మనకు అంతటి లక్కేది

3 Jan, 2021 13:56 IST|Sakshi

జానపద రసరాజు కొసరాజు పేరు చెప్పగానే గొప్ప జానపద గీతాలు స్ఫురిస్తాయి. కాని ఆయన నిశిత పరిశీలనతో పేకాట వ్యసనంపై గొప్ప పాట రాశారు. గుంటూరు జిల్లాలో ఆయనకు తెలిసిన ఎందరో ధనవంతులు పేకాట వ్యసనం వల్ల ఆస్తులూ, పొలాలూ పోగొట్టుకుని బికారులయ్యారు. ఆస్తులు పోగొట్టుకొని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్లున్నారు. పేకాటరాయుళ్ల బలీయమైన బలహీనతను రెచ్చగొట్టి ఉసికొల్పి అవహేళనతో ఆనందించేవాళ్లున్నారు. కులగోత్రాలు చిత్రంలో ఆయన రాసిన అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే... అనే పాట ఇలా పుట్టినదే. పేకాట చాలా పెద్ద వ్యసనం. డబ్బు పోయే కొద్దీ, పోగొట్టుకున్నవారిలో పౌరుషం పెరుగుతుంది. మళ్లీ ఎలాగైనా అంతా సంపాదించాలనుకుంటారు. కాని అదృష్టం కలిసి రావకపోవటమో, దురదృష్టం వెంటాడటమో కానీ, ఒకసారి డబ్బులు పోవటం మొదలైతే చివరిదాకా పోతూనే ఉంటాయి. ఇటువంటి వారిని నిశితంగా పరిశీలించి కొసరాజుగారు ఈ పాట రాశారు. ఇది గొప్పగా హిట్టయింది.

పాట చివరలో కొసమెరుపుగా వాళ్లను రెచ్చగొట్టి ఉసికొల్పే వాళ్ల ప్రలోభాలను ‘గెలుపు ఓటమి దైవాధీనం/ చెయ్యి తిరగవచ్చు/ మళ్లీ ఆడి గెల్వవచ్చు/ఇంకా పెట్టుబడెవడిచ్చు/ ఇల్లు కుదువ పెట్టవచ్చు/ఛాన్సు తగిలితే ఈ దెబ్బతో మన కరువు తీరవచ్చు/పోతే అనుభవమ్ము వచ్చు/ చివరకు జోల  కట్టవచ్చు’’ అనే ప్రలోభాత్మక వ్యంగ్య బాణాలు పేకాట వ్యసనపరుల గుండెల్లో గుచ్చుకుంటాయి. వాళ్లను ఉసికొల్పి రెచ్చగొట్టినవాళ్లు చివరకు తమ తప్పేమీ లేదని తప్పుకుంటారు. వాళ్ల దుస్థితి చూసి అవహేళన చేస్తారు. పేకాటపై పాట కొసరాజు మాత్రమే రాయగలరన్న ప్రచారం వచ్చింది. పేకాట సమాజంలో ఉన్నంతవరకు ఈ పాట నిలిచి ఉంటుంది. పేకాట ప్రియులు ఇందులో సందేశాన్ని గ్రహిస్తే సమాజం బాగుపడుతుంది.
 – సంభాషణ: వైజయంతి పురాణపండ

అయ్యయో చేతిలో డబ్బులు పోయెనే అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయెనే
ఉన్నది కాస్తా ఊడింది సర్వమంగళం పాడింది
పెళ్లాం మెళ్లో నగలతో సహా తిరుక్షవరమైపోయింది
ఆ మహామహా నలమహారాజుకే తప్పలేదు భాయీ 
మరి నువ్వు చెప్పలేదు భాయీ/అది నా తప్పు కాదు భాయీ
తెలివితక్కువగ చీట్ల పేకలో దెబ్బ తింటివోయి బాబూ నిబ్బరించవోయీ
నిలువు దోపిడీ దేవుడికిచ్చిన ఫలితం దక్కేది 
ఎంతో పుణ్యం దక్కేది/చక్కెరపొంగలి చిక్కేది
ఎలక్షన్లలో ఖర్చు పెడితే ఎంఎల్‌ఏ దక్కేది/మనకు అంతటి లక్కేది

డా. పి. వి. సుబ్బారావు
సినీసాహిత్య విమర్శకులు

చిత్రం: కులగోత్రాలు రచన: కొసరాజు
గానం: మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు

మరిన్ని వార్తలు