భళా.. బాపట్ల బ్లాక్‌ రైస్‌!

12 Apr, 2022 11:25 IST|Sakshi

బీపీటీ 2841 రకం నల్ల బియ్యం వంగడాన్ని బాపట్ల వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. రోగనిరోధక శక్తిని పెంపొందించే యాంటీ ఆక్సిడెంట్లతో పాటు ఐరన్, జింక్‌ వంటి సూక్ష్మపోషకాలను పుష్కలంగా కలిగి ఉండటం.. పంట పడిపోకుండా ఉండటం, చీడపీడలను తట్టుకోవటం, ఎకరానికి 30–35 బస్తాల దిగుబడినివ్వటం దీని ప్రత్యేకతలు.

రైతుల పొలాల్లో ప్రయోగాత్మకంగా సాగు చేయించగా వరుసగా మూడేళ్లు సత్ఫలితాలు వచ్చాయి. సేంద్రియ/ప్రకృతి సేద్యానికి అనువైన ఈ విశిష్ట వంగడం అధికారిక విడుదలకు సిద్ధమవుతోంది. ఆరోగ్యకరమైన ఆహారం గురించి వినియోగదారుల్లో ఇటీవల అవగాహన పెరగడం, ప్రజల కొనుగోలు శక్తి పెరగడం వలన పోషకాలు కలిగిన ఆహార పదార్థాల వాడకం పెరిగింది.

సేంద్రియ ఆహారోత్పత్తులపై కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నందున నలుపు, ఎరుపు దేశవాళీ వరి రకాల సాగు, వాడకం క్రమక్రమంగా పెరుగుతోంది. కోతకు ముందు పడిపోవటం, దిగుబడులు తక్కువగా ఉండటం వంటి సమస్యలను తట్టుకునే సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ పూర్వరంగంలో బాపట్ల వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు ఎకరానికి 30–35 బస్తాల దిగుబడినిచ్చే బీపీటీ 2841 బ్లాక్‌  రైస్‌ వంగడాన్ని అభివృద్ధి చేయటం విశేషం.

130–140 రోజుల పంట
యం.టి.యు. 7029, ఐ.ఆర్‌.జి.సి. 18195, యం.టి.యు. 1081 అనే రకాల సంకరం ద్వారా బీపీటీ 2841 సన్న రకం బ్లాక్‌ రైస్‌ వంగడాన్ని శాస్త్రవేత్తలు రూపొందించారు. డా. బి. కృష్ణవేణి, డా. డి. సందీప్‌ రాజా, డా. సి.వి. రామారావు, డా. వై. సునీత, డా. కె.ఎ. మృదుల ఈ వంగడాన్ని అభివృద్ధి చేశారు. 2019–20 ఖరీఫ్‌ సీజను నుంచి రైతు క్షేత్రాల్లో మినీ కిట్‌ పరీక్షల నిర్వహణకు అనుమతి పొందింది.

దీని పంట కాలం 130–140 రోజులు. ఈ రకం దాదాపు 110 సెం.మీ. ఎత్తు పెరుగుతుంది. పడిపోదు. దోమపోటు, అగ్గి తెగుళ్లను కొంత వరకు తట్టుకుంటుంది. మధ్యస్త సన్న రకం. వెయ్యి గింజల బరువు సుమారు 14–14.5 గ్రాములు. పైపొట్టును మాత్రమే తొలగించినప్పుడు (దంపుడు బియ్యం) 76.6% రికవరీనిస్తుంది. పాలీష్‌ చేస్తే 66% రికవరీనిస్తుంది. దంపుడు బియ్యం తింటే దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలన్నీ శరీరానికి అందుతాయి. పాలీష్‌ చేస్తే పై పొరలలోని నలుపు రంగులో ఉండే అంధోసైనిన్‌ తవుడులోకి వెళ్లి పోతుంది. 

ఎకరానికి 35 బస్తాల దిగుబడి 
బీపీటీ 2841 రకం నారును 20“15 సె.మీ. దూరంలో నాటుకుంటే హెక్టారుకు 6 టన్నుల వరకు దిగుబడినిస్తుంది. అయితే, పిలక చేసే సామర్థ్యం తక్కువ కాబట్టి 15“15 సెం.మీ. దూరంలో నాటుకుంటే (ఎకరానికి 20–25 కిలోల విత్తనం అవసరం) మంచిదని, ఇలా చేస్తే ఎకరానికి 35 బస్తాల (హెక్టారుకు 6.5 టన్నుల) వరకు దిగుబడి సాధించవచ్చని రైతుల అనుభవాల్లో తేలిందని బాపట్ల ఏఆర్‌ఎస్‌ ప్రధాన శాస్త్రవేత్త, అధిపతి డా. రామారావు ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. 

