బతుకమ్మ పండుగ.. తొమ్మిది రోజులు ఎనిమిది నైవేద్యాలు!

23 Sep, 2022 19:19 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అవనిపై పచ్చని పైటేసినట్టు ఆకుపచ్చని మొక్కలన్నీ అందంగా సింగారించుకునే వేళ.. నిండిన చెరువులు, పండిన పంటలతో అలరారే సమయం.. కురిసే చినుకుల తాకిడితో పుడమి తల్లి పచ్చగా మెరిసే క్షణాల్లో తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా భావిస్తున్న పూల పండుగ బతుకమ్మ ప్రారంభమవుతోంది. పూలతో దేవుడిని కొలిచే దేశంలో.. ఆ పూలనే దేవతగా కొలిచే ఏకైక పండుగ బతుకమ్మ.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలకు అద్దం పట్టే బతుకమ్మ సంబరాలు ఏటా పెద్ద అమవాస్య నుంచి తొమ్మిది రోజులపాటు జరుగుతాయి. ఆడపడుచులు తీరొక్క పూలతో, రకరకాల పిండి వంటలతో గౌరీదేవిని పూజిస్తారు. ప్రకృతిలో లభించే రకరకాల పూలను బతుకమ్మగా పేర్చి, ఆటపాటలతో పూజించి దగ్గరలోని చెరువుల్లో నిమజ్ఞనం చేస్తారు. బుధవారం ఎంగిలిపూల బతుకమ్మతో మొదలయ్యే వేడుకలు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి.

బతుకమ్మ అంటే..
బతుకమ్మ అనే పదానికి తెలంగాణలో విభిన్న పర్యాయ పదాల వాడుకలో ఉన్నాయి. ముఖ్యంగా బతుకమ్మ అంటే పూలతో కూడిన అమరిక అని అర్థం. ఈ కాలంలో లభించే వివిధ రకాల పూలతో బతుకమ్మలను కొన్ని వరుసలు పేరుస్తారు. మ«ధ్యలో పసుపుతో చేసిన స్థూపాకారావు పదార్థాన్ని లేదా గుమ్మడి పూవులో నుంచి తీసిన మధ్య భా గాన్ని ఉంచుతారు. దీన్ని బొడ్డెమ్మ అని పిలుస్తారు. కొందరు బొడ్డెమ్మను దుర్గగా కొలుస్తారు. బతుకు అంటే తెలుగులో జీవించే లేదా జీవితం అని అర్థం. అమ్మ అంటే తల్లి అని అర్థం. దాన్నే బతుకమ్మ అని అంటారు.

పండుగ నేపథ్యం ఇదీ..
19వ శతాబ్దం పూర్వార్థం నిత్యం దారిద్య్రం, భయంకర అంటువ్యాధులు,  ప్రకృతి బీభత్సాలతో తెలంగాణలోని గ్రామాల్లో అనేక మంది ప్రజలు చనిపోయేవారు. ఈ క్రమంలో ప్రజలు తమ కష్టాల నుంచి గట్టెక్కేందుకు, తమకు పుట్టిన పిల్లలు అనారోగ్యం బారిన పడి చనిపోకుండా బతకటానికి బతుకమ్మ(బతుకు+అమ్మ) పండుగను సృష్టించుకున్నారు. మరో కథనం ప్రకారం.. ఒక కాపు కుటుంబంలో ఏడో సంతానంగా పుట్టిన అమ్మాయే బతుకమ్మ. అంతకుముందు పుట్టి చనిపోయిన వారిలో కలవకూడదనే భావనతో ‘బతుకమ్మ’ అని పిలుచుకుంటూ పెంచుతారు.

బతుకమ్మ ఎదిగాక  పెళ్లి చేస్తారు. ఓ పండుగ రోజు బతుకమ్మ పుట్టింటికి వస్తుంది. అన్న భార్యతో కలిసి చెరువుకు స్నానానికి వెళ్తుంది. అక్కడ ఒడ్డున పెట్టిన ఇద్దరి చీరలు కలిసిపోయి వదిన చీరను బతుకమ్మ కట్టుకుంటుంది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగి, వదిన బతుకమ్మ గొంతు నులిమి, చంపేసి చెరువు గట్టున పాతిపెడుతుంది. తర్వాత ఆమె తంగేడు చెట్టుగా మొలుస్తుంది. బతుకమ్మ తన భర్తకు కలలో కనిపించి, జరిగిన విషయం చెప్పి, తనను తీసుకుపొమ్మంటుంది. అలా పండుగ ప్రారంభమైందని చెబుతారు.

ఎంగిలిపూల బతుకమ్మ..
మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ. నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు. పండుగకు ముందు ఆయా పుష్పాలన్నీ వివిధ కీటకాల పరాగ సంపర్కం కారణంగా ఎంగిలి పడ్డాయని తలచి ఎంగిలిపూలుగా పరిగణిస్తారు. పితృ అమావాస్య రోజు స్వర్గస్తులైన పెద్దలకు బియ్యం ఇచ్చుకొని, వారిని దేవతలుగా ఆరాధిస్తారు కాబట్టి ఈ నేపథ్యంలో తెచ్చిన పూలన్నీ ఎంగిలి పడ్డట్టుగా భావిస్తారు.

అటుకుల బతుకమ్మ..
రెండోరోజు అటుకల బతుకమ్మగా పిలుస్తారు. రకరకాల పూలతో బతుకమ్మలను పేర్చి ఆడపడుచులందరూ ఆట పాటలతో సందడి చేస్తారు. బెల్లం, అటుకులు, పప్పుతో తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తారు.

ముద్దపప్పు బతుకమ్మ..
మూడోరోజు ముద్ద పప్పు బతుకమ్మగా జరపుకుంటారు. బెల్లం, ముద్దపప్పు, పాలతో నైవేద్యం తయారు చేస్తారు.

నానబియ్యం బతుకమ్మ..
నాలుగో రోజు నాన బియ్యం బతుకమ్మను జరుపుకుంటారు. తంగేడు, గునుగు పూలతో బతుకమ్మను నాలుగు వరుసలుగా పేరుస్తారు. గౌరమ్మను పెట్టి, ఆడిపాడి, దగ్గరలోని చెరువులో నిమజ్ఞనం చేస్తారు. ఈ సందర్భంగా నానబెట్టిన బియ్యం, పాలు, బెల్లంతో కలిపి ముద్దలుగా తయారుచేసి, నైవేద్యంగా సమర్పిస్తారు.

అట్ల బతుకమ్మ..
ఐదోరోజు అట్ల బతుకమ్మ జరుపుకుంటారు. తంగేడు, మందారం, చామంతి, గునుగు, గుమ్మడి పూలతో ఐదు వరుసలు పేర్చి, బతుకమ్మను త యారు చేస్తారు. బియ్యం పిండితో తయారు చేసిన అట్లను నైవేద్యంగా సమర్పిస్తారు.

అలిగిన బతుకమ్మ.. 
ఆరోరోజు అలిగిన బతుకమ్మ. బతుకమ్మను పూలతో అలకరించరు. నైవేద్యం సమర్పించరు. బతుకమ్మను పేర్చి ఆడకుండా నిమజ్జనం చేస్తారు.

వేపకాయల బతుకమ్మ.. 
ఏడోరోజు వేపకాయల బతుకమ్మ జరుపుకుంటారు. ఈరోజు తంగేడు, చామంతి, గులాబీ, గునుగు పూలతో బతుకమ్మను ఏడు వరుసల్లో పేరుస్తారు. బియ్యం పిండిని వేప పండ్లుగా తయారు చేసి, నైవేద్యం సమర్పిస్తారు.

వెన్నెముద్దల బతుకమ్మ..
ఎనిమిదో రోజు వెన్నెముద్దల బతుకమ్మ. తంగేడు, చామంతి, గునుగు, గులాబీ, గడ్డిపూలతో కలిపి ఎనిమిది వరుసల్లో బతుకమ్మను పేరుస్తారు. అమ్మవారికి ఇష్టమైన నువ్వులు, వెన్న, బెల్లంతో నైవేద్యం సమర్పిస్తారు.

సద్దుల బతుకమ్మ..
బతుకమ్మ నవరాత్రి ఉత్సవాల్లో సద్దుల బతుకమ్మ చివరిది. ఈరోజు అన్ని రకాల పూలతో భారీ బతుకమ్మలను పేరుస్తారు. మహిళలు నూతన వస్త్రాలు ధరించి, ప్రధాన కూడళ్లలో బతుకమ్మలను పెట్టి, ఆటపాటలతో గౌరమ్మను పూజిస్తారు. పెరుగు అన్నం, నువ్వుల అన్నం వంటి ఐదు రకాల వంటకాలను నైవేద్యంగా సమర్పిస్తారు. అనంతరం కుటుంబ సమేతంగా ప్రసాదాన్ని అరగిస్తారు.

మరిన్ని వార్తలు