Bakrid Festival 2023: మనోవాంఛల త్యాగమే బక్రీద్‌.. ఖుర్బానీ అంటే ఏమిటి?

29 Jun, 2023 10:06 IST|Sakshi

ఈదుల్‌ అజ్‌ హా ఒక మహత్తర పర్వదినం. వ్యావహారికంలో దీన్ని బక్రీద్‌ పండుగ అంటారు. బక్రీద్‌ పేరు వినగానే మొదట మనకు హజ్రత్‌ ఇబ్రాహీం అలైహిస్సలాం, ఇస్మాయీల్‌ అలైహిస్సలాంల పేర్లు గుర్తుకొస్తాయి. ఆ మహనీయుల విశ్వాస పటిమ, త్యాగ నిరతి కళ్ళముందు కదలాడతాయి. అలనాటి ఆ మధుర ఘట్టాలు ఒక్కొక్కటిగా మనో యవనిక పై ఆవిష్కృతమవుతాయి. వారి ఒక్కో అడుగు జాడ విశ్వాసాన్ని ద్విగుణీకృతం చేస్తుంది. ఈ విధంగా ఆ త్యాగ దనుల ఒక్కో ఆచరణనూ స్మరించుకుంటూ జరుపుకునే పర్వదినమే ఈదుల్‌ అజ్‌ హా... అదే బక్రీద్‌.

ఆరోజే అరేబియా దేశంలోని మక్కా నగరంలో ‘హజ్‌’ ఆరాధన జరుగుతుంది. లక్షలాదిమంది యాత్రికులతో ఆ పవిత్ర నగరం కళకళలాడుతూ ఉంటుంది. ‘లబ్బైక్‌’ నినాదాలు సర్వత్రా మిన్నంటుతూ ఉంటాయి. అల్లాహ్‌ ఆదేశాలను, ప్రవక్త వారి ప్రవచనాలను ΄ాటించడంలో భక్తులు నిమగ్నమై ఉంటారు. నేల ఈనినట్లు కనిపించే ఆ జనవాహినిలో ‘తవాఫ్‌ ‘చేసేవారు కొందరైతే, ‘సఫా మర్వా’ కొండల మధ్య ‘సయీ’ చేసేవారు మరికొందరు. అదొక అపురూపమైన సుందర దృశ్యం. రమణీయమైన అద్భుత సన్నివేశం. అల్లాహ్‌ స్తోత్రంతో పరవశించి తన్మయత్వం చెందే ఆధ్యాత్మిక కేంద్రబింబం. 


జిల్‌ హజ్‌ పదవ తేదీన జరుపుకొనే బక్రీద్‌ ఒక అపూర్వమైన పండుగ. హజ్రత్‌ ఇబ్రాహీమ్, హజ్రత్‌ ఇస్మాయీల్‌ అలైహిస్సలాంల త్యాగాలను స్మరించుకునే త్యాగోత్సవం. ప్రపంచ  విశ్వాసుల పర్వదినం. ఇదేదో షరా మామూలుగా జరిగే ఆచారం కాదు. ఇదొక మహత్తర సందేశం కలిగిన శుభదినం. క్రియా రూపంలో దైవ ధర్మాన్ని ప్రపంచానికి పరిచయం చేసే అద్భుత ప్రక్రియ. మనిషి తనను తాను తగ్గించుకొని, వినమ్ర పూర్వకంగా అల్లాహ్‌ ఔన్నత్యాన్ని, ఆయన ఘనతను కీర్తించే గొప్పరోజు. మౌలిక విశ్వాసం పరంగా ఒక్కటిగానే ఉన్న మనం పాక్షిక పొరపొచ్చాలనూ విస్మరించి తోటి సోదరుల్ని గుండెలకు హత్తుకోవాల్సిన రోజు.

ఈ పర్వదినం మనకిచ్చే మరో సందేశం ఏమిటంటే, సమాజాన్ని కలుపుకు పోకుండా, నలుగురితో మమేకం కాకుండా, సాటి ప్రజల పట్ల ప్రేమ, త్యాగం, సహనం, పరోపకారం లాంటి సుగుణాలను అలవరచుకోకుండా ఏ సంతోషమయినా, ఎంతటి ఆనందమైనా పరిపూర్ణం కాజాలదు. ఏ సంతోషకార్యమైనా నలుగురితో పంచుకోవాలని, కేవలం మన గురించి మాత్రమే కాకుండా సంఘం గురించి, సమాజం గురించి ఆలోచించాలని చెబుతుందీ పండుగ. ప్రతి ఒక్కరూ తమ స్థాయి, స్తోమతకు తగినట్లు ఈద్‌ జరుపుకుంటారు.

ఆర్ధిక స్థోమత ఉన్నవారు జిల్‌ హజ్జ్‌ నెలలో ‘హజ్‌ ’యాత్రకు వెళతారు. అంతటి స్థోమత లేనివారు ఇళ్ళవద్దనే ఖుర్బానీలు ఇస్తారు. ఆ స్థోమత కూడా లేకపోతే రెండు రకాతుల నమాజ్‌ ఆచరించినా దయామయుడైన దైవం హజ్, ఖుర్బానీలు ఆచరించిన వారితో సమానంగా పుణ్యఫలం  ప్రసాదిస్తాడు. ఆయన తన దాసుల చిత్తశుధ్ధిని, సంకల్పాన్ని మాత్రమే చూస్తాడు. ఆయనకు ధనరాశులు, రక్తమాంసాల అవసరం ఎంతమాత్రం లేదు. కనుక సర్వకాల సర్వావస్థల్లో చిత్తశుధ్ధితో కూడిన సత్కర్మలు ఆచరించాలి. పేదసాదల అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలి. పండుగల్లాంటి ప్రత్యేక సందర్భాల్లో వారిని ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. ఆనందంలో వారినీ భాగస్వాములను చేయాలి. అప్పుడే నిజమైన పండుగ.

