Sai Bharadwaja Reddy: మార్కాపురం కుర్రాడు.. ఈ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మిస్టర్‌ ఇండియా విజేత.. ఇప్పుడేమో ఏకంగా

9 Dec, 2022 12:46 IST|Sakshi
తనుబుద్ధి సాయి భరద్వాజ రెడ్డి

మిస్టర్‌ యూనివర్స్‌ రేసులో మిస్టర్‌ ఇండియా

Bali Mr Universe Tourism 2023- Sai Bharadwaja Reddy: తనుబుద్ధి సాయి భరద్వాజ రెడ్డి... 21 ఏళ్ల కుర్రాడు. బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. ఈ నెల ఒకటవ తేదీన ఒడిశా రాష్ట్రం, పూరి పట్టణంలో జరిగిన మిస్టర్‌ ఇండియా పోటీల్లో విజేత. వచ్చే ఏడాది మార్చి 12 నుంచి 21 వరకు ఇండోనేషియా, ‘బాలి’ దీవిలో జరిగే ‘మిస్టర్‌ యూనివర్స్‌ టూరిజమ్‌ –2023’ పోటీల్లో మనదేశానికి ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఈ సందర్భంగా భరద్వాజ తన విజయరహస్యాన్ని సాక్షితో పంచుకున్నాడు. 

‘‘మాది ప్రకాశం జిల్లా మార్కాపురం. నాన్న వ్యాపార రీత్యా విజయవాడలో పెరిగాను. నాకు ఫ్యాషన్‌ ప్రపంచం మీద చిన్నప్పటి నుంచి ప్యాషన్‌ ఉంది. ఫొటోజెనిక్‌గా కనిపించాలనే కోరిక ఉండేది. మంచి దుస్తులు ధరించడం, ఫొటోలు తీసుకోవడం ఇష్టం. బిడియపడకుండా కెమెరాను ఫేస్‌ చేయడం నన్ను విజేతగా నిలవడానికి కలిసి వచ్చిన ఒక అంశం. ఈ విజయం వెనుక ఐదేళ్ల కఠోరశ్రమ ఉంది. 
 
బీటెక్‌లో తొలి ప్రయత్నం 

మిస్‌ ఇండియా పోటీలలాగానే మిస్టర్‌ ఇండియా పోటీలు కూడా ఉంటాయని ఇంటర్‌లో ఉండగా తెలిసింది. బీటెక్‌లో యూనివర్సిటీ వేడుకల సందర్భంగా ఫ్యాషన్‌ కాంపిటీషన్‌ పాల్గొనడం, గెలవకపోవడం జరిగిపోయాయి. అప్పటి వరకు పోటీలను లైట్‌గా తీసుకున్నాను. పోటీని తేలిగ్గా తీసుకోరాదని అవగాహన వచ్చిన సందర్భం అది.

డిప్రెషన్‌కి లోనయ్యాను కూడా. ఓటమిని జీర్ణించుకోలేని మానసిక స్థితిలో ఉన్నాననే సంగతిని నేను గ్రహించిన సందర్భం కూడా అదే. ఆ ఓటమి నాకు చాలా మంచి చేసిందనే చెప్పాలి. అప్పటి నుంచి బాడీ లాంగ్వేజ్‌ని కూడా ఈ పోటీలకు అనుగుణంగా మార్చుకున్నాను.

నడవడం, నిలబడడం అన్నింటికీ ఓ లాంగ్వేజ్‌ ఉంటుంది. ప్రాక్టీస్‌ చేసేకొద్దీ నాలో ఆత్మవిశ్వాసం మెరుగవడం కూడా నాకే స్పష్టంగా తెలిసింది. ఈ పోటీలకు బాడీ బిల్డింగ్‌ అవసరం లేదు, ఫిట్‌గా ఉండడమే ప్రధానం. బాడీ, మైండ్, స్కిన్‌ ఆరోగ్యంగా ఉండాలి. 
 
ప్రకటన లేని రెండో ప్రయత్నం 
సెకండ్‌ అటెంప్ట్‌కి చాలా పక్కాగా సిద్ధమయ్యాను. గెలిచాను కూడా. అయితే కోవిడ్‌ కారణంగా అకస్మాత్తుగా ఫలితాల ప్రకటన లేకుండా ఆ పోటీలు అర్ధంతరంగా ముగిసిపోయాయి. ఇక మూడవ ప్రయత్నంలో ’మిస్టర్‌ క్లూ’గా ఎంపికయ్యాను. అయితే అది ఆన్‌లైన్‌ పోటీ.

నాలుగవ ప్రయత్నంలో ఫైనల్స్‌కి ఎంపికయ్యాను, కానీ ఆర్థికపరమైన అడ్డంకి కారణంగా ఫైనల్స్‌లో పాల్గొనలేకపోయాను. నా ఫ్యాషన్‌ పోటీల్లో ఐదవ ప్రయత్నం ఈ ‘మిస్టర్‌ ఇండియా’ పోటీలు’’ అని వివరించాడు భరద్వాజ. 
 
విజేత బాధ్యత ఇది 
ఈ పోటీలను గ్లోబల్‌ మోడల్‌ ఇండియా ఆర్గనైజేషన్‌ నిర్వహించింది. ఇప్పటి వరకు మిస్టర్‌ ఇండియా టైటిల్‌ గెలుచుకున్న విజేతల్లో చిన్నవాడు భరద్వాజ. వచ్చే ఏడాది బాలిలో మిస్టర్‌ యూనివర్స్‌ టైటిల్‌ కోసం పోటీ పడుతున్న అనేక దేశాల ‘మిస్టర్‌’లలో కూడా చిన్నవాడు.

మిస్టర్‌ ఇండియా టూరిజమ్‌ టైటిల్‌ విజేతగా... అనేక ప్రాంతాల్లో పర్యటిస్తూ భారతీయ సంస్కృతి, పర్యాటకం పట్ల అవగాహన కల్పించడం అతడి బాధ్యత. ఈ సందర్భంగా దక్షిణాది పట్ల ఉత్తరాది వారికి ఉన్న చిన్నచూపును రూపుమాపడానికి కృషి చేయాలనే ఆకాంక్షను వ్యక్తం చేశాడు. 

నాకు నేనే అన్నీ! 
పోటీదారులు ఎప్పుడూ మరొకరిలాగా కనిపించాలని అనుకరించకూడదు. నేను నాలాగే ఉన్నాను కాబట్టి విజేతనయ్యాను. మరో విషయం... నిపుణులైన కోచ్‌ శిక్షణ, డైటీషియన్‌ సలహాలు ఏవీ లేవు. ఉద్యోగం చేసుకుంటూనే ప్రాక్టీస్‌ చేశాను.

ఉదయం ఐదింటికి లేచి జిమ్‌ చేసేవాడిని. ఓట్స్, ఎగ్స్‌ ప్రధానంగా సొంతవంట. డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత మళ్లీ ఎక్సర్‌సైజ్‌. మొత్తానికి నేను అనుకున్నది సాధించాను. ‘మిస్టర్‌ ఇంటర్నేషనల్‌’ టైటిల్‌ని మనదేశానికి తీసుకురావాలనేది ప్రస్తుత లక్ష్యం. 
– టి. సాయిభరద్వాజ రెడ్డి, మిస్టర్‌ ఇండియా 2022.
– వాకా మంజులారెడ్డి 

చదవండి: Woolen Art: ఊలుతో అల్లిన చిత్రాలు.. మానస చేతిలో దిద్దుకున్న అమ్మ మనసు రూపాలు
రేణు ది గ్రేట్‌

మరిన్ని వార్తలు