చప్పుళ్లతో...ఒళ్లు మండిపోతోందా? అదీ ఓ జబ్బే!!

26 Sep, 2021 11:05 IST|Sakshi

కొన్ని శబ్దాలు ఒళ్లుమండిపోయేలా చేస్తాయి. సర్రున చిర్రెత్తిస్తాయి. మనకు తరచూ అనుభవంలోకి వచ్చే ఓ ఉదాహరణ చెప్పుకుందాం... 
దగ్గర్లో రంపం గరగరలాడుతున్న శబ్దమేదో వినగానే... అదేదో మన పళ్ల మీద గీరుతున్నట్లుగానే అనిపిస్తుంటుంది. కొందరు గుటాగుటా చప్పుళ్లొచ్చేలా తింటుంటే... పక్కనున్నవారికి ఒళ్లుమండిపోతుంటుంది. టూత్‌బ్రష్‌ నోట్లో వేసుకుని దాన్ని పరపరలాడిస్తున్న శబ్దం వింటే ఇంకొందరికి సర్రున ఒళ్లు మండిపోతుంది. ఇలాంటి శబ్దాల వల్ల ఒళ్లు మండిపోతుంటుంది. అయితే కొందరిలో ఈ జబ్బు స్థాయికి చేరుకుంటుంది. ఆ జబ్బు గురించి, దానికి చికిత్సల గురించి తెలుసుకుందాం. 

కేవలం అలాంటి శబ్దాలే కాదు... చప్పుడొచ్చేలా పెద్దగా గొంతు సవరించుకోవడం, చప్పరిస్తూ తింటుండటం, పెదవులు నాక్కోవడం,  పెద్దగా విజిల్‌ వేయడం వంటి శబ్దాలు అదేపనిగా చాలాసేపు వినబడుతుంటే చాలామందికి కోపం తారస్థాయికి చేరుకుంటుంది. ఇక మరికొందరికైతే... ఒళ్లువిరుచుకుంటూ నోటితో గట్టిగా శబ్దం చేయడం, భారీగా ఆవలించడం, టైప్‌రైటర్‌ల టకటకలూ, నవ్వుల ఇకఇకలతో నిగ్రహం కోల్పోతారు. ఇక స్లిప్పర్స్‌ తో మెట్లమీదో లేక గచ్చుమీదో టపటపలాడిస్తున్న చప్పుడు వింటే చాలు ఆగ్రహం మిన్నంటుతుంది.

ఇలా చప్పుళ్లను తట్టుకోలేని కండిషన్‌ ను ‘సెలక్టివ్‌ సౌండ్‌ సెన్సిటివిటీ సిండ్రోమ్‌’ అంటారు. వైద్యపరిభాషలో ‘మిసోఫోనియా’ అంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ జబ్బు ‘అబ్సెసివ్‌ కంపల్సివ్‌ డిజార్డర్‌’ (ఓసీడీ)కి దూరపు బంధువు వరసవుతుందని చెప్పవచ్చు!! మనందరిలో ఇలాంటి శబ్దాలకు కొంత ఇరిటేషన్‌ వంటి ఫీలింగ్‌ కలగడం చాలావరకు సహజమే. అయితే తీవ్రమైన కోపానికి గురయ్యేవారిలో... కొందరికి చెమటలు పట్టడం, కండరాలు టెన్షన్‌కు గురికావడం, గుండెదడ రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంటే ఆ విముఖత సాధారణ స్థాయి నుంచి రుగ్మత స్థాయికి చేరుకుందని అర్థం. 

దీనికి చికిత్స కూడా ఉంది... ఇలాంటి సమస్యతో బాధపడేవారికి బిహేవియరల్‌ థెరపీతో చికిత్స అందిస్తారు. వారికి కొద్దిపాటి శబ్దం వచ్చే ఫ్యాన్‌ సౌండ్‌ను అలవాటు చేయడం దగ్గర్నుంచి క్రమంగా శబ్దాలను అలవరుస్తారు. అలా శబ్దాల తీవ్రతను పెంచుకుంటూ పోతారు. ‘సెలక్టివ్‌ సౌండ్‌ సెన్సిటివిటీ సిండ్రోమ్‌’కు ఇలాంటి  కాగ్నిటివ్‌ బిహేవియరల్‌ థెరపీ మంచి ఫలితాలను ఇస్తుందన్నది నిపుణుల మాట

చదవండి: అలా కాదు ఇలా.. ఇలా జారాలి.. జర్రుమని..

మరిన్ని వార్తలు