Azadi Ka Amrit Mahotsav: ఈ ఏడుగురు అద్భుతం.. మీ అందరికీ సలామ్‌!

28 Apr, 2022 17:08 IST|Sakshi

భర్త చనిపోయాడు. అప్పుడు ఆమె వయసు 14 సంవత్సరాలు. ఏమీ దిక్కుతోచని స్థితి. ఎవరో తీసుకెళ్లి కౌసని(ఉత్తరాఖండ్‌)లోని లక్ష్మీ మహిళా ఆశ్రమంలో చేర్పించారు. అక్కడ ఆమె జీవితం కొత్త మలుపు తీసుకుంది. ఇన్నిరోజులు ఇల్లే లోకంగా ఉన్న తనకు, లోకమే ఆశ్రమంగా పరిచయం అయింది. సమాజసేవ నుంచి పర్యావరణం వరకు ఎన్నో విషయాల గురించి తెలుసుకోగలిగింది.

కోసీ నది పరివాహక ప్రాంతాలలోని గ్రామాల్లో మహిళలు చెట్లు కొట్టేసి వంటచెరుకుగా ఉపయోగించేవారు. ‘ఇలా చేయడం తప్పు’ అని చెప్పకుండా ‘ఇలా చేస్తే మన పర్యావరణానికి ఎంత నష్టమో తెలుసా...’ అంటూ చెప్పేది.

అప్పుడు వారు తప్పును తెలుసుకొని తమ అలవాటును మార్చుకున్నారు. ఎవరైనా చెట్లు కొట్టడానికి వస్తే మూకుమ్మడిగా అడ్డుకునేవారు. కొన్నిసార్లు చట్టం చేయలేని పని చైతన్యం తెస్తుంది! ‘కోసీ నదిని రక్షించుకుందాం’ అనే నినాదంతో ఆమె చేసిన ఉద్యమం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఆమెను పర్యావరణ పోరాట యోధురాలిగా నిలిపింది.

ఆమె పేరు... బసంతిదేవి
నాగ్‌పూర్‌కు చెందిన ఆ అమ్మాయి చదువులో చురుకేమీ కాదు. అయితే సహాయ కార్యక్రమాలలో పాల్గొనడం, సాహసాలు చేయడం అంటే ఎంతో ఇష్టం. డిగ్రీ పూర్తయిన తరువాత ఎంబీఏ చేయాలనుకుందిగానీ ‘ఇది నా దారి కాదు’ అనుకోవడం తనను వేరే దారికి తీసుకు వెళ్లింది. యూనిఫామ్‌ ధరించాలనేది తన కల. ఫైర్‌ ఇంజనీరింగ్‌ కోర్స్‌కు అప్లై చేసింది. నాగ్‌పుర్‌లోని నేషనల్‌ ఫైర్‌ సర్వీస్‌ కాలేజిలో అడ్మిషన్‌ లభించింది. ఆ కాలేజీలో ప్రవేశం పొందిన తొలి మహిళగా గుర్తింపు తెచ్చుకుంది.

ఆమె పేరు... హర్షిణి కన్హేకర్‌
ఇండియాలో ఫస్ట్‌ ఉమన్‌ ఫైర్‌ఫైటర్‌. ‘సాహసం, త్యాగం స్త్రీల రక్తంలోనే ఉంది’ అంటున్న హర్షిణి ఇప్పుడు ఎంతో మంది మహిళలకు స్ఫూర్తి ఇస్తోంది. ‘ఈ సమయంలో బయటికి వెళ్లడం అవసరమా!’ అన్నారు ఇంట్లోవాళ్లు. ‘మంచిపని చేయడానికి సమయంతో పనిఏమిటి’ అని అన్నది ఆమె. పూనమ్‌ నౌతియాల్‌ ఎప్పుడూ అంతే!

