బెల్జియం రాకుమారి సైనిక శిక్షణ

22 Sep, 2020 07:10 IST|Sakshi

కొత్త స్టూడెంట్‌ వస్తే క్లాస్‌ రూమ్‌కి కళ వస్తుంది. ఇక్కడ కొత్తగా వచ్చింది రాకుమారి ఎలిజబెత్‌! ఆమె అడుగు పెట్టగానే రాయల్‌  మిలటరీ అకాడెమీ మొత్తానికే కళాకాంతులు వచ్చాయి. కాంతి ఎక్స్‌ట్రా. ఆరేళ్లు రాగానే పిల్లల్ని మన భాషలో స్కూల్లో పడేసినట్లు.. పద్దెనిమిదేళ్లు రాగానే రాజవంశాల్లో మిలటరీ అకాడెమీకి పంపించేస్తారు. రెండుమూడేళ్ల వరకు ఇంటి మీద బెంగ పడేందుకు లేదు. ఎలిజబెత్‌ బెల్జియం రాకుమారి. క్రౌన్‌ ప్రిన్సెస్‌. అంటే సింహాసనాన్ని అధిష్టించడానికి నెక్స్‌ట్‌ లైన్‌లో ఉన్న వారసురాలు. తండ్రి కింగ్‌ ఫిలిప్‌. బెల్జియం రాజు. ఆయన కూడా ఈ అకాడెమీలోనే 1978–81 మధ్య సైనిక శిక్షణ తీసుకున్నారు. రథ గజ తురగ పదాతి సైన్యాలు ఎన్ని ఉన్నా రైతు బిడ్డ వ్యవసాయం చేసినట్లు రాజు బిడ్డ కత్తి తిప్పాల్సిందే. ఇప్పుడు కత్తుల్లేవు కనుక ఆడపిల్లయినా కసరత్తులు చేసి రాటు తేలాలి. డిఫెన్స్‌ వాల్యూస్‌ నేర్చుకోవాలి. డిసిప్లెయిన్, రెస్పెక్ట్, కమిట్మెంట్‌.. ఇవీ ఆ వాల్యూస్‌. ధైర్యం ఒకరు నేర్పేది కాకపోయినా ధైర్యంగా ఉండటం కూడా ఒక సబ్జెక్టుగా నేర్పిస్తారు. షూటింగ్, మార్చింగ్, మారువేషంలో తప్పించుకునే మెళకువలు చెప్తారు. 

ఇప్పుడైతే రాకుమారి ఎలిజబెత్‌ కు నాలుగు వారాల శిక్షణే. అయితే చేరి నెల కావస్తున్నా.. ఈ వాట్సాప్‌ యుగంలోనూ.. మిలటరీ డ్రెస్‌ వేసుకుని యుద్ధ విద్యలు అభ్యసిస్తున్న ఆమె ఫొటోలు ఇన్నాళ్లకు గానీ బయటికి రిలీజ్‌ కాలేదు. ఇక రాజుగారు, రాణిగారు కూతుర్ని కళ్లారా సోల్జర్‌ గా చూసుకుని మురిసిపోయే వేడుక కోసం సెప్టెంబర్‌ 25 వరకు ఆగక తప్పదు. ఆరోజు అందరు జననీజనకులను రప్పించి, వారి పుత్రుడికో, పుత్రికకో వారి ఎదురుగా ‘బ్లూ బెరెట్‌’ (క్యాప్‌) తొడగబోతున్నారు. రత్నాల కిరీటాలు ఎన్ని ఉన్నా, రాజపుత్రికకు బ్లూ బెరెట్‌ తెచ్చే ఠీవే వేరు. అదొక స్టెయిల్లో ఉంటుంది.. కాన్ఫిడెన్సు, కదనోత్సాహమూ మిక్స్‌ అయి! బెల్జియం రాచకుటుంబంలో రాకుమారి ఎలిజబెత్‌ పెద్దమ్మాయి. తర్వాత ఇద్దరు తమ్ముళ్లు, ఒక చెల్లెలు. వాళ్లతో ఈ పెద్దమ్మాయికి సమీప భవిష్యత్తులో ఆటలు లేనట్లే. బ్లూ బెరెట్‌ సెరమనీ తర్వాత రెండో దశ శిక్షణ ప్రారంభం అవుతుంది పాపం.   

>
మరిన్ని వార్తలు