Health Benefits Of Prasadam: పండుగ వేళ తొమ్మిది రకాల నైవేద్యాలు.. ఆరోగ్య ప్రయోజనాలెన్నో!

23 Sep, 2022 19:04 IST|Sakshi

పూలనే దేవతారూపంగా కొలిచే అపురూపమైన పండుగ బతుకమ్మ. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే ఈ పూల పండుగ అంటే కేవలం ఆటపాటలే కాదు.. ఘుమఘుమలాడే పిండి వంటలు కూడా గుర్తుకువస్తాయి. బతుకమ్మ ఆటా.. పాటా మానసికోల్లాసాన్ని ఇస్తే.. ఇంటి తిరిగి వెళ్లే వేళ ఇచ్చిపుచ్చుకునే వాయినాలు.. ఆరోగ్యానికి మేలు చేస్తాయి. తొమ్మిది రోజులు చేసే తొమ్మిది రకాల ప్రసాదాలు పోషక విలువలు కలిగి ఉంటాయి.

ఐరన్‌ పుష్కలం 
సాధారణంగా మహిళలు, పిల్లల్లో ఐరన్‌ లోపం ఎక్కువగా కనిపిస్తుంది. బతుకమ్మ సమయంలో తయారు చేసే సద్దిలో ఐరన్‌ శాతం ఎక్కువ. నువ్వులు, పల్లీలు, కొబ్బరి పొడి, సత్తుపిండి, పెసర ముద్దలు... ఇలా చిరుధానాల్యతో కూడిన వంటకాలు తింటే ఆరోగ్యకరమని పెద్దల మాట.

నువ్వుల ముద్దలు 
నువ్వుల వల్ల  అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బతుకమ్మ పండుగ వేళ వీటితో పొడి చేస్తారు. శరీరానికి ముఖ్యమైన అమైనోయాసిడ్స్‌ నువ్వుల్లో పుష్కలం. ఇక వీటిలో జింక్, కాల్షియం, పొటాషియం కూడా ఎక్కువే. మొదడును చురుకుగా ఉంచడంలో జింక్‌ కీలక పాత్ర పోషిస్తే.. కాల్షియం ఎమకల ధృడత్వాన్ని దోహదం చేస్తుంది.

సత్తు పిండి 
బతుకమ్మ వేడుకల్లో మొదటి రోజు సాధారణంగా ఆకువక్కలు, తులసీదళాలు, దానిమ్మగింజలు, శనగపప్పు, పెసరపప్పు, నువ్వులు, మొక్కజొన్న గింజల సత్తు పిండిని తయారు చేసుకుంటారు. దీనిలో పీచు ఎక్కువగా ఉంటుంది. కార్బొహైడ్రేట్స్‌ తక్కువగా ఉంటాయి. కాగా పీచు పదార్థాల వల్ల మలబద్దకం దూరమవుతుంది.

ఇక రెండోరోజు పప్పు బెల్లం, రేగు పండ్లు, మూడో రోజు పూర్ణాలు, నాల్గోరోజు బెల్లం బియ్యం, ఐదో రోజు అట్లు,  ఎనిమిదో రోజు నువ్వులు, బెల్లం కలిపిన వెన్న ముద్దలు, తొ మ్మిదోరోజు బియ్యం పిండి, గోధుమపిండి, బెల్లంతో మలీద ముద్దలు చేసుకుంటారు. వీటిలోనూ ఆరోగ్యానికి దోహదం చేసే కారకాలు ఎక్కువే.

పెసర ముద్దలు 
పెసర్లను ఉడకబెట్టి అందులో బెల్లం కలిపి ముద్దలుగా చేస్తారు. ఇది జీర్ణశక్తిని పెంచడంతోపాటు జీర్ణ సంబంధిత వ్యాధులనూ తగ్గిస్తుంది.  

కొబ్బరి పొడి 
కొబ్బరిలో ప్రొటీన్లు అధికం. మహిళల ఆరోగ్యానికి ‍కొబ్బరి పొడి చాలా ఉపయోగపడుతుంది.  

పెరుగన్నం, పులిహోర... 
పెరుగన్నంలో పల్లీలు, వివిధ రకాల ధాన్యాలను కలుపుతారు. చింతపండు లేదా నిమ్మరసంతో చేసిన పులిహోర ప్రసాదం తయారు చేసుకుంటారు. చిన్న గాయాల నుంచి క్యాన్సర్‌ వరకు పసుపు విరుగుడుగా పని చేస్తుంది.

చింతపండు గుజ్జులో విటమిన్‌ ‘సి’ అత్యధిక. పంచామృతాల్లో పెరుగు ఒకటి. ఇందులో పోషక విలువలు మెండు. దీంతో అన్నం కలిపి నైవేద్యం చేస్తారు. దీనిలో ప్రొటీన్, కాల్షియం, విటమిన్‌ బీ6, బీ12 వంటివి ఎక్కువగా ఉంటాయి. కొవ్వు తక్కువగా ఉండే పెరుగులో లాక్లో బాసిల్లై అధికంగా ఉంటుంది.  

పల్లి పిండి 
పల్లి పిండి శరీర ఎదుగుదలకు దోహదం చేస్తుంది.  ప్రోటీన్లు ఎక్కువ. అంతేకాదు నోటికి రుచికరంగా ఉండడంతో చాలా మంది దీనిని ఇష్టపడతారు. ఇక పల్లి పొడికి బెల్లం కలిపి తింటే మరిన్ని ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి.

మరిన్ని వార్తలు