మరోకథ: ఎండ గుర్తు

19 Sep, 2021 14:04 IST|Sakshi

నగరానికి వచ్చిన ఇన్నేళ్ళ తరవాత, ఇన్నిన్ని రోడ్లు తిరిగి, ఇన్ని ఉద్యోగాలు చేసి, ఇంత మందితో కలిసితిరిగి చివరికి అందరినీ మరచిపోయి, ముసలితనానికి దగ్గరపడుతున్న ఈ వయసులో ముప్పైఏళ్ళ క్రితం ఓ మధ్యాహ్నం హోటలులో కలసి భోంచేసిన లాయరు ఎందుకో గుర్తుకొస్తుంటాడు.

చాలా యేళ్ళ క్రితం, హైదరాబాద్‌కి వచ్చిన కొత్తలో, ఏదో ఒక జాబులో సెటిలవుదామను కుంటున్న రోజుల్లో టెంపరరీగానే అనుకుంటూనే యేడేళ్ళు ఒక లాయరు దగ్గర స్టెనోగా పనిచేశాను. అదంతా ఒక వృథా కాలయాపన. 

రాజుగారికి ఏడుగురు కొడుకులన్నట్లు ఆ లాయరుగారికి ఏడుగురు జూనియర్లుండేవారు. అందరూ పాతికేళ్ళ వయసుకు అటూ ఇటూగా ఉండేవారు. మా లాయరుగారు వాళ్ళకి జీతం కూడా ఏడువందలే ఇచ్చేవాడు. ఏడువందలంటే ఏడువేలనుకునే పూర్వపురోజలు కూడా కావవి. ‘మా సీనియరు నాకు ఆ మాత్రం కూడా ఇచ్చేవాడు కాదు’ అనేవాడు ఆ సీనియరు లాయరు జీతం ఇచ్చేరోజు ఒక్కొక్క నోటు జాగ్రత్తగా లెక్కపెట్టి ఇస్తూ. జూనియర్లు కట్టుబానిసల్లా పనిచేస్తేనే చేతికి పనొస్తుందని ‘పని నేర్చుకోండయా.. ముందు పని నేర్చుకోండి..’ అని నిత్యం వల్లించేవాడు. వాళ్ళకు తోడు మరొక ప్లీడరు గుమాస్తా. గుమాస్తాకి తోడు స్టెనోగా పనిచేసే నాకు ఏడొందలే ఎందుకో అర్థం కాలా. సరేలే అది మన ఖర్మ అనుకున్నా, జీవితం గడిచిపోతుందికదా అనుకుంటూ. ఇప్పటికీ అదే జబ్బు.

ఆ లాయరుగారి దగ్గర పనిచేసినంతకాలం నా కడుపులో ఆకలి నకనకలాడుతుండేది, టకటకమని టైపు మిషను కొట్టడం మూలాన కాబోలు. లాయరుగారికి పైన అంతస్తులో ఆఫీసు, కింద కాపురం. ఆయన కూర్చునే టేబులు విశాలంగా ఉండేది. సరిగ్గా ఆయన కూర్చునే సీటుకి ఎదురుగా టేబులు మీద చిన్నపాటి అద్దం, అద్దం కింద ఎవరో స్వామీజీ ఫోటో ఉండేది. నేనెప్పుడూ ఆ స్వామీజీ ఫొటో సరిగ్గా చూసిందిలేదు. ఇతరులతో మాట్లాడేటప్పుడో, పనిలో ఉన్నప్పుడో ప్రతి ఐదారు నిమిషాలకి ఒకసారి లాయరు చేత్తో ఆ ఫొటోని తాకి కళ్ళకద్దుకునేవాడు. ఒకసారి ఆ స్వామీజీ ఎవరా అని చూస్తుంటే మధ్యలో గుమాస్తా లోపలికి వచ్చి ‘ఆయన ఐఏయస్‌ చదువుకున్న స్వామీజీ’ అని ఇంకో వివరం ఇచ్చాడు. ఎవరో కుర్ర బాబా, నేనెప్పడూ బయట పేపర్లలో చూసిన ఫొటోకాదు. 

నేనెప్పడూ డిక్టేషను తీసుకోడానికి అనువుగా సీనియరు లాయరుగారికి దగ్గరగా కుడివైపునో ఎడమవైపునో కూర్చునేవాడిని. ఎదురుగా పార్టీలో, డిపార్టుమెంటువారో కూర్చునేవారు. ఆరోజుల్లో ఆయన అదేదో గవర్నమెంటు డిపార్టుమెంటు తరపున హైకోర్టులో వాదించేవాడు.

ఇదిలా ఉండగా ఆఫీసులో జూనియర్లతోపాటు పనిచేయడానికి కొత్తగా మరొకరు వచ్చారు. చూడటానికి ఆయన జూనియరుకి ఎక్కువగాను  సీనియరుకు తక్కువగానూ కనిపించేవాడు. మనిషి మాట్లాడటంకంటే తలూపటం ఎక్కువగా ఉండేది. వచ్చినరోజే ఆయన తనతోపాటు తెచ్చుకున్న మాసిన నల్లకోటును గోడకు తగిలించాడు, పొద్దున్న పూట ఇటునుంచి ఇటే కోర్టుకి వెళ్ళడానికి. ఆ కోటుకి భుజంమీద, వీపుమీదా ఒకటిరెండు చోట్ల చిరుగులుండేవి. ఆయన చూట్టానికి పొట్టిగా వెడల్పుగా ఉండేవాడేగాని లావుగా ఉండేవాడు కాదు. మీసాలులేని గుండ్రటి పేడిమూతి మొహం. గుండు చేయించుకున్నాక నెలరోజుల్లో ఎంత జుట్టు పెరుగుతుందో ఆయన జుట్టు ఎప్పుడూ అంతే ఉండేది. కాస్తంత పెరిగేదీ కాదు, తరిగేదీ కాదు. సగం తెలుపు, సగం నలుపు. మీసాలు లేని ఆ పలచటి జుట్టున్న వెడల్పు మొహానికి కుండలాలు పెడితే అచ్చమైన పండితుడు ఇలానే ఉంటాడేమో అనిపిస్తుంది, ఇన్ని సంవత్సరాల తరవాత, ఆయన గుర్తుకొచ్చినప్పుడు. ఆయనపేరు రామకృష్ణ్ణ. ఎప్పుడూ గోడవైపు కిటికీ కర్టెనుకానుకుని కూర్చుని ఫైల్సు చూస్తూ ఎవరైనా పలకరిస్తే వెడల్పాటి మొహంతో మోర పైకెత్తి మాట్లాడేవాడు.

‘ఎవరో కొత్తసారు జాయినట్లున్నాడు’ అనంటే మా గుమాస్తా ‘కోర్టులో కొంతమంది ప్రాక్టీసులేని ప్లీడర్లు ఇలా జూనియర్లుగా చేరతారు’ అనేశాడు ఆయన ముందే. 
‘అంతమాటనేశాడేంటి’ అని కిందామీదా కంగారుపడి ఆయన వంక చూస్తే అదేమీ పట్టించుకోకుండా నిశ్చింతగా ఏదో ఫైలు చూసుకుంటూ కనిపించాడు. 

