Beauty Tips: నిత్య యవ్వనంగా, ఎల్లప్పుడూ అందంగా కనిపించాలంటే

4 Jul, 2022 17:04 IST|Sakshi

నిత్య యవ్వనంగా, ఎల్లప్పుడూ అందంగా కనిపించడం ఏమంత సులభం కాదు. ముఖంలోని ప్రతి భాగానికీ ప్రత్యేక శ్రద్ధ అవసరం. అందుకోసం కొంతమంది వంటింటి చిట్కాలనే నమ్ముకుంటే.. మరికొంత మంది బ్యూటీ పార్లర్స్‌కి పరుగుతీస్తారు. కానీ పెరుగుతున్న కాలుష్యం, టెన్షన్స్, వయసు ఇవన్నీ సౌందర్యాన్ని హరిస్తూనే ఉంటాయి. అందుకు చెక్‌ పెడుతుంది ఈ స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ ఫేస్‌ బ్యూటీ క్రయో స్టిక్స్‌ (కూలింగ్‌ స్పా గ్లోబ్స్‌).

ఈ స్టిక్స్‌ చివరన పట్టుకునేందుకు వీలుగా గ్రిప్‌ ఉంటుంది. కళ్లు, బుగ్గలు, గడ్డం, మెడ, నుదురు, పెదవులు.. ఇలా ప్రతిభాగంలో వీటిని సవ్యదిశలో, అపసవ్యదిశలో గుండ్రంగా తిప్పుతూ మసాజ్‌ చేసుకోవాలి. వీటిని ఉపయోగించే ముందు నీటితో కడిగి, 3 లేదా 4 గంటలు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. దాంతో ఇవి ఎలాంటి ఒత్తిడినైనా క్షణాల్లో రీఫ్రెష్‌ చేస్తాయి.

ఈ గ్లోబ్స్‌.. రక్తప్రసరణను చక్కగా ఇంప్రూవ్‌ అయ్యేలా చేస్తాయి. నుదుటిపైన, పెదవులకు ఇరువైపులా, బుగ్గలపైన ఏర్పడిన గీతలు, ముడతలతో పాటు.. కాలిన మచ్చలను సైతం తొలగిస్తాయి. చర్మంపైన మృతకణాలను తొలగించి, రంధ్రాలను చిన్నగా చేస్తాయి. మొటిమలు, మొటిమల వల్ల ఏర్పడిన నల్లటి మచ్చలు, వయసుతో వచ్చే ముడతలూ తగ్గుతాయి.

ముఖం పాలిపోవడం, జ్వరం, తలనొప్పి వంటి సమస్యలకూ ఇవి చక్కటి ఉపశమనాన్ని కలిగిస్తాయి. నిద్రలేమితో కళ్ల కింద ఏర్పడిన నల్లటి వలయాలను పోగొడతాయి. అలసట తీర్చుకోవడానికి.. ఎండ బారిన పడిన తర్వాత రిలాక్స్‌ అవ్వడానికీ ఈ స్టిక్స్‌ చక్కటి ఉపకరణాలు.  

నాన్‌–టాక్సిక్‌ కూలింగ్‌ జెల్‌తో నింపి ఉండటంతో.. పైన మన్నికైన స్టెయిన్‌లెస్‌ స్టీల్‌తో రూపొందడం వల్ల విరగడం, పగలడం లాంటి సమస్యలు ఉండవు. పైగా ఇవి తేలికైనవి. పోర్టబుల్‌ డిజైన్‌ కావడంతో వినియోగించడమూ సులభమే.  ధర సుమారు 17 డాలర్లు. అంటే 1,329 రూపాయలు. వీటిని స్టోర్‌ చేసుకోవడానికి ప్రత్యేకమైన బాక్స్‌ కూడా లభిస్తుంది. 

మరిన్ని వార్తలు