సమీకృత సేద్యం.. సంతోషం!

20 Jul, 2021 02:51 IST|Sakshi

పాలేకర్‌ పాఠాలు విని ప్రకృతి సేద్యంలోకి..

ధాన్యం, కూరగాయలు, బొప్పాయిలు, చేపల సాగు

జాతీయ అవార్డు గెల్చుకున్న ఆదర్శ రైతు బండారు వెంకటేశ్వర్లు  

ప్రకృతి వ్యవసాయ పితామహుడు డా. సుభాష్‌ పాలేకర్‌ శిక్షణ అందించిన స్ఫూర్తితో రసాయనిక వ్యవసాయానికి స్వస్తి పలికి.. ఏడేళ్లుగా శ్రద్ధగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న బండారు వెంకటేశ్వర్లు, పుష్పలత దంపతుల కృషి చక్కని ఫలితాలనిస్తోంది. సూర్యాపేట జిల్లా మునగాల మండలం నర్సింహులగూడెంలోని తమ 12 ఎకరాల సొంత భూమిలో సమీకృత ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఐసీఏఆర్‌ అందించే జాతీయ స్థాయి హల్దార్‌ సేంద్రియ రైతు పురస్కారానికి వెంకటేశ్వర్లు ఎంపికయ్యారు. నల్గొండలో, తూ.గో. జిల్లా సర్పవరంలో పాలేకర్‌ శిక్షణా శిబిరాలకు హాజరై 2014లో రెండు నాటు ఆవులను కొనుక్కొని ప్రకృతి వ్యవసాయానికి శ్రీకారం చుట్టారు.

డిగ్రీ పూర్తి చేసిన ఆయనకు కుమారుడు, కుమార్తె ప్రైవేటు ఉద్యోగులు. దంపతులు ఇద్దరే సాధ్యమైనంత వరకు వ్యవసాయ పనులు చేసుకుంటారు. అవసరమైతేనే కూలీలను పిలుస్తారు. వరి, వేరుశనగ వంటి పంటలతో పాటు కూరగాయలు, పండ్ల తోటలు.. మొత్తం 14 రకాల పంటలు సాగు చేస్తున్నారు. ఫామ్‌ పాండ్‌లో చేపల సాగుతో సమీకృత ప్రకృతి సేద్యం వైపు అడుగులు వేశారు. గడ్డిపల్లి కేవీకె శాస్త్రవేత్తలు, ఉద్యాన, వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు పాటిస్తూ ఆదర్శ సేద్యం చేస్తున్నారు.

భూసారాన్ని పెంచేందుకు పశువుల ఎరువు, ఘనజీవామృతం, వేప పిండి, కొబ్బరి చెక్క, కానుగ చెక్క, జీవామృతం, వేస్ట్‌ డీకంపోజర్‌తోపాటు జీవన ఎరువులను సైతం వాడుతున్నారు. పంటల మార్పిడితోపాటు సమగ్ర సస్యరక్షణ చర్యలను పాటిస్తున్నారు. నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం, ఇంగువ ద్రావణం, వేప గింజల కషాయం, వంటి వాటితోనే సేద్యం చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు.

వైరస్‌ లేని బొప్పాయి సాగు
వెంకటేశ్వర్లు గత మూడేళ్లుగా బొప్పాయి సాగు విస్తీర్నం పెంచుకొని కరోనా నేపథ్యంలో మంచి ఆదాయం గడించడం విశేషం. బొప్పాయిలో కలుపుతీతకు పవర్‌ వీడర్‌ను స్వయంగా ఉపయోగిస్తున్నారు. 8.5 ఎకరాల్లో బొప్పాయి కాసులు కురిపిస్తుంటే ఎకరంలో నిమ్మ తోటపై రూపాయి కూడా రావటం లేదన్నారు.

ఎకరాకు 33 బస్తాల ధాన్యం దిగుబడి
వరి సాగులో డ్రమ్‌ సీడర్‌తో వరి సాగు చేస్తున్నారు. వానాకాలంలో సాంబ మసూరి వరిలో ఎకరాకు 33 బస్తాల దిగుబడి సాధిస్తూ క్వింటా బియ్యం రూ. 5,500 చొప్పున తన ఇంటి దగ్గరే అమ్ముతున్నారు. ఆ పొలంలో శీతాకాలంలో పుచ్చ సాగు చేస్తున్నారు. అరటి, నేరేడు, మామిడి, ఉసిరి, సపోట, ఇంకా పలు రకాల పండ్ల చెట్లనూ పెంచుతున్నారు. అన్ని ఖర్చులూ పోను 12 ఎకరాల్లో ఏడాదికి రూ.12 లక్షల ఆదాయం మిగులుతున్నదని వెంకటేశ్వర్లు సంతోషంగా చెప్పారు. 50 శాతం ప్రభుత్వ రాయితీపై ఫాం పాండ్‌ను నిర్మించి డ్రిప్, స్ప్రింక్లర్ల ద్వారా పంటలు సాగు చేస్తున్నారు. దీనిలో నీటిని నిల్వ చేసుకొని, ఉద్యానవన పంటలను సాగు చేసుకుంటూ దానిలో చేపలను పెంచుకుంటున్నారు. గత రెండు సంవత్సరాలుగా ఖర్చులు పోను రూ.50 వేలు మిగిలాయని వెంకటేశ్వర్లు చెబుతున్నారు.  
– మొలుగూరి గోపి, సాక్షి, నడిగూడెం, సూర్యాపేట జిల్లా

నిలువు పందిళ్లు మేలు!
తీగజాతి కూరగాయల సాగుకు రాతి స్తంభాలతో శాశ్వత ప్రాతిపదికన పందిళ్లు వేసే కన్నా.. వెదురు బొంగులు, ప్లాస్టిక్‌ తాళ్లు, పురికొసలతో కూడిన తాత్కాలిక నిలువు పందిళ్లు వేసుకోవటం రైతులకు ఎంతో మేలని హల్దార్‌ సేంద్రియ రైతు జాతీయ పురస్కారం అందుకున్న బండారు వెంకటేశ్వర్లు తెలిపారు. నిలువు పందిళ్లకు ఎకరానికి రూ. 50 వేల లోపు ఖర్చవుతుంది. శాశ్వత పందిళ్లు వేసుకోవడానికి ఇంకా అధిక పెట్టుబడి అవసరం. నిలువు పందిళ్లను పంట అయిపోగానే తీసేసి పక్కన పెట్టుకొని, మళ్లీ సులువుగా వేసుకోవచ్చు. ఆ స్థలంలో పంట మార్పిడికి కూడా ఇవి అనుకూలం. శాశ్వత పందిరి వేసుకుంటే.. ఆ స్థలంలో ప్రతిసారీ కూరగాయ పంటలే వేసుకోవాలి, పంట మార్పిడికి అవకాశాలు తక్కువ. పిచాకారీలకు, కూరగాయల కోతకు నిలువు పందిళ్లే మేలు. నిలువు పందిళ్లలో పంటలకు గాలి, వెలుతురు బాగా తగులుతుంది. దిగుబడీ బాగుంటుంది. వీటిలో పాముల బెడద కూడా తక్కువ.

సేంద్రియ మార్కెట్లు నెలకొల్పాలి
అప్పటి కలెక్టర్‌ ముక్తేశ్వరరావు ప్రోత్సాహంతో పాలేకర్‌ శిక్షణ పొందాను. పుస్తకాలు చదివి అవగాహన పెంచుకున్నాను. సీనియర్‌ రైతుల స్ఫూర్తితో ప్రకృతి వ్యవసాయంలోకి మారాను. తొలి రెండేళ్లు కష్టనష్టాలు చవిచూసి, మానేద్దామనుకున్నా. మా పొలానికి వచ్చి చూసిన అప్పటి కలెక్టర్‌ సురేంద్రమోహన్‌ వెన్నుతట్టి ప్రోత్సహించడంతో కొనసాగించాను. గడ్డిపల్లి కేవీకే శాస్త్రవేత్తలు, అధికారుల తోడ్పాటుతో ఇప్పుడు నిలదొక్కుకున్నాను. నా భార్య, నేను పగలంతా పొలం పనులు చేసుకుంటాం. మరీ అవసరమైతేనే కూలీలను పిలుస్తాం. రెండేళ్లుగా పండించినవన్నీ తోట దగ్గరే ఏదో ఒక ధరకు అమ్మేస్తున్నా. నికరాదాయం బాగానే ఉంది. ప్రభుత్వమే ప్రత్యేక సేంద్రియ మార్కెట్లు నెలకొల్పి, ప్రచారం కల్పించి ప్రజల్లో చైతన్యం తేవాలి. రసాయన ఎరువులకు ఇస్తున్న రాయితీ మాదిరిగానే వేప పిండి తదితర వాటికి కూడా రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తేనే ప్రకృతి వ్యవసాయం విస్తరిస్తుంది.
– బండారు వెంకటేశ్వర్లు (77027 10588), ఐసీఏఆర్‌ హల్దార్‌ సేంద్రియ రైతు జాతీయ అవార్డు గ్రహీత, నరసింహుల గూడెం, మునగాల మండలం, సూర్యాపేట జిల్లా

సేంద్రియ సేద్యంపై శిక్షణ ఇస్తున్నాం
బండారు వెంకటేశ్వర్లు దంపతులు రోజంతా పొలం పని చేస్తారు. కరోనా కాలంలో బొప్పాయికి వచ్చిన గిరాకీ వల్ల వారి కష్టానికి తగిన ఆదాయం వచ్చింది. మా కేవీకేలో రైతులకు సేంద్రియ సేద్యంలో పూర్తిస్థాయి శిక్షణ ఇస్తున్నాం. జీవన ఎరువులు, వర్మీకంపోస్టు, అజొల్లా వంటి ఉత్పాదకాలను తయారు చేసి రైతులకు ఇస్తున్నాం. సేంద్రియ రైతులకు మార్కెటింగే సమస్య. ప్రభుత్వమే తీర్చాలి. సబ్సిడీపై ఆవులు, జీవన ఎరువులు ఇవ్వాలి.

– డా. లవకుమార్‌ (98490 63796), సమన్వకర్త, శ్రీ అరబిందో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ కేవీకే, గడ్డిపల్లి, సూర్యాపేట జిల్లా

బండారు వెంకటేశ్వర్లు 2014 నుంచి తన సొంత భూమి 12 ఎకరాల్లో వివిధ పంటలు పండిస్తూ సమీకృత ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపుమందులు వాడకపోవటం వల్ల మొదటి ఏడాది నుంచీ ఖర్చులు బాగా తగ్గాయి. అయితే, దిగుబడులు మొదటి ఏడాది బాగా తగ్గాయి. క్రమంగా పెరిగి మూడేళ్లకు దిగుబడి మంచి స్థాయికి పెరిగింది. గత ఐదేళ్లలో ఖర్చులు పోను నికరాదాయం గణనీయంగా పెరిగింది. 2016–17లో రూ. 7,57,238 నికరాదాయం పొందగా 2020–21 నాటికి ఇది రూ. 13,98,738కు పెరగటం విశేషం.

మరిన్ని వార్తలు