గుమాస్తా అన్నదానికి తగ్గట్టే ఆ కొత్తలాయరు చూడటానికి బతకటం చేతగానివాడుగానో, ప్రాక్టీసులేని పూర్‌ లాయరుగానో కనిపించాడు.  
మా సీనియర్‌ లాయరు ఆయన పలకరించినప్పుడల్లా చిరాకు పడేవాడు. ఇంగ్లీషు గ్రామరు తప్పుగా ఉందనో, కోర్టువారి ప్రొసీజరనో ఏదో ఒక వంకపెట్టి ‘ఆ మాత్రం తెలీదా’ అని చివాట్లు పెట్టేవాడు. బహుశా ఆయన్ని ఆఫీసులో చేర్చుకోవడం సీనియారుగారికి ఇష్టంలేదనుకుంటాను. జూనియర్లకంటే కాస్తంత ముసలోడిగా కనిపించే ఆయనకి కూడా ‘ఏడొందలే’ ఇవ్వాల్సొస్తుందన్న సాకు కావచ్చు. దాదాపు ఆయన గదమాయింపులకే చేరిన ఆరునెలలకే ఆఫీసు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. 

మాకు శని, ఆదివారాలు ఉదయం నుంచి సాయంత్రందాకా ఆఫీసుండేది, ఆ రెండురోజులు కోర్టుకు సెలవులు కనుక. ఉదయం పదికో ఎప్పుడో మొదలైతే సాయంత్రం ఆరుదాకా నడిచేది. వాళ్ళందరికీ ఆటవిడుపుగా ఆనిపించే ఆరెండురోజులు నాకు మాత్రం రెండురోజులు ఉపవాసదీక్ష చేస్తున్నట్టు నరకం కనపడేది. మధ్యాహ్నం భోజనానికి లేదా లంచ్‌కి కాసేపు బయటగడిపి వచ్చేవాడిని. ఎప్పుడన్నా డబ్బులుంటే ఇరానీ హోటల్లో టై బిస్కట్లు టీలో నంచుకుని తినడం లేదంటే పస్తులుండటమే. పైన ఒకపక్క ఆకలి దహించుకుపోతుంటే కిందనుంచి ఆదివారపు మసాలా వాసనలు వస్తుండేవి. సాయంత్రం ఏ నాలుక్కో బిస్కట్లు, టీకప్పులతో ట్రే వచ్చేది. అలాంటి ఆదివారాలతో మూడునాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి. 

అలాంటి ఆదివారాల్లో ఒకరోజు మిట్టమధ్యాహ్నం దాటిన మధ్యాహ్నం నేను టైపురైటరు టకటకలాడిస్తుండగా ‘భోంచేశారా?’ అని చెక్క బీరువాల మధ్య నుంచి పలకరింపు వినపడింది. అప్పటికే సీనియరుగారు కింద భోజనం కానిచ్చి నిద్రకి ఉపక్రమించి ఉంటారు. ఒకరిద్దరు జూనియర్లు, నేనూ,  జూనియరూ, సీనియరు కాని ఈ లాయరూ మిగిలాం భోజనానికి బయటికెళ్ళడానికి.

ఆరోజుల్లో మధ్యాహ్న భోజనాలు టీతోపాటు టైబిస్కట్లతో కానిచ్చేసేవాడినే కానీ కాస్త జేబులో ఎక్కువ చిల్లరుంది అని నమ్మకం కలిగితే ఫైన్‌ బిస్కట్‌తో పండగ చేస్తుండేవాడిని. ఎంత దరిద్రం ఉన్నా టీ తాగాక సిగరెట్టు మాత్రం కంపల్సరీ. 
‘ఒకపక్క జేబులో చూస్తే అంతంతమాత్రమే ఉన్నాయి. ఈయన భోజనానికి రమ్మంటున్నాడు’ అని ఆలోచించేలోపే
‘పర్లేదు రండి నాదీ హోటలు భోజనమే. ఇద్దరం కలిసి వెళ్దాం’ అని మళ్ళీ పిలిచాడు.
‘సరే.. భోజనానికంటూ ముందు బైటికెళ్ళాలిగా..’ అనుకుని పేపర్లు సర్దేసి ఆయనతోపాటు కిందికి దిగుతూ ‘ఏంసార్, ఈరోజు మీ ఇంట్లోవాళ్ళు లేరా?’ అన్నాను.

