పెద్దదయ్యి ఇప్పుడు దిగుబడి ఇచ్చింది. ‘మొత్తం 210 కిలోల ఆపిల్స్‌ వరకూ పండాయి. 150 కిలోలు కోసేశాం. ఇంకో అరవై డెబ్బై కిలోలు చెట్ల మీద ఉన్నాయి’ అని షిమ్రే చెప్పింది. 20 కిలోల ఆపిల్‌ బుట్ట మార్కెట్‌లో 2500 నుంచి 3000 వరకూ పలుకుతోంది. ఇది చాలా పెద్ద విజయం కింద లెక్క.

సి.ఎం ఆహ్వానం

షిమ్రే విజయం వెంటనే పత్రికలలో విస్తృతంగా ప్రచారం పొందింది. మణిపూర్‌ సి.ఎం బిరేన్‌ సింగ్‌ ఆమెను ఆహ్వానించి ఆపిల్‌ సాగుకు ఆసక్తి చూపే రైతులకు శిక్షణ ఇవ్వమని అందుకు ప్రభుత్వం స్పాన్సర్‌ చేస్తుందని చెప్పాడు. ‘నేను ఆపిల్‌ తోట వేసినప్పటి నుంచి చుట్టుపక్కల ప్రాంతాల స్త్రీలు, యువతులు వచ్చి ఈ పంటను ఆసక్తి చూశారు. తామూ ఈ పంట వేస్తామని చెప్పారు. మొక్కలు అడిగారు. అందరికీ సాయం చేసే వీలు నాకు లేదు. ఇప్పుడు ప్రభుత్వం ముందుకు రావడంతో త్వరలో మంచి ఫలితాలు రావచ్చని అనుకుంటున్నాను’ అంది షిమ్రే. ఆమె సాధించిన విజయం ఒక్క మణిపూర్‌లోనే కాదు మిజోరామ్‌లో కూడా రైతులకు కొత్త దారి చూపినట్టయ్యింది. ఆపిల్‌ సాగు కోసం వారంతా ఆసక్తి చూపుతున్నారు.

‘వజ్రాల కంపెనీ ఉద్యోగంలో ఉన్న సంతృప్తి కంటే ఈ సంతృప్తి ఎక్కువగా ఉంది’ అని షిమ్రే చెప్పింది.
మనం తినే తిండి, ఆరగించే ఫలం, వండే కాయగూర... ఇవన్నీ పురుషుడి శ్రమ దానం మాత్రమే కాదు. వాటి వెనుక స్త్రీల స్వేదం, శ్రమ, అలసట కనిపించనివ్వని చిరునవ్వు ఉన్నాయని మనం గ్రహించాలి. శభాష్‌ షిమ్రే.    

 

మరిన్ని వార్తలు