Azadi Ka Amrit Mahotsav: అప్పుడు తులం బంగారం విలువ 88 రూపాయల 62 పైసలు! ఈ విషయాలు తెలుసా?

15 Aug, 2022 17:36 IST|Sakshi

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరం నాటి కొన్ని నిజాలు.. కొందరు సమర యోధులకు సంబంధించి అంతగా ప్రచారంలో లేని కొన్ని విషయాలను తెలుసుకుందాం...

►మన జాతీయ జెండాను తొలిసారిగా ఎగురవేసింది 1947, ఆగస్ట్‌ 15న కాదు.. 1906, ఆగస్ట్‌ 7న కోల్‌కతాలోని పార్సీ బగన్‌ స్క్వేర్‌ (గ్రీన్‌ పార్క్‌)లో. 
►చరిత్ర ప్రకారం భారత దేశం.. ఓ శాంతి కపోతం. గత లక్ష ఏళ్లలో ఈ దేశం ఏ దేశాన్నీ ఆక్రమించలేదట. 
►మనకు స్వాతంత్య్రం వచ్చేనాటికి మన రూపాయి విలువ అమెరికన్‌ డాలర్‌తో సమానంగా ఉండేది. ఆ సమయంలో మన దగ్గర తులం బంగారం విలువ 88 రూపాయల 62 పైసలు. 

►ఈ దేశానికి అసలు జాతీయ భాషంటూ లేదు. ఆర్టికల్‌ 343(1) ప్రకారం హిందీ అధికార భాష తప్ప జాతీయ భాష కాదు. 
►ది రిపబ్లిక్‌ కాంగో, సౌత్‌ కొరియా, నార్త్‌ కొరియా, బహ్రైన్, లిక్టన్‌స్టెయిన్‌ మొదలైన దేశాలు కూడా మనతో పాటు ఆగస్ట్‌ 15న స్వాతంత్య్ర దినోత్సవ సంబురాలు ►జరుపుకుంటున్నాయి. 
►ఇండియన్‌ బౌండరీ కమిటీస్‌ చైర్మన్‌ రాడ్‌క్లిఫ్‌ తన జీవితకాలంలో ఇండియాను సందర్శించింది లేదు. అయినా భారత దేశ విభజన రేఖ గీశాడు. ఇటు ఈ దేశానికి అటు పాకిస్తాన్‌కూ సరిహద్దులు నిర్ణయించాడు. తన అవగాహన లేమి నిర్ణయం వల్ల లక్షల మంది నిరాశ్రయులయ్యారన్న నిజం తెలుసుకుని చాలా దుఃఖపడ్డాడట. ఈ విభజన రేఖ కోసం బ్రిటిష్‌ ప్రభుత్వం ఆయనకు ఇవ్వాలనుకున్న 40 వేల రూపాయల పారితోషికాన్నీ తిరస్కరించాడట. 

►మన తొలి ప్రధాని.. జవహర్‌లాల్‌ నెహ్రూ నాటి స్టయిల్‌ ఐకాన్‌. ఆయన ధరించిన కోటు నెహ్రూ జాకెట్‌గా ఫేమస్‌ అనే విషయం అందరికీ తెలిసిందే. ఆ కోటుతో ఆయన వోగ్‌ మ్యాగజైన్‌ కవర్‌ మీద ప్రింట్‌ అయ్యాడనే విషయం తెలుసా! అప్పటి నుంచి పాశ్చాత్య దేశాల్లో ఆ నెహ్రూ జాకెట్‌ ఫ్యాషన్‌ ట్రెండ్‌గా నిలిచిందట. 
►విప్లవ వీరుడు భగత్‌ సింగ్‌ బహుభాషా కోవిదుడు. పంజాబీ, హిందీతోపాటు ఫ్రెంచ్, స్వీడిష్, ఇంగ్లిష్, అరబిక్‌ భాషలను అనర్గళంగా మాట్లాడేవాడు. 
►సర్దార్‌ వల్‌భ్‌ భాయ్‌ పటేల్‌ పుట్టిన రోజును అక్టోబర్‌ 31న జరుపుకుంటున్నాం కదా! నిజానికి అది ఆయన నిజమైన బర్త్‌డే కాదట. ఏదో పరీక్ష రాసే సమయంలో ఆయన పుట్టిన తేదీ అడిగారట పరీక్ష నిర్వాహకులు. అప్పటికప్పుడు తట్టిన అక్టోబర్‌ 31 అని చెప్పేశాడట. అదే రికార్డ్‌ అయ్యి.. స్థిరపడిపోయింది.  
చదవండి: 75 ఏళ్ల స్వాతంత్రమే కాదు.. మరో మైలు రాయి కూడా! అర్ధశతాబ్దపు ‘పిన్‌’ గురించి ఈ విషయాలు తెలుసా?

మరిన్ని వార్తలు