ఆ నడివయసు పెద్దమనిషి సిగ్గుపడుతున్నట్లు మొహంపెట్టి ‘అయావ్‌ు అన్‌ మారీడ్‌’ అన్నాడు.
‘ఇంత వయసొచ్చినా ఈయనకింకా పెళ్ళెందుకు కాలేదు’ అని అప్పుడు ఆలోచించలేదు. ఆపూట భోజనానికెళ్తున్నాం అనే ఆనందంలో. 
మళ్ళీ ఆయనే ‘నేను పెళ్ళి చేసుకోలేదండి. తల్లిదండ్రులను చూసుకుంటూ జీవితం గడిపేశాను. మానాన్న గారికి పక్షవాతం ఉండేది. నేనే చేయాల్సొచ్చేది. ఈమధ్యే మా అమ్మగారు కూడా పోయారు’ అన్నాడు బరువుగా మెట్లు దిగుతూ. 
మా ఇద్దరిమధ్య కనీసం పాతికేళ్ళన్నా వయసు తేడా ఉంటుంది. ఆయన నన్ను ‘అండి’ అని సంభోదించినందుకు ఆశ్చర్యపడుతూనే లోలోపల గర్వంతో సంతోషపడుతూ ఆయన చెప్పిన సమాధానం విని పెద్దరికపు మొహంపెట్టి మౌనంగా ఉండిపోయాను.
ఖరీదైన కాలనీలో రోడ్డుకిరువైపులా పొడవాటి పాతకాలం నల్లటి చెట్లు, వాటి నీడలకింద నడుస్తూ రెండు వీధులు దాటి మెయిన్‌రోడ్డు బజారుకు వచ్చాము.

మేమిద్దరం నడిచినంతమేరా ఆయన నా తల్లిదండ్రుల గురించి, నా స్వగ్రామం, అక్కడకి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న నా రూము, వంట గురించి వాకబు చేశాడు. ఆ మండే ఎండల రోజుల్లో నన్నెవరూ అలా అడిగింది లేదు. 

హోటలులో బల్లముందు కూర్చున్నాక ‘నేను ఫుల్‌మీల్స్‌ తింటాను. మీకు ఏంకావాలో చెప్పండి’ అన్నాడు.
‘ఫుల్‌మీల్స్‌కీ ప్లేట్‌మీల్స్‌కీ ఫుడ్డులో తేడా ఎంతుంటుందో, ఇంతకీ డబ్బులు ఆయన కడతాడా లేక లోపల నేను పప్పు రుబ్బాల్సోస్తుందా’ అని జేబులు తడుముకుంటున్నంతలో అటు వెయిటర్‌ రావడమూ, ఇటు ఈయన రెండు ఫుల్‌మీల్స్‌ ఆర్డరు ఇవ్వడమూ జరిగిపోయింది. 
ఆయన నిదానంగా తింటూ, మధ్యమధ్యలో మాట్లాడుతూ చివరలో రెండుసార్లు సాంబారు వేయించుకున్నాడు.
నేను నాముందు పెట్టిన కూరలన్నీ రుచి చూశాను. పాపడ అయిపోతే ఆయన మళ్ళీ ఒకటి వేయించాడు.
భోజనంబల్ల ముందు కుంగిన భుజాలతో గొడుగులా కూర్చున్న ఆయన్ని చూస్తే ఎందుకో నవ్వొచ్చింది.

