ఈ అబ్బాయికి  అద్భుత దీపం దొరికింది!

11 Nov, 2020 08:32 IST|Sakshi

పదమూడేళ్ల  వయసులోనే తొలి కంపెనీ ప్రారంభించి ‘యంగెస్ట్‌ సీయివో ఆఫ్‌ ఇండియా’గా సంచలనం సృష్టించాడు ఈ కుర్రాడు. ఐటీ కాలేజీల్లో చదువుకోలేదు. అసలు కాలేజీ మెట్లే ఎక్కలేదు. అయితే అతడి దగ్గర అద్భుతదీపం ఉంది. దాని పేరు సంకల్పబలం. ఆ బలాన్ని నమ్ముకుంటే ఎన్ని అద్భుతాలైన జరుగుతాయని చెప్పడానికి నిలువెత్తు ఉదాహరణ....అయాన్‌ చావ్లా...

ఎనిమిది సంవత్సరాల వయసులో ‘అమ్మా, నాకు కంప్యూటర్‌ కావాలి’ అని అడిగాడు అయాన్‌. ‘ఈ వయసులో కంప్యూటర్‌ ఎందుకు నాన్నా....బుద్ధిగా చదువుకోకుండా...’ అని కుంజమ్‌ చావ్లా అందో లేదో  తెలియదుగానీ ఒక ఫైన్‌మార్నింగ్‌ ఆ ఇంటికి కంప్యూటర్‌ వచ్చింది. ఆ కంప్యూటరే తన తలరాతని మార్చే అల్లావుద్దీన్‌ అద్భుతదీపం అవుతుందని అయాన్‌ ఆ క్షణంలో ఊహించి ఉండడు! రకరకాల వీడియోగేమ్స్‌ ఆడి విసుగెత్తిన అయాన్‌ దృష్టి ‘ఎడిటింగ్‌’పై పడింది. వీడియోలు, మూవీలు ఎడిటింగ్‌ చేసేవాడు. ఈ క్రమంలోనే టెక్నాలజీపై ఆసక్తి  మొదలైంది. ‘వీడియోలు సొంతంగా ఎడిట్‌ చేయగలుగుతున్నాను. వెబ్‌సైట్లు, సాఫ్ట్‌వేర్, యాప్‌లు క్రియేట్‌ చేయగలనా?’ అనే ఆలోచన వచ్చింది.  ‘ఇది ఎలా చేయాలి?’ ‘అది ఎలా చేయాలి?’ అని ఎవరినైనా అడిగితే– ‘చదువుపై దృష్టి పెట్టుకుండా ఇవన్నీ నీకెందుకు?’ అని తిడతారేమో అని భయం.

ఆ భయమే తనకు తాను గురువుగా మారే అవకాశం ఇచ్చింది. టెక్నాలజీకి సంబంధించి రకరకాల పుస్తకాలు కొనుక్కొని తలుపులు పెట్టుకొని గదిలో వాటిని శ్రద్ధగా చదివేవాడు. నెట్‌లో దొరికిన సమాచారాన్ని దొరికినట్లు చదివేవాడు. మొదట్లో  అర్థం కానట్లు, అర్థమై అర్థం కానట్లు....రకరకాలుగా ఉండేది. మొత్తానికైతే బాగుంది. 13 ఏళ్ల వయసులో కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌కు సంబంధించి 12 లాంగ్వేజ్‌లపై పట్టు సాధించాడు.

అమ్మ దగ్గర నుంచి తీసుకొన్న పదివేల రూపాయాల పెట్టుబడితో  2011లో సోషల్‌ కనెక్టివీటి ప్లాట్‌ఫాం గ్రూప్‌ ఆఫ్‌ బడ్డీస్, రెండు నెలల తరువాత ఏషియన్‌ ఫాక్స్‌ డెవలప్‌మెంట్‌(వెబ్‌ సోల్యూషన్స్‌), 2013లో మైండ్‌–ఇన్‌ అడ్వర్‌టైజింగ్‌(మీడియా–మార్కెటింగ్‌), గ్లోబల్‌ వెబ్‌మౌంట్‌(డోమైన్స్, వెబ్‌సైట్‌ అండ్‌ మోర్‌) కంపెనీలు మొదలుపెట్టాడు.

అయితే అయాన్‌ పని నల్లేరు మీద నడక కాలేదు. నిద్రలేని రాత్రులు ఎన్నో గడపాల్సి వచ్చింది. అయితే ఇదంతా కష్టం అని ఎప్పుడూ అనుకోలేదు. ఆ కష్టంలోనే తనకు ఇష్టమైన ‘కిక్‌’ కనిపించింది. మొదట్లో ఈ చిన్నవాడిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. తన మార్కెటింగ్‌ సేల్స్‌మెన్‌లకు ఇచ్చిన ప్రాధాన్యత కూడా ఇచ్చేవారు కాదు. ఆ తరువాత మాత్రం అయాన్‌లోని టాలెంట్‌ పదిమంది దృష్టిలో పడింది.

‘విషయం ఉన్న కుర్రాడు సుమీ’ అనే నమ్మకం ఏర్పడింది. కస్టమర్లు పెరిగారు. యూఎస్, యూకే, హాంగ్‌కాంగ్, టర్కీలలో అయాన్‌ కంపెనీలకు  శాఖలు ఉన్నాయి. లక్షలాది మంది కస్టమర్లు ఏర్పడ్డారు. 18 సంవత్సరాల వయసులో ‘యంగ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ పురస్కారాన్ని అందుకున్నాడు. ప్రధాని కార్యాలయం నుంచి ప్రత్యేక ప్రశంస లేఖ అందుకున్నాడు. నైట్‌ పార్టీలకు దూరంగా ఉండే అయాన్‌ చావ్లా  ప్రభుత్వ పాఠాశాలల్లోని పేద విద్యార్థును మోటివెట్‌ చేయడం అంటే ఇష్టం. క్షణం తీరికలేని వ్యవహారాల్లో నుంచి తీరిక చేసుకొని కాన్ఫరెన్స్, సెమినార్, వెబినార్‌లలో స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసాలు ఇస్తుంటాడు. 2014–2015లో ఫ్లోరిడాలో జరిగిన ‘ఎంటర్‌ప్రైజ్‌ కనెక్ట్‌’లో ఉపన్యాసకుడిగా అందరినీ ఆకట్టుకున్నాడు ఈ ఢిల్లీ కుర్రాడు.

‘విలువలు, అంకితభావం, సహనం...ఇలాంటివి మా అమ్మ నుంచి నేర్చుకున్నాను. ఆమె నా కలల పట్ల కఠినంగా వ్యవహరించి ఉంటే విజయాలు సాధించి ఉండేవాడిని కాదు’ అంటాడు తన తల్లి కుంజమ్‌ చావ్లా గురించి.
అసలు అయాన్‌ చావ్లా  కంపెనీ ట్యాగ్‌లైన్‌లోనే విజయరహస్యం దాగుంది.
బిల్డ్‌...గ్రో....ఇన్‌స్పైర్‌!
 

మరిన్ని వార్తలు