ఉత్తరాఖండ్‌లోని బగేశ్వర్‌లో హెల్త్‌వర్కర్‌గా పనిచేసే పూనమ్‌ వ్యాక్సినేషన్‌ అనే మహాయజ్ఞంలో అత్యంత చురుకైన పాత్ర నిర్వహించింది. రోజూ పది నుంచి పన్నెండు కిలోమీటర్లకు పైగా మారుమూల గ్రామాలకు నడిచి వెళ్లేది. చెమటలు కక్కుకుంటూ అంతదూరం వెళితే... చాలామంది వ్యాక్సిన్‌ అంటే విముఖతగా ఉండేవారు.

ఆ సమయంలో తాను ఒక టీచరై వారికి పాఠం చెప్పేది. వ్యాక్సిన్‌ వేసుకోవడం వల్ల ప్రాణాలను ఎలా కాపాడుకోవచ్చో చెప్పే పాఠం అది. తల్లిగా మారి బుజ్జగించేది. సహ ఉద్యోగులు డీలా పడితే వారిలో ఉత్సాహం నింపేది.

పూనమ్‌ పేరును మన ప్రధాని ‘మన్‌ కి బాత్‌’ కార్యక్రమంలో ప్రత్యేకంగా ప్రస్తావించి ప్రశంసించారు. ఉద్యోగవిధిని ఉద్యమంలా మార్చిన ఆమె ఎంతోమందికి స్ఫూర్తి. అలెప్పి (కేరళ)కు చెందిన ఆ అమ్మాయి చదువులో ఎప్పుడూ ముందుండేది. తుంబ రాకెట్‌ లాంచింగ్‌ స్టేషన్‌ను చూస్తూ పెరిగిన ఆమెకు అప్పటినుంచి రాకెట్‌లు, క్షిపణులు అంటే ఆసక్తి పెరిగింది. ఆ ఆసక్తి తనను ఎక్కడి దాకా తీసుకువెళ్లిందంటే ‘మిస్సైల్‌ ఉమన్‌ ఆఫ్‌ ఇండియా’ స్థాయికి చేరుకునేంతగా!

ఆమె పేరు... డా. టెన్సి థామస్‌
‘ప్రకృతి అద్భుతశక్తులను, అద్భుతమైన ఆలోచనలను మనకు ఇస్తుంది. అభివృద్ధి పేరుతో ప్రకృతిని ధ్వంసం చేయడం అంటే మనల్ని మనం ధ్వంసం చేసుకోవడమే’ అంటారు థామస్‌.

... వీరు మాత్రమే కాదు 2017లో ఎవరెస్ట్‌ శిఖరాన్ని రెండుసార్లు అధిరోహించిన అన్షు జంజనంప, ఫస్ట్‌ ప్రొఫెషనల్‌ ఫిమేల్‌ స్టాండ్‌–అప్‌ పాడ్లర్‌ (ఇండియా) తన్వీ జగదీష్, సోలోగా అట్లాంటిక్‌ మహాసముద్రాన్ని క్రాస్‌ చేసిన యంగెస్ట్‌ ఫస్ట్‌ ఉమన్‌ పైలట్‌ అరోషి పండిట్‌ ‘సూపర్‌ సెవెన్‌’ (ఉమెన్‌ ఛేంజ్‌ మేకర్స్‌) జాబితాలో ఉన్నారు.

‘ఆజాది కా అమృతోత్సవ్‌’లో భాగంగా వివిధ రంగాలకు చెంది ఏడుగురు మహిళల కృషి, విజయాలను కళ్లకు కట్టేలా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ వెబ్‌సిరీస్‌ను రూపొందించింది. ఈ వెబ్‌సిరీస్‌లు ప్రసిద్ధ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానున్నాయి.

చదవండి👉🏾Russia-Ukraine: చెప్పినట్లు వింటావా.. లేదంటే మరో 20 మంది మగాళ్లను తీసుకురమ్మంటావా?

మరిన్ని వార్తలు