ఫ్రంట్‌లైన్‌ వారియర్‌.. బార్బీ

7 Aug, 2021 01:03 IST|Sakshi

ప్రస్తుతం ప్రపంచమంతా... ఒలింపిక్స్‌ క్రీడలు, క్రీడాకారులు ఎవరు బాగా ఆడుతున్నారు? ఏ దేశానికి ఏయే మెడల్స్‌ ఎన్నెన్ని వస్తున్నాయి వంటి అంశాలపై ఆసక్తిగా గమనిస్తోంది. మరోపక్క పతకాలు సాధించిన క్రీడాకారులను భవిష్యత్‌ తరాలకు ప్రేరణగా నిలిచేలా ఆయా దేశాల ప్రభుత్వాలు ఉన్నత సత్కారాలతో స్వదేశానికి ఆహ్వానిస్తున్నాయి. క్రీడాకారులకు ప్రభుత్వాలు ఇచ్చే ప్రోత్సాహకాలు, గౌరవ మర్యాదలతో వారు రాబోయే తరాలకు స్పూర్తిగా నిలుస్తారు. వీరిని చూసి మరెంతోమంది ఆ స్థాయికి ఎదగాలని కలలు కంటుంటారు. సరిగ్గా ఇదే విషయాన్ని బొమ్మల రూపంలో చెబుతోంది బార్బీ బొమ్మల తయారీ సంస్థ.

ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన బొమ్మలలో బార్బీ డాల్‌ ఒకటి. చిన్న పిల్లలను ముఖ్యంగా అమ్మాయిలను ఎంతగానో ఆకట్టుకునే ఈ బార్బీ బొమ్మలు సరికొత్తగా రాబోతున్నాయి. ఇప్పటిదాకా వ్యోమగామిగా, ఫైర్‌ ఫైటర్‌గా, గేమ్‌ డెవలపర్‌గా అనేక రకాలుగా రూపాంతరం చెంది పెద్దల నుంచి పిల్లల వరకు అందర్నీ ఆకట్టుకునే బార్బీబొమ్మలు ఈసారి సరికొత్త రూపంలో సందడి చేయనున్నాయి. దాదాపు రెండేళ్లుగా ప్రపంచాన్ని పట్టిపీడిస్తోన్న కోవిడ్‌–19ను ఎదుర్కోవడంలో ధైర్యసాహసాలతో ముందుండి ప్రజారోగ్యం కోసం పోరాడుతున్న వారి రూపాలతో బార్బీ సంస్థ బొమ్మలను తీర్చిదిద్దింది. కోవిడ్‌ మహమ్మారి కోరలు చాస్తోన్న సమయంలో ముందుండి పోరాడిన ఆరుగురు మహిళల రూపాలతో బార్బీలను తయారుచేసింది. ఈ ఆరుగురి రూపాలను వారి వృత్తికి తగినట్లుగా డ్రెస్‌లు వేసి ఆకర్షణీయమైన బొమ్మలుగా మలిచింది.

ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్‌ రూపకల్పనలో కృషిచేసిన సారా గిల్‌బర్ట్‌ ఆరుగురిలో ఒకరుగా నిలవడం విశేషం. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ అయిన గిల్‌బర్ట్‌ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్‌ రూపకల్పనలో ప్రముఖ పాత్ర పోషించారు. గిల్‌బర్ట్‌ బార్బీ బొమ్మగా మరింత ఆకర్షణీయంగా కనిపించారు.  కురులను వదులుగా వదిలి, నేవీ బ్లూ రంగు ప్యాంట్‌ సూట్, తెల్లని జాకెట్‌తో సరికొత్త బార్బీ డాల్‌గా మెరిసిపోతున్నారు.

గిల్‌బర్ట్‌తోపాటు న్యూయార్క్‌లో తొలి కోవిడ్‌ రోగికి వైద్యం అందించిన ఎమర్జెన్సీ రూమ్‌ నర్స్‌ అమీ ఓ సల్లివాన్, లాస్‌వేగాస్‌లో వివక్షకు గురైన డాక్టర్‌ ఆడ్రిక్రుజ్, హెల్త్‌కేర్‌లో జాత్యహంకారానికి వ్యతిరేకంగా పోరాడిన కెనడాకు చెందిన మానసిక వైద్య నిపుణురాలు చిక స్టేసీ ఒరివ్వా, కోవిడ్‌ జన్యుక్రమాన్ని గుర్తించిన బ్రెజిల్‌ బయోమెడికల్‌ రీసెర్చర్‌ జాక్వెలిన్‌ గోస్‌డిజెస్, ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌కోసం ‘ఉతికి మళ్లీ వేసుకోగల’ సర్జికల్‌ గౌనును రూపొందించిన ఆస్టేలియా డాక్టర్‌ కిర్బి వైట్‌లు బార్బీ బొమ్మల్లో ప్రేరణాత్మకంగా ఒదిగిపోయారు.

మహమ్మారి కోరలు చాస్తోన్న సమయంలో తమ వ్యక్తిగత జీవితాలను త్యాగం చేసి, ధైర్యంగా ముందుండి పోరాడిన హెల్త్‌ వర్కర్స్‌ కృషిని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు బార్బీ సంస్థ మాట్టె్టల్‌ తెలిపింది. ‘‘ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ పడ్డ ఆందోళన, చేసిన కృషిని భవిష్యత్‌ తరాలకు అందించడానికి సరికొత్త బార్బీడాల్స్‌ను తీసుకొచ్చాము. మా ప్రయత్నం కొంతమంది చిన్నారుల్లోనైనా స్పూర్తి తీసుకురాగలిగితే ఆ దిశగా వారు ఎదుగుతారని ఆశిస్తున్నాం’’ అనిÐ ] ూట్టెల్‌ యాజమాన్యం చెప్పింది.

‘‘బార్బీ బొమ్మను నా రూపంలో రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దడం చాలా సంతోషంగా ఉంది. టీకా నిపుణిరాలిగా నా ప్రతిమను బార్బీలో చూసిన అమ్మాయిల్లో కొంతమంది అయినా సైన్స్‌ను కెరియర్‌గా ఎంచుకుని అద్భుతాలు సాధించాలి’’ అని గిలబర్ట్‌ చెప్పింది.

మరిన్ని వార్తలు