ఒకప్పుడు ఎలాంటి జనసంచారం లేని నిర్జీవ ఎడారి ప్రాంతమది. కాని ఈనాడు విశ్వప్రభువు అనుగ్రహంతో నిత్యనూతనంగా కళకళలాడుతూ యావత్‌ ప్రపంచ ముస్లిం సమాజానికి ప్రధాన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. ఆ పుణ్యక్షేత్రమైన మక్కాలో జరిగే హజ్‌ ఆరాధనకు, ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం సమాజం జరుపుకునే ఈదుల్‌ అజ్‌ హా పండుగకు అవినాభావ సంబంధం ఉంది. ఈ పండుగకు, హజ్, ఖుర్బానీలకు మూలకారణం హజ్రత్‌ ఇబ్రాహీం అలైహిస్సలాం. ఈయన గొప్పదైవ ప్రవక్త. దేవునికి ప్రియ మిత్రుడు. తన పూర్తిజీవితం ద్వారా దైవప్రసన్నతకు మించిన కార్యం మరొకటి లేదని నిరూపించిన త్యాగధనుడు. కలలో కనిపించింది కూడా కరుణామయుని ఆజ్ఞగానే భావించి ఆచరించేవారు.

ఒకరోజు ఇబ్రాహీం ప్రవక్త తన ముద్దుల కొడుకు ఇస్మాయీల్‌ గొంతుకోస్తున్నట్లు కలగన్నారు. దీన్ని ఆయన దైవాజ్ఞగా భావించి, తనయునితో సంప్రదించారు. తండ్రికి దగ్గ ఆ తనయుడు వెనకా ముందు ఆలోచించకుండా త్యాగానికి సిద్ధమయ్యారు. ఆ క్రమంలో వారు ఎదుర్కొన్న పరీక్షలు, అందులో వారు సఫలమైన తీరు, వారి ఒక్కో ఆచరణ ప్రళయకాలం వరకు సజీవంగా ఉండేలా ఏర్పాటు చేశాడు దైవం. అందుకే విశ్వవ్యాప్త విశ్వాసులు ఆ మహనీయుల ఒక్కో ఆచరణనూ స్మరించుకుంటూ, దేవుని ఘనతను, గొప్పతనాన్ని కీర్తిస్తూ, సముచిత రీతిలో ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోవడానికి పండుగ రోజు ఈద్‌గాహ్‌కు చేరుకుని వేనోళ్ళా దైవాన్ని స్తుతిస్తారు.

తన అవసరాలను త్యజించి దైవ ప్రసన్నత కోసం ఇతరుల అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వమని చెప్పేదే ఈ త్యాగాల పండుగ. మంచికోసం మానవ సంక్షేమం కోసం, ధర్మంకోసం, ధర్మసంస్ఢాపన కోసం ఎంతో కొంత త్యాగం చెయ్యాలన్న సందేశం ఇందులో ఉంది. ఈరోజున ముస్లిం సమాజం జరుపుకుంటున్న త్యాగోత్సవానికి ఇదే అసలు ప్రేరణ. అందుకని, పండుగ సందర్భంగా చేసే ప్రతి ఆచరణలో త్యాగ ధనులైన హజ్రత్‌ ఇబ్రాహీం, ఇస్మాయీల్‌ గార్ల స్పూర్తి తొణికిసలాడాలి. దైవప్రసన్నత కోసం, ఇహపర సాఫల్యం కోసం వారు ఎలాంటి పరీక్షలు ఎదుర్కొన్నారో, ఎంతటి సహన స్ధయిర్యాలు కనబరిచారో మనం కూడా అలాంటి ప్రయత్నం చెయ్యాలి. సదాచారం, త్యాగం, పరోపకారం లాంటి సుగుణాలను అలవరచుకోవాలి.

మనోవాంఛల త్యాగం అన్నిటికన్నా ముఖ్యమైనది. ఈ సందర్భంగా మనం ఖుర్బానీలు ఇస్తాం, నమాజులు చేస్తాం. ఇతరత్రా ఇంకా ఏవో పుణ్యకార్యాలు ఆచరిస్తాం. కాని మనోవాంఛల త్యాగం అన్నిటికన్నా ముఖ్యమన్న విషయాన్ని విస్మరించకూడదు. ఇది నిస్సందేహంగా కష్టంతో కూడుకున్నకార్యమే. కాని, హజ్రత్‌ ఇబ్రాహీం, ఇస్మాయీల్‌ గార్ల త్యాగాలను స్మరించుకుంటే ఏమాత్రం కష్టంకాదు. మనం కూడా పరీక్షలు, కష్టాలు, త్యాగాల కఠినమయిన దశలను దాటవలసి ఉంది. ఈ మార్గంలో చేసే ఏ కృషి అయినా, ఏ త్యాగమయినా వృథా పోదు. చరిత్రే దీనికి ప్రత్యక్ష సాక్ష్యం. దైవం మనందరిలో త్యాగభావం, పరోపకార గుణాలను పెంపొదించాలని ప్రార్ధిద్దాం.
– ముహమ్మద్‌ ఉస్మాన్‌ ఖాన్‌
 

మరిన్ని వార్తలు