లంపీ చర్మ వ్యాధి..: సంప్రదాయ చికిత్స

21 Jun, 2022 06:32 IST|Sakshi
చికిత్సకు వాడే సంప్రదాయ దినుసులు; లంపీ చర్మ వ్యాధి సోకిన ఆవు

పశువుల చర్మంపై గడ్డల మారిదిగా వచ్చే ప్రాణాంతక వ్యాధి పేరు లంపీ చర్మ వ్యాధి. ఈ వ్యాధి గత ఏడాది తెలుగు రాష్ట్రాల్లో గో సంతతికి సోకింది. గత నెలలో గుజరాత్‌లో 5 జిల్లాల్లో 1,229 పశువులకు సోకింది. 39 పశువులు ప్రాణాలుకోల్పోయాయి. ఈ నేపథ్యంలో జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ రైతులకు ఇంటిపట్టున దొరికే సంప్రదాయ దినుసులతో కూడిన ఆయుర్వేద చికిత్సా పద్ధతులను రైతులకు అందుబాలోకి తెచ్చింది.

లంపీ చర్మ వ్యాధి చికిత్సకు 2 పద్ధతులున్నాయి.
1) తినిపించే మందు: లంపీ చర్మ వ్యాధి చికిత్స కోసం సంప్రదాయ దినుసులతో నోటి ద్వారా తినిపించే మందు తయారు చేసే పద్ధతులు రెండు ఉన్నాయి.  
మొదటి విధానం: ఈ చికిత్సలో ఒక మోతాదుకు అవసరమయ్యే పదార్థాలు: తమలపాకులు 10, మిరియాలు 10 గ్రాములు, ఉప్పు 10 గ్రాములు. ఈ పదార్థాలన్నిటినీ గ్రైండ్‌ చేసి పేస్ట్‌లాగా తయారు చేయాలి. తయారు చేసిన పేస్ట్‌కు తగినంత బెల్లం కలిపి పశువుకు తినిపించాలి. మొదటి రోజున ఇలా తాజాగా తయారు చేసిన ఒక మోతాదు మందును ప్రతి 3 గంటలకోసారి పశువుకు తినిపించాలి. రెండో రోజు నుంచి.. రెండు వారాల పాటు.. రోజుకు మూడు సార్లు (ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం) తాజాగా తయారు చేసిన మందును తినిపించాలి.  

రెండవ విధానం: లంపీ చర్మ వ్యాధికి సంప్రదాయ పద్ధతిలో మందును రెండు మోతాదులు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు. వెల్లుల్లి 2 పాయలు, ధనియాలు పది గ్రాములు, జీలకర్ర పది గ్రాములు, తులసి ఆకులు గుప్పెడు, బిరియానీ ఆకులు పది గ్రాములు, మిరియాలు పది గ్రాములు, తమలపాకులు 5, ఉల్లిపాయలు చిన్నవి రెండు, పసుపు పది గ్రామలు, నేలవేము ఆకుల పొడి 30 గ్రాములు, కృష్ణ తులసి ఆకులు గుప్పెడు, వేపాకులు ఒక గుప్పెడు, నేరేడు ఆకులు ఒక గుప్పెడు.. ఇంకా బెల్లం వంద గ్రాములు.

ఈ మందును కూడా ప్రతి సారీ తాజాగా తయారు చేయాలి. అన్నిటినీ కలిపి గ్రైండ్‌ చేసి పేస్ట్‌ చేసి, దానిలో బెల్లం కలపాలి. మొదటి రోజు ప్రతి 3 గంటల కోసారి తాజా మందు తయారు చేసి పశువుకు తినిపించాలి. రెండో రోజు నుంచి ప్రతిరోజూ మందును తాజాగా తయారు చేసి రోజుకు రెండుసార్లు చొప్పున పొద్దున్న, సాయంత్రం పశువు స్థితి మెరుగుపడే వరకు తినిపించాలి.

2) గాయంపై రాసే మందు: లంపీ చర్మం జబ్బు సోకిన పశువు చర్మంపై గాయం ఉంటే గనక, అందుకోసం ప్రత్యేకంగా సంప్రదాయ పద్ధతిలో మందు తయారు చేసి పై పూతగా పూయాలి. కావలసిన సామగ్రి: కుప్పింటాకులు 1 గుప్పెడు, వెల్లుల్లి పది రెబ్బలు, వేపాకులు ఒక గుప్పెడు, కొబ్బరి లేదా నువ్వుల నూనె 500 మిల్లీ లీటర్లు. పసుపు 20 గ్రాములు, గోరింటాకు ఒక గుప్పెడు, తులసి ఆకులు ఒక గుప్పెడు. తయారు చేసే విధానం.. అన్నిటినీ కలిపి మిక్సీలో వేసి పేస్ట్‌ తయారు చేయాలి. దానిలో 500 మిల్లీ లీటర్ల కొబ్బరి లేదా నువ్వుల నూనె కలిపి మరిగించి, తర్వాత చల్లార్చాలి.

రాసే పద్ధతి: గాయాన్ని శుభ్రపరచి దాని మీద ఈ మందును రాయాలి. గాయం మీద పురుగులు గనక ఉన్నట్లయితే.. సీతాఫలం ఆకుల పేస్ట్‌ లేదా కర్పూరం, కొబ్బరి నూనె కలిపి రాయాలి.
National Dairy Development Board యూట్యూబు ఛానల్‌లో లంపీ చర్మ వ్యాధికి చికిత్సపై తెలుగు వీడియో అందుబాటులో ఉంది.. ఇలా వెతకండి.. Ethno-veterinary formulation for Lumpy Skin Disease-Telugu.

మరిన్ని వార్తలు