నగ్న ఫొటోలు పంపాడు.. నాకేమీ తెలియదంటూ బోరుమంది

15 Apr, 2021 11:22 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

వైష్ణవి (పేరు మార్చడమైంది)కి నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని కోరిక. ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ప్రయత్నం చేద్దామని అమ్మానాన్నలకు అబద్ధం చెప్పి ఇంటి నుంచి బయటకు వచ్చింది. సోషల్‌ మీడియా ద్వారా పరిచయం అయిన ఓ వ్యక్తి ఆమెను రిసీవ్‌ చేసుకున్నాడు. సాయం చేస్తానని మాటిచ్చాడు. తగ్గట్టే తనకు తెలిసిన సినీపరివారాన్ని పరిచయం చేశాడు. ఉండాల్సిన చోటు చూపించాడు. నగరం అందాలను కళ్లకు కట్టాడు. నటిగా అవకాశం రావడంతో పొంగిపోయింది వైష్ణవి. అతన్ని గుడ్డిగా నమ్మి తన ఫొటోలు అతనికి ఇచ్చింది. ఆ ఫొటోలను మార్ఫింగ్‌ చేసి తను చెప్పినట్టు చేయమని, లేదంటే ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో పెట్టి పరువు తీస్తానని వేధించడం మొదలుపెట్టాడు. దిక్కుతోచని స్థితిలో ఉండిపోయింది వైష్ణవి. 

టెన్త్‌ క్లాస్‌ పూర్తయిన మీనా (పేరుమార్చడమైంది) ఈ మధ్యే పట్నంలో ఉంటున్న అన్నా వదినల వద్దకు వచ్చింది. ఇంట్లో బోర్‌ కొడుతుందని రోజూ నసుగుతుంటే మీనా వదిన తన  సెల్‌ఫోన్‌ ఇచ్చింది. దాంతో మీనా ప్రపంచమే మారిపోయింది. రోజూ ఫొటోలు దిగడం సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేయడం, వచ్చిన లైక్‌లు, ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లకు మురిసిపోవడం ఆ విషయాలను ఇంట్లో సంబరంగా చెప్పుకునేది. ఓ రోజు ఆత్మహత్య ప్రయత్నం చేసిన మీనా కోలుకున్నాక చెప్పిన విషయం విని అన్నావదినలు ఆశ్చర్యపోయారు. సోషల్‌ మీడియాలో పరిచయం అయిన ఓ వ్యక్తి తన న్యూడ్‌ ఫొటోలు పంపించాడని, అవేవీ తనకు తెలియదని బోరుమంది మీనా.  

‘హాయ్‌!’తో మొదలయ్యే వేధింపులు
అమ్మాయిలు అదీ పట్టణాల్లో ఉన్నవారితో పోల్చితే గ్రామాల్లో ఉంటున్న యువతులు సోషల్‌ మాధ్యమాల్లో పరిచయం అయిన అపరిచిత వ్యక్తుల ద్వారా మోసపోతున్నవారి సంఖ్య ఇటీవల పెరిగిందంటున్నారు సైబర్‌క్రైమ్‌ అధికారులు. సోషల్‌ మీడియాలో వచ్చిన ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లను యాక్సెప్ట్‌ చేయడంతో క్రమంగా చిట్‌చాట్‌లు... ఫొటోలు, వీడియోలు షేర్‌ చేయడాలు... వాటిని ఆసరాగా తీసుకుని ‘ఫేక్‌ వీడియో’లు సృష్టించి బ్లాక్‌మెయిల్‌ చేస్తుంటారు. కొందరమ్మాయిలు ఆ అపరిచిత వ్యక్తులను బయట నేరుగా కలిసి స్నేహం పెంచుకుంటారు. వారు చెప్పే మాయమాటలకు మోసపోతుంటారు. 

బ్రేక్‌ తప్పనిసరి
తమ ఫొటోలను అప్‌లోడ్‌ చేయడం, తెలియని వారి నుంచి వచ్చే కామెంట్స్‌కి మెసేజ్‌లు, చాటింగ్‌ చేయడం, వీడియో కాల్స్‌ని రిసీవ్‌ చేసుకోవడం, సదరు వ్యక్తులను బయట కలవడం .. వల్లే వేధింపుల సమస్యలు పెరుగుతుంటాయి. ఫ్రెండ్‌ లిస్ట్‌ను ఎప్పటికప్పుడు ఫిల్టర్‌ చేసుకోవాలి. వర్చువల్‌ ఫేక్‌ నెంబర్స్‌ నుంచి వచ్చే కాల్స్‌ను రిసీవ్‌ చేసుకోకుండా జాగత్తపడాలి. అపరిచిత వ్యక్తులు మన నెట్టింట్లోకి జొరబడకుండా ముందస్తు జాగ్రత్తలే తీసుకోవడమే సముచితం. 

ఇట్టే తెలిసిపోతుంది
నెల క్రితం సోషల్‌మీడియా అంశం మీదే అవగాహనా కార్యక్రమం చేపట్టాం. అమ్మాయిలు సోషల్‌ మీడియాలో మోసానికి గురైతే, వెంటనే షీ టీమ్‌కు కంప్లైంట్‌ చేయచ్చు. సోషల్‌ మీడియాలోనే షీ టీమ్‌ వాట్సప్‌ నెంబర్, క్యూ ఆర్‌ కోడ్‌ ఉన్నాయి. దీని ద్వారా ఒక మెసేజ్‌ చేసినా చాలు. నిందితుడు దొరక్కపోవడం అనే సమస్యే ఉండదు. జాగ్రత్తపడాలంటే బాధితురాలు ఆ నిందితుడి పేజీ స్క్రీన్‌ షాట్‌ చేసి పెట్టుకోవడం మరీ మంచిది. దీనివల్ల ఆ అకౌంట్‌ను ఎవరు ఉపయోగిస్తున్నారో ఇట్టే తెలిసిపోతుంది. 


– సుమతి, డిఐజి–ఉమన్‌ సేప్టీ వింగ్, తెలంగాణ

జాగ్రత్తలే మందు
కేసు రిజిస్టర్‌ చేసిన దగ్గర నుంచి నిందితులను పట్టుకునేవరకు పోలీసులు అన్ని ప్రయత్నాలు చేస్తారు. కానీ కేసు పూర్తయ్యేవరకు పూర్తి గ్యారెంటీ ఉండదు. జాగ్రత్తలే దీనికి అసలైన మందు. సైబర్‌ క్రైమ్‌ ఇప్పటివరకు పరిష్కరించిన కేసులు చాలానే ఉన్నాయి. నేరం రుజువైతే క్రైమ్‌ని బట్టి... సెక్షన్ల బట్టీ శిక్ష ఉంటుంది. సైబర్‌ క్రైమ్‌కి రిపోర్ట్‌ చేయడానికి ఆన్‌లైన్‌ ఆప్షన్స్‌ ఉన్నాయి. రిపోర్ట్‌ చేయవచ్చు. ‘షీ టీమ్‌’కు కాల్‌ చేసి మాట్లాడవచ్చు. లేదా నేరుగా వెళ్లి ఫిర్యాదు చేయచ్చు.


– సందీప్‌ ముదల్కర్, సైబర్‌ సెక్యూరిటీ, ఫోరెన్సిక్‌ ఎక్స్‌పర్ట్‌ 

చదవండి: పైకి చూస్తే మైనర్‌.. పనులు మాత్రం ముదురే

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు