Stress Relief: పొద్దుతిరుగుడు గింజలు, ఇంకా వీటిని తింటే? వెల్లుల్లిలో ఉండే గ్లటాథియోన్‌ వల్ల

20 Mar, 2023 10:02 IST|Sakshi

ఒత్తిడిని తినేయండి

Health Tips In Telugu: మానసిక ఆరోగ్యం బాగుండాలంటే కొన్ని రకాల పోషకాలను తప్పకుండా తీసుకోవాలి. దానికి పిల్లలు, పెద్దలు అనేం లేదు. ఈ కింద ఇచ్చిన కొన్ని పదార్థాలలో మానసికంగా చురుగ్గా ఉంచే కొన్ని కారకాలు ఉన్నట్లు పోషకాహార నిపుణులు గుర్తించారు. వాటిని తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గి చురుగ్గా ఉండగలం. అవేమిటో చూద్దాం. 

మానసిక ఆందోళన, ఒత్తిడి, కుంగుబాటు, డిప్రెషన్‌.. పేరు ఏదైనా వచ్చిన తర్వాత బాధ పడేకంటే రాకుండా చూసుకోవడం చాలా మేలు. ఈ కింద ఇచ్చిన కొన్ని పదార్థాలు తీసుకోండి. శారీరకంగానే కాదు, మానసికంగానూ ఆరోగ్యంగా ఉండండి. 

పొద్దుతిరుగుడు గింజలు...
వీటిలో విటమిన్‌ ‘ఇ’ అధిక స్థాయిలో ఉంటుంది. ఇది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సమర్థంగా పనిచేస్తుంది.

వెల్లుల్లి...
వెల్లుల్లిలో సల్ఫర్‌ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇవి గ్లటాథియోన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌ను ఉత్పత్తిచేస్తాయి. ఇది ఒత్తిడిని ఎదుర్కొనే రక్షణ ఛత్రంలో మొదటి మూలకంగా పనిచేస్తుంది.  

గుడ్లు...
గుడ్లలో పోషకాలు పుష్కలం అనే విషయం తెలిసిందే. వీటిలో విటమిన్లు, మినరల్స్, అమైనో ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్స్‌ సంతృప్త స్థాయిలో లభిస్తాయి. ప్రత్యేకంగా ఇందులో చోలిన్‌ అనే పోషకం పుష్కలంగా ఉంటుంది. ఇది మెదడు ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతుందని, అలాగే ఒత్తిడి నివారణకు సమర్థం గా పనిచేస్తుందని వైద్యులు గుర్తించారు. 

నువ్వులు...
నువ్వులతో తయారుచేసే పదార్థాలలో ఎల్‌–ట్రిప్టోపాన్‌ అనే అమైనో ఆమ్లం పాళ్లు ఎక్కువ. ఇది మనసును ఉల్లాసంగా ఉంచే డోపమైన్, సెరటోనిన్‌ ఉత్పత్తిలో ఉపయోగపడుతుంది. అలాగే  ఒత్తిడిని తగ్గించేందుకు తోడ్పడుతుంది.

25 మంది యువకులకు నాలుగు రోజుల పాటు నువ్వుల ఉండలను తినిపించి పరిశీలించినప్పుడు వారిలో ఆందోళన, ఒత్తిడి స్థాయులు గణనీయంగా తగ్గినట్లు ఓ సర్వేలో తేలింది. నువ్వులతో రకరకాల స్నాక్స్‌ తయారు చేసుకోవచ్చు. ఏదైనా పదార్థాన్ని రుచిగా ఉండేలా తయారు చేసుకోవడం వల్ల వాటిని తినే విధంగా మెదడు కూడా మనల్ని ప్రోత్సహిస్తుంది.

చదవండి: Pomegranate: 3 నెలల పాటు ప్రతిరోజు తింటే! ఇక తొక్కలు పొడి చేసి నీళ్లలో కలిపి తాగారంటే..                    

మరిన్ని వార్తలు