కొందరూ నెలల పిల్లలు నవ్వితే వాంతులవుతుంటాయి ఎందుకు?

11 Feb, 2024 10:19 IST|Sakshi

ఆరు నెలల లోపు చిన్నపిల్లలు కొందరిలో... వాళ్లు బాగా నవ్వుతున్నా, వేగంగా కాళ్లూచేతులు కదిలిస్తున్నా వెంటనే వాంతులు అవుతుంటాయి. అప్పటివరకూ వాళ్లు చురుగ్గా ఆడుతుండటం చూసిన తల్లిదండ్రులకు... అంతలోనే ఎదురైన ఆ సంఘటన ఎంతగానో ఆందోళన కలిగిస్తుంది. నిజానికి అది ఏమాత్రం అపాయకరం కాని ఒక కండిషన్‌. దాన్ని ‘గ్యాస్ట్రో ఈసోఫేజియల్‌ రిఫ్లక్స్‌’ అంటారు. ఈ కండిషన్‌ కారణంగానే ఈ నెలల పిల్లలకు ఈ తరహాలో వాంతులవుతుంటాయి. 

చిన్నారుల పొట్ట కింది భాగంలో లోయర్‌ ఈసోఫేగస్‌ స్ఫింక్టర్‌ అనే కండరాలు పొట్టలోపలికి వెళ్లిన ఆహారాన్ని మళ్లీ పైకి రాకుండా నొక్కిపెడతాయి. కొందరిలో ఈ స్ఫింక్టర్‌ కండరాలు ఉండవలసిన దాని కంటే వదులుగా (రిలాక్స్‌డ్‌గా) ఉండే అవకాశం ఉంది. అప్పుడు పాలు, ద్రవాలు (యాసిడ్‌ కంటెంట్స్‌) కడుపు లోంచి ఈసోఫేగస్‌ వైపునకు నెట్టినట్లుగా బయటకు వస్తాయి. అలా వెనక్కురావడాన్ని ‘రిఫ్లక్స్‌’ అంటారు. చిన్నతనంలో చాలా మంది పిల్లల్లో సాధారణంగా కనిపించే ఈ సమస్య... వారికి మూడు నుంచి తొమ్మిది నెలలు వచ్చే నాటికి స్ఫింక్టర్‌ కండరం బలపడటంతో దానంతట అదే తగ్గిపోతుంది. 

వాంతులు అనే లక్షణం అనేక ఇతర ఆరోగ్య సమస్యల్లోనూ కనిపిస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో కొద్దిమంది పిల్లల్లో వాంతులతో పాటు ఒకవేళ పసరుతో కూడుకున్న వాంతులు (బిలియస్‌ వామిటింగ్‌), వాంతుల్లో రక్తపు చారిక కనిపించడం, వాంతులతో పాటు విరేచనాలు కనిపిస్తుంటే మాత్రం మరికొన్ని ఇతర కారణాల గురించి ఆలోచించాల్సి ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో వాంతులు అదేపనిగా అవుతున్నప్పుడు యాంట్రల్‌ వెబ్, ఇంటస్టినల్‌ మొబిలిటీ డిజార్డర్స్‌ (పేగు కదలికల్లో సమస్యలు), హెచ్‌. పైలోరీ ఇన్ఫెక్షన్, పెప్టిక్‌ అల్సర్, ఆహారం సరిపడకపోవడం (ఫుడ్‌ అలర్జీస్‌), హయటస్‌ హెర్నియా వంటి ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయేమోనని తప్పక అన్వేషించాలి. ఆర్నెల్లు దాటిన వారు మొదలుకొని, రెండేళ్ల వరకు పిల్లల్లో వాంతులవుతూ, పై లక్షణాలు కనిపిస్తుంటే అప్పుడు వారిలో ఇంకేమైనా ఆరోగ్య సమస్యలున్నాయేమోనని అదనపు పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. 

నిర్ధారణ పరీక్షలు... 
గ్యాస్ట్రో ఈసోఫేజియల్‌ రిఫ్లక్స్‌ సమస్యను బేరియం ఎక్స్‌–రే పరీక్ష, మిల్క్‌ స్కాన్, 24 గంటల పీహెచ్‌ మానిటరింగ్, ఎండోస్కోపీ వంటి పరీక్షలతో 
నిర్ధారణ చేస్తారు. 

చికిత్స...  
చాలామంది పిల్లల్లో ఇది దానంతట అదే తగ్గిపోతుంది. ఒకవేళ వాంతులు కావడం మరీ ఎక్కువగా ఉంటే అలాంటి పిల్లలకు ద్రవపదార్థాలు తక్కువగా ఇవ్వడం, ప్రోకైనెటిక్‌ డ్రగ్స్‌ (ఉదాహరణకు సిసాప్రైడ్, మెటాక్లోప్రమైడ్‌ వంటి మందులు), ఎసిడిటీ తగ్గించే మందులు వాడటం చాలావరకు ఉపశమనాన్నిస్తుంది.
అలాగే ఈ సమస్య ఉన్న పిల్లలను పాలుపట్టిన వెంటనే పడుకోబెట్టకపోవడం, తల కొద్దిగా ఎత్తున ఉంచి పడుకోబెట్టడం, తిన్న వెంటనే పొట్టపై ఒత్తిడి పెంచే (ఇంట్రా అబ్డామినల్‌ ప్రెషర్‌ కలిగించే) యాక్టివిటీస్‌ వంటి వాటికి దూరంగా ఉంచాలి. ఈ సమస్య ఉన్న పిల్లల్లో వ్యాధి తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే ఫండోప్లెకేషన్‌ అనే ఆపరేషన్‌ 
అవసరం పడవచ్చు.                        

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega