Bengaluru: ఇద్దరు మిత్రులు.. ఆటకు అనుబంధాలు జోడించి! మొదటి ఏడాదిలోనే లాభాల బాట!

3 Sep, 2022 10:27 IST|Sakshi
లుడో స్టార్‌ సృష్టికర్తలు అఫ్సర్‌ అహ్మద్, గోవింద్‌ అగర్వాల్‌(PC: Forbes)

ఇండియా గేమింగ్‌ మార్కెట్‌లో వెస్ట్రన్‌ డెవలపర్స్‌ టాప్‌లో ఉన్నారు. అయితే అఫ్సర్‌ అహ్మద్, గోవింద్‌ అగర్వాల్‌లు వెస్ట్రన్‌ గేమింగ్‌ కంపెనీలకు సవాలు విసురుతూ,  సత్తా చాటుతున్నారు. అవును. మన ఆట మొదలైంది...

లాక్‌డౌన్‌ సమయంలో యూట్యూబ్‌లో వీడియోలు చూసీచూసీ విసుగెత్తి పోయాడు ముంబైకి చెందిన ప్రభుత్వ ఉద్యోగి సంజీవ్‌ మెహతా. తన మొబైల్‌ ఫోన్‌లో ‘లూడోస్టార్‌’ గేమ్‌ ఆడడం మొదలుపెట్టడంతో విసుగు మాయమై హషారు ప్రత్యక్షమైంది. తమ ఫోనే లోకంగా ఎవరికి వారు విడిపోయిన ఆ ఇంట్లో కుటుంబసభ్యులందరినీ ఒకచోట చేర్చింది లూడో స్టార్‌.

బాల్యం నాటి తన ఫేవరెట్‌ ఆటకు ఆన్‌లైన్‌ రూపమైన ‘లుడో స్టార్‌’ 57 సంవత్సరాల మెహతాకు స్ట్రెస్‌బస్టర్‌గా పనిచేసింది.
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్‌లో ఒక హౌజింగ్‌ సొసైటీలో వాచ్‌మన్‌గా పనిచేసే రాజా సాహు ఇష్టమైన ఆట లుడో స్టార్‌.

‘లాక్‌డౌన్‌ టైమ్‌లో నేను ఇక్కడ ఉంటే, మా ఆవిడ ఊళ్లో ఉండేది. నేను ఊరికి వెళ్లలేని పరిస్థితి. ఆ సమయంలో లూడో స్టార్‌ మమ్మల్ని ఒకటి చేసింది. ఒకరిని ఒకరు ఓడించుకుంటూ, ఆటపట్టించుకుంటూ ఉండేవాళ్లం’ ఆ రోజులను గుర్తు చేసుకున్నాడు రాజా సాహు.

‘గేమ్‌ బెర్రీ ల్యాబ్స్‌’ ఈ లుడో స్టార్‌ సృష్టికర్త. ఐఐటీ–ఖరగ్‌పూర్‌ గ్రాడ్యుయెట్స్‌ అఫ్సర్‌ అహ్మద్, గోవింద్‌ అగర్వాల్‌లు బెంగళూరు కేంద్రంగా ఈ కంపెనీ ప్రారంభించారు.
ఐఐటీ రోజుల్లోనే రకరకాల గేమ్స్‌ రూపకల్పన గురించి ఆలోచన చేస్తుండేవారు ఈ ఇద్దరు మిత్రులు. చదువు పూర్తయిన తరువాత ‘మూన్‌ఫ్రాగ్‌ ల్యాబ్స్‌’ కంపెనీలో ఉద్యోగం చేశారు. ఉద్యోగం చేస్తున్న మాటేగానే వారి మనసంతా ఆన్‌లైన్‌ ఆటలతోనే నిండిపోయింది.

ఇక ఇలా అయితే కుదరదనుకొని ఒక ఫైన్‌మార్నింగ్‌ చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేశారు. మొబైల్‌లో క్లాసిక్‌ బోర్డ్‌ గేమ్స్‌ను ఫ్రెండ్స్, కుటుంబసభ్యులు కనెక్ట్‌ అయ్యోలా తీర్చిదిద్దడానికి కసరత్తులు ప్రారంభించారు.

తమ సేవింగ్స్‌తో బెంగళూరులో ‘గేమ్‌ బెర్రీ ల్యాబ్స్‌’ మొదలుపెట్టారు.
కంపెనీకి సంబంధించిన ప్రాడక్ట్, యుఎక్స్‌ వెర్టికల్స్‌కు సంబంధించిన వ్యవహారాలను అహ్మద్‌ పర్యవేక్షించేవాడు. ఇక ఇంజనీరింగ్, టెక్నాలజీ విభాగాలను అగర్వాల్‌ చూసుకునేవాడు. మొదటి సంవత్సరంలోనే కంపెనీ లాభాల బాట పట్టడం విశేషం.

గేమ్‌ బెర్రీ ల్యాబ్స్‌కు చెందిన రెండు పాపులర్‌ సోషల్‌ మల్టీప్లేయర్‌ గేమ్స్‌ లుడో స్టార్, పర్చిసి స్టార్‌ 200 మిలియన్‌ డౌన్‌లోడ్స్‌తో టాప్‌లో ఉన్నాయి.
ఫ్రీ–టు–ప్లే– బిజినెస్‌ మోడల్‌లో మొదలైన ‘గేమ్‌ బెర్రీ ల్యాబ్స్‌’కు ఇన్‌ యాప్‌ పర్చెజెస్‌(ఐఏపి), యాడ్స్‌ ప్రధాన ఆదాయ వనరు.

‘గేమ్‌ అంటే గేమే’ కాన్సెప్ట్‌నే నమ్ముకుంటే ‘లుడో గేమ్‌’ అంత పెద్దహిట్టై ఉండేది కాదు. అహ్మద్, అగర్వాల్‌ మాటల్లో చెప్పాలంటే ఆటకు అనుబంధాలను జోడించారు.
‘సంప్రదాయంగా లూడోను ప్లేయర్స్‌ చూసే పద్ధతిని గేమ్‌బెర్రీ ల్యాబ్స్‌ మార్చేసింది’ అంటారు సగౌరవంగా ఇద్దరు.

‘ఇండియన్‌ గేమింగ్‌ మార్కెట్‌లో వెస్ట్రన్‌ డెవలపర్స్‌ అగ్రస్థానంలో ఉండేవారు. ఇప్పుడు ఆ పరిస్థితిని గేమ్‌బెర్రీ ల్యాబ్స్, గేమ్‌షన్‌లాంటి కంపెనీలు మార్చి మన సత్తా చాటే ప్రయత్నంలో ఉన్నాయి’ అంటున్నారు ఆల్‌ ఇండియన్‌ గేమింగ్‌ ఫెడరేషన్‌ సీయివో రోలాండ్‌.

రాబోయే పన్నెండు నెలల సమయంలో టీమ్‌ సభ్యులను రెట్టింపు చేసే ప్రయత్నంలో ఉంది కంపెని. అంతేకాదు టెక్నాలజీ క్రియేషన్‌లో పెట్టుబడులను పెంచాలనుకుంటుంది.
చదవండి: Gopika Govind: బొగ్గు అమ్మే అమ్మాయి ఎయిర్‌ హోస్టెస్‌
Divya Mittal: ఐ.ఏ.ఎస్‌ పెంపకం పాఠాలు.. మీకు పనికొస్తాయేమో చూడండి

మరిన్ని వార్తలు