‘మరి మీకు రాత్రిపూట భోజనం ఎలా?’ అనడిగాను.
‘పగలు కోర్టు క్యాంటీన్‌లో, రాత్రిపూట రొట్టె చేసుకుంటా’ అన్నాడు పెరుగు గిన్నె అన్నంలో ఒంపుకుంటూ.
బిల్లుకట్టే కౌంటరు దగ్గర నేను జేబు తడుముకోబోతే తనే డబ్బులు తీస్తూ, ‘శ్యావ్‌ు గారూ, ఈవేళ నా దగ్గర డబ్బులున్నాయి. మనిద్దరం కలిసి భోంచేశాం’ అన్నాడు.
ఆయన అలా ఎందుకన్నాడో ఆరోజు నాకు బోధపడలేదు.
నేను మాత్రం ‘అమ్మయ్య.. బతికానురా దేవుడా’ అనుకున్నాను. కడుపు ఇంకాస్త నిండింది.
హోటలు నుంచి బయటికి వచ్చాక ‘సిగరెట్టు కాలుస్తారా?’ అనడిగాడు.
నేను ఉలిక్కిపడి ‘అబ్బే లేదండీ’ అన్నాను కంగారుగా ఈయనకెలా తెలుసనుకుంటూ.
‘మీరు కాలుస్తారని గుమాస్తా చెప్పాడు. పర్లేదు కాల్చండి. నేనూ కంపెనీ ఇస్తాను. నాకు అలవాటు లేదు. ఎప్పుడన్నా మీలాంటి వాళ్ళు కాల్చినప్పుడు..’ 
‘ఈ ముసిలోడు ఒక పాకెట్‌ అయినా కొనుంటే బాగుండేది’ అనుకున్నాను సిగరెట్‌ ముట్టించి పొగవదులుతూ.
ఆయన తాగేతీరు చూస్తే ఎప్పుడూ కాల్చేమనిషిలానే కనపడ్డాడు. ఆఫీసులో బిక్కుబిక్కుమంటూ కూర్చునే మనిషి బయట బేఫికర్‌గా ఉన్నాడు.
ఆయనంత దర్జాగా, ధీమాగా ఉండటం నాకు నచ్చలేదు. వినయసంపన్నుడిలా ఆయన ముందు నుంచున్నాను.
‘ఇంటరు తప్పి టైపూ షార్టుహాండూ నేర్చుకుని ఇంటి నుంచి పారిపోయి వచ్చేననీ, బస్తీలో ఉంటున్నానీ, ఒక్కడ్నే వంటనీ’ నేను చెప్తే  
‘షార్టుహాండుకి చాలా విలువుందనీ, గవర్నమెంటు సెక్టారులోనూ, ప్రైవేటు కంపెనీల్లో దానికి చాలా డిమాండుందనీ, బయట అవకాశాలవైపు చూడమనీ ముందు ముందు ఇంకా చాలా జీవితం ఉందనీ’ చాలా చెప్పుకొచ్చాడు. 

ఆరోజు తరవాత ఆయనతో ఎక్కువ కలిసింది లేదు. ఆఫీసులో పెద్దగా మాట్లాడింది కూడా లేదు. 
నా సీటుకి వెనకాల బల్లముందు మూగే జూనియర్లు ఆయన మీద జోకు వేసినప్పుడు వాళ్ళతో కలిసి నవ్వేవాడిని. ఆయన చూస్తుండగానే.
ఆయన మానేసిన తరవాత ఎప్పుడన్నా జూనియర్లు ఆయన గురించి చెప్పుకునేవారు. ఆరోజు ఆయన బార్‌ కౌన్సిల్‌ అసోసియేషన్‌లో హాల్‌లో కూర్చుని ఏదో చదువుకుంటున్నాడనో, కోర్టులో పాతబడ్డ నల్లటి చెట్లకింద ఎండుటాకుల మీద ఏమీ తోచక నడుస్తున్నాడనో, క్యాంటీన్‌లో టేబుల్‌మీద ఇడ్లీసాంబారు పెట్టుకుని ఆలోచిస్తూ కూర్చున్నాడనో. ఏమయితే నాకెందుకని ఆరోజుల్లో ఎప్పుడూ ఆయన గురించి పట్టించుకోలేదు నేను.
తొందరలోనే మరిచిపోయాను.

