మంచి మాట: మెలకువలోనే మేలిమి

2 Jan, 2023 00:49 IST|Sakshi

మనిషి మెలకువలో ఉండాలి; మనిషి మేలుకుని మసలాలి. మెలకువలో ఉండేందుకు, మేలుకుని మసలేందుకు మనిషి బతకాలి; మనిషి మేలుగా బతకాలి. నిద్రపొకూడదనీ, నిద్రవద్దనీ కాదు నిద్రపొతున్నప్పడు మాత్రమే మనిషికి నిద్ర ఉండాలి. నిద్ర అనేది మనిషికి కొంచెంసేపు వేసుకునే వస్త్రంగా మాత్రమే ఉండాలి. నిద్ర మనిషి పూర్తిగా కప్పుకునే దుప్పటి కాకూడదు; మనిషి తనను తాను నిద్రతో కప్పేసుకోకూడదు. మెలకువతో, మెలకువలో మనిషి తనను తాను చాటుకుంటూ ఉండాలి.

‘మెలకువలో కల నిజం కాదు; కలలో మెలకువ లేదు‘ అని ఆదిశంకరాచార్య చెప్పొరు. ఈ మాటల్ని మనసులోకీ, మెదడులోకీ ఎక్కించుకోవాలి. కలలు కనడానికి నిద్రపొతూ ఉండడంలోనూ, నిద్రలో కలలు కంటూ ఉండడంలోనూ కాలాన్ని వ్యర్థం చేసుకోకూడదు. కలలోనూ, నిద్రలోనూ మెలకువ ఉండదు. మనకు మెలకువ కావాలి ఎందుకంటే మెలకువలో కల నిజం కాదు. మనిషి కల కాకూడదు; మనిషి నిజం కావాలి.

భద్రంగా ఉండాలని మనం నిద్రలోనే ఉండిపొకూడదు. నిద్రలో అటూ, ఇటూ ΄పొర్లుతూ ఉండడం జీవితవిధానం కాదు, ఎప్పటికీ కాకూడదు. నిద్రలో కలవరిస్తూ ఉండడంలోనూ, ఆ కలవరింతల్లో జరిగిపొయిన వాటిని వర్ణించుకుంటూ ఉండడంలోనూ మునిగిపొయిన మనిషి బతుకును పొడు చేసుకోవడం అనే నేరం చేస్తున్న నేరస్థుడు. ఎన్నో కలలు వస్తూ ఉంటాయి నిద్రలో. ఆ కలలు అన్నిటిలోనూ కల్లల్ని చూసుకుంటూ ఉండిపొవడం వయసును చిదుముకోవడమే అవుతుంది. కొందరు నిద్రపొతున్నప్ప్డుడు మాత్రమే కాదు మేలుకుని ఉన్నప్పుడు కూడా కలలకంటూ ఉంటారు; కొందరు మెలకువను కూడా కలల్లో గడిపేస్తూ ఉంటారు, కలల్లో కలిపేస్తూ ఉంటారు. ఇది అవాంఛనీయమైన స్థితి; ఇది బాధాకరమైన స్థితి. మెలకువను కూడా కలల్లో గడిపేస్తూ, కలిపేస్తూ ఉండేవాళ్లు కల్లలు అయిపొతారు. మనిషి కల్ల అయిపొకూడదు. అందుకే మనిషి వీలైనంత మెలకువలో ఉండాలి; అందుకే మనిషి వీలైనంత మేలుకుని ఉండాలి.

పుట్టిన వ్యక్తికి తప్పకుండా మరణం ఉంటుంది. పుట్టుక, మరణం మధ్యలో ఉండే నిడివి జీవితం అవుతుంది. జీవితంలో మెలకువతో ఉండడమే జీవనం అవుతుంది. జీవి జీవితానికి మెలకువ జవ. ఆ జవ ఉన్న జీవనంలోనే చవి ఉంటుంది. జవ, చవి లేని మనిషి జీవితం చెక్కకో, చెత్తకో సమానం అవడం కాదు చెక్కకన్నా, చెత్తకన్నా హీనం ఆపై హేయం అవుతుంది. మనిషి చెక్కో, చెత్తో అవడం దుస్థితి, దుర్గతి. ‘యా మతిస్సా గతిర్భవేత్‌‘ అని అష్టావక్రగీతలో చెప్పడం జరిగింది. అంటే మతి ఎటువంటిదో గతి అటువంటిది అని అర్థం. మనిషి మతికి మెలకువ ఉంటే గతికి మెలకువ ఉంటుంది. మతికి, గతికి మెలకువ ఉంటే మనిషి చెక్కో, చెత్తో అయిపొయే దుస్థితి ఉండదు, రాదు.

ప్రకృతి మెలకువలోనే ఉంటుంది. ప్రకృతి నిద్రపొతే ఏం అవుతుందో మనం ఒకసారి ఆలోచిద్దాం. ప్రకృతి నిద్రపొతే మన ఆలోచనలకు కూడా అందని పరిణామాలు సంభవిస్తాయి. గాలి మెలకువలో ఉండడం వల్లే మనం ఊపిరి పీల్చుకుంటూ ఉన్నాం. రాత్రుల్లో మొక్కలు మెలకువతో ఉండబట్టే పువ్వులు పూస్తూ ఉన్నాయి. నదులు మెలకువతోపొతూ ఉన్నాయి కాబట్టే మన అవసరాలు తీరుతూ ఉన్నాయి. ‘గచ్ఛ తీతి జగత్‌‘ అంటారు;పొతూనే ఉంది కాబట్టే జగత్‌ అయింది అని దానికి అర్థం. జగత్తు మొత్తం మెలకువతో ఉంది; మేలుకుని ఉంది. భూమి మెలకువతో ఉంది కాబట్టే సూర్యోదయం జరుగుతోంది; మనిషి మెలకువ తో ఉంటేనే జీవనోదయం జరుగుతుంది. ‘కంపనాత్‌‘ అని అంటూ ’కదలడంవల్ల అది బ్రహ్మం’ అని ఒక బ్రహ్మసూత్రం మనకు ఎరుకను ఇస్తోంది. ప్రకతి మాత్రమే కాదు బ్రహ్మం కూడా కదలిక ఉన్నదే. ప్రకృతి, బ్రహ్మం రెండూ మెలకువలో ఉండేవే; మేలుకుని ఉండేవే.
ఎంత మెలకువ ఉంటే అంత మేలును ΄పొందుతాం. ఎంత మేలుకుని ఉంటే అంత మేలిమిని ΄పొందుతాం. మెలకువలో బతుకుతూ మనం మేలును ΄పొందుతూ ఉందాం; మేలుకుని బతుకుతూ మనం మేలిమికి మాలిమి అవుదాం.

 – రోచిష్మాన్‌

మరిన్ని వార్తలు