రోగనిరోధక శక్తే కీలకం
బీపీటీ 2841 సన్న వరి బియ్యం రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ఈ బియ్యం పైపొర నలుపు రంగులో ఉంటుంది. బియ్యానికి పై పొరలలోని నలుపు రంగు ఆంథోసైనిన్‌ అనే పదార్థం వల్ల వస్తుంది. మామూలుగా మనం రోజూ ఆహారంగీ తీసుకునే వరి రకాలతో పోల్చినప్పుడు నలుపు, ఊదా, ఎరుపు రంగు పై పొరగా కలిగినటువంటి వరి రకాలలో పాలీఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ పరిమాణంలో ఉంటాయి.

నలుపు రంగు బియ్యం పై పొరలలో ఉండే దట్టమైన నలుపు రంగునిచ్చే ఆంధోసైనిస్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, సూపర్‌ ఫుడ్‌గా పిలవబడే బ్లూబెర్రీస్, బ్లాక్‌ బెర్రీస్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లతో సమానమైన పోషక విలువలను కలిగి ఉన్నట్లు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. 

బీపీటీ 5204తో పోల్చితే యాంటీ ఆక్సిడెంట్లు బీపీటీ 2841 బ్లాక్‌ రైస్‌లో 3–4 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. పాలీష్‌ చేయని బీపీటీ 2841 దంపుడు బియ్యంలో వంద గ్రాములకు 90.52 మిల్లీ గ్రాముల ఫినాలిక్‌ పదార్థాలు, వంద గ్రాములకు 110.52 మిల్లీ గ్రాముల యాంటీ ఆక్సిడెంట్‌ యాక్టివిటీ ఉన్నట్లు కోత బాపట్లలోని అనంతర సాంకేతిక పరిజ్ఞాన కేంద్రం ప్రయోగశాల పరీక్షల్లో వెల్లడైంది.

5% పాలీష్‌ చేసిన బీపీటీ 2841 నల్ల బియ్యంలో కూడా వంద గ్రాములకు 90.19 మిల్లీ గ్రాముల యాంటీ ఆక్సిడెంట్‌ యాక్టివిటీ ఉన్నట్లు తేలింది. అదే విధంగా, పై పొట్టు మాత్రమే తొలగించిన ముడి బియ్యంలో 11.02%, పాలీష్‌ బియ్యంలో 6.3% మాంసకృత్తులున్నాయి. సూక్ష్మపోషకాలైన జింక్, ఇనుప ధాతువులు కూడా బీపీటీ 2841లో ఎక్కువ పరిమాణంలో ఉండటం విశేషం. 

యాంటీ ఆక్సిడెంట్‌ యాక్టివిటీ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను ఆహారంగా తీసుకున్నప్పుడు అవి శరీరంలో ఉత్పత్తయిన ఫ్రీరాడికల్స్‌ను సమతుల్యం చేయటం వలన పలు రకాల కేన్సర్లు, గుండె సంబంధిత సమస్య, మధుమేహం వంటి దీర్ఘకాలిక రుగ్మతలను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. 
– పంతంగి రాంబాబు,  సాగుబడి డెస్క్‌

రోగనిరోధక శక్తినిచ్చే బియ్యం
బీపీటీ 2841 బ్లాక్‌ రైస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్, జింక్, ఐరన్‌ చాలా ఎక్కువ పరిమాణంలో ఉన్నాయి. అందువల్ల ఈ బియ్యం రోగనిరోధక శక్తిని ఇనుమడింపజేస్తాయి. ఫార్టిఫైడ్‌ రైస్‌ కన్నా ఇవి మేలైనవి. బ్రీడర్‌ విత్తనాన్ని గత తెలుగు రాష్ట్రాల్లో పది వేల మంది రైతులు సాగు చేశారు. సుమారు 15–20 వేల ఎకరాల్లో సాగు చేసి సంతృప్తికరమైన ఫలితాలు పొందారు.

చిరు సంచుల దశ పూర్తయింది. ఎస్వీఆర్సీకి ఈ ఏడాది నివేదించి విడుదలకు అనుమతి కోరుతాం. ప్రస్తుతం మా దగ్గర టన్ను వరకు విత్తనం ఉంది. ఒక్కో రైతుకు అరెకరానికి సరిపడే బ్రీడర్‌ విత్తనం ఇస్తాం. కిలో రూ.50. కావల్సిన రైతులు మాకు ఈ చిరునామా (ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి, వ్యవసాయ పరిశోధనా స్థానం, బాపట్ల – 522101, ఆంధ్రప్రదేశ్‌)కు ఉత్తరం రాస్తే.. పేర్లు నమోదు చేసుకొని సీరియల్‌ ప్రకారం మే ఆఖరు వారం, జూన్‌ మొదటి వారంలో ఇస్తాం. వారే స్వయంగా వచ్చి తీసుకెళ్లాల్సి ఉంటుంది.
– డా. సి.వి. రామారావు, ప్రధాన శాస్త్రవేత్త – అధిపతి, బాపట్ల వ్యవసాయ పరిశోధనా స్థానం.ars.bapatla@angrau.ac.in

మరిన్ని వార్తలు