ఆయన వెళ్ళిపోయిన బహుశా రెండేళ్ళకనుకుంటా నేనక్కడ మానేశాను. ఆ తరవాత చాలా ఆఫీసులు, కంపెనీలు మారాను. ఎంతో మంది మనుషులు కలిసి స్నేహితులై కొంతకాలానికి వాళ్ళూ కనుమరుగైపోయారు. సంవత్సరాలు గడిచిపోయాయి. సీనియరు లాయరుగారు ఆ తరవాత హైకోర్టుజడ్జిగా చేసి రిటైరు గూడా అయిపోయారు. ఆయన చలవతో ప్లీడరు గుమాస్తా హైకోర్టులోనే గుమాస్తాగాచేరి అతను కూడా ఇప్పుడు రిటైరయ్యే దశలో ఉన్నాడని విన్నాను. ఆ సీనియరు లాయరుగారి జూనియర్లెవరూ లాయరు ప్రాక్టీసులో కుదరక కొందరు ప్రైవేటుద్యోగాలు చూసుకుంటే కొందరు ఎటూగాక కిరాణా చిల్లరకొట్లు పెట్టుకున్నారు. వాళ్ళలో పేర్లతో సహా నాకు ఒక్కరు కూడా గుర్తులేరు. మా అమ్మ పాతకాలం రగ్గుని ఒదిలేసినట్లు, క్షణకాలంపాటు కనిపించి పక్కకు నడుచుకుంటూ వెళ్ళిపోయిన మనిషిని మళ్ళీ తలుచుకోనట్లు ఆయన్ని కూడా ఆరోజుల్లోనే మరిచిపోయాను. ముప్పైఏళ్ళపాటు ఆ మనిషి నాకేమాత్రం గుర్తుకురాలేదు. 

ఆ తరవాత ఈ ముప్పైఏళ్ళ కాలంలో చాలా ఆఫీసులు మారాను. ముప్పైరెండేళ్ళ వయసులో పెళ్ళి చేసుకున్నాను. పదేళ్ళ కాపురం తరవాత ఆవిడా చనిపోయింది. నా కొడుకు అమ్మమ్మ దగ్గరుండిపోయాడు. నేను మళ్ళీ ఒంటరిగా మిగిలాను. ఒకసారి గుండెనొప్పి వచ్చి బ్యాంకులో దాచిన కొద్దిమొత్తం కాస్తా హాస్పిటల్‌లో కట్టేశాను. మిగిలిందేమీ లేదు. నా స్నేహితులు కొందరు మరణించారు. కొందరు స్నేహితుల పిల్లలు పెళ్ళీడుకుకూడా వచ్చారు.

ఇన్నేళ్ళ తరవాత, ఇంత జీవితం చూసి, ఇన్ని వీథులు తిరిగి, ఇన్ని ఉద్యోగాలు చేసి, ఇంత మందితో కలిసితిరిగి మరిచిపోయిన ఈ మాహానగరంలో, ముసలితనానికి దగ్గరపడుతున్న ఈ వయసులో ఎప్పుడన్నా ఆ పూట కలిసి భోంచేసిన చిరుగుకోటు లాయరు గుర్తుకొస్తుంటాడు వెడల్పాటి మొహంతో.. ఎందుకనో. ఆరోజు అక్కడ వీథి మలుపు తిరుగుతూ, పొడవాటి చల్లని చెట్లకింద నడుచుకుంటూ ‘తల్లిదండ్రులతోనే  జీవితం గడిచిపోయిందని’ చెప్పిన మాటలు ఎందుకనో ఇప్పుడూ వింతగా వినిపిస్తుంటాయి చెవుల్లో. అంతకంటే చెప్పేదేంలేదు. అతని గురించి నాకు ఇంకేమీ గుర్తులేదు. కానీ ఏ క్షణానో, ఏ చీకట్లోనో తటాలున గుర్తుకొచ్చి మాయమవుతుంటాడు. ఎందుకో తెలీదు మరి.

-బి.అజయ్‌ ప్రసాద్‌

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు