Bathukamma: ఆ బంధాన్ని గుర్తు చేసేదే బతుకమ్మ

21 Sep, 2022 20:21 IST|Sakshi

ప్రకృతికి, మనిషికి ఉన్న సంబంధం ఎంత బలమైంది ? ఈ ప్రశ్నకు సమాధానమే బతుకమ్మ పండుగ. మట్టి నుంచి చెట్టు దాకా, నీటి నుంచి పూల దాకా...అన్నింటితోనూ మనకి వీడదీయ లేని బంధమే. ఇక పల్లె, కుటుంబం, తోబుట్టువులు, పుట్టినిల్లు, మెట్టినిల్లు ఇవన్నీ బలమైన మానవ సంబంధాలే. అటు ప్రకృతితో మన బంధాన్ని, ఇటు స్త్రీకి కుటుంబంతో ఉన్న బంధాన్ని గుర్తు చేసేదే బతుకమ్మ. 

నేలను ముద్దాడి, గంగను స్పర్శించి, పుట్టమన్నును పూజించే తెలంగాణ గట్టు పైన.. పూలను కొలిచే అరుదైన సంప్రదాయం బతకమ్మ. బతుకమ్మ పండగలో అణువణువునా స్త్రీతత్వం ఉట్టిపడుతుంది. బతుకమ్మ పాటల్లో స్త్రీల జీవితాలు కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తాయి. అందుకే బతుకమ్మ అంటే స్త్రీ.. స్త్రీ అంటే బతుకమ్మ అన్నట్లుగా ఈ పండగ తెలంగాణ సంస్కృతిలో మమేకమైంది. 

ఆడేడో ఆడపిల్ల ఎదురు చూస్తూ ఉంటుంది. పండక్కి తీసుకెళ్లేందుకు వచ్చే తండ్రి, మేన మామ, తోబుట్టువుల కోసం. ప్రతి ఏడాది బతుకమ్మ పండుగ వేళ జరిగేది ఇదే. వానలొస్తే చెరువులు నిండుతాయి. పొలాలన్నీ పచ్చని చీర కట్టుకుంటాయి. అలానే బతుకమ్మ వస్తే.. అత్తింటి నుంచి ఆడబిడ్డలంతా పుట్టింటికొస్తారు. అయి నోళ్లను, పుట్టి, పెరిగిన పల్లెని చూసి మురిసిపోతారు. పుట్టింటితో ఉన్న బంధాన్ని తల్చుకుని పొంగిపోతారు. అందుకే బతుకమ్మ అంటే.. బతుకులోంచి పుట్టిన పండుగే కాదు. బతుక్కి ఇంత తృప్తినిచ్చే పండుగ కూడా. 

మరిన్ని వార్తలు