పిల్లల కోసం ప్రత్యేక సినిమాలు!

14 Nov, 2021 15:27 IST|Sakshi

పిల్లలూ.. కథలే కాదు మీకోసం చక్కటి సినిమాలూ వచ్చాయి. మీకు వినోదం పంచడానికి తెలుగు సహా మీకు తెలిసిన ప్రపంచ భాషలన్నిటిలోనూ మీకోసం సినిమాలు ఉన్నాయి. వాటిల్లో కొన్నిటి గురించి ఇక్కడ తెలుసుకుందాం.. 

బాలరాజు కథ..
మహాబలిపురం పట్టణంలో బాలారాజు అనే పదేళ్ల పిల్లవాడుండేవాడు. అతనికో చెల్లి రాధ. తండ్రిలేని పిల్లలు. తల్లితో కలసి మేనమామ కుటుంబం ఉంటున్న గుడిసె పక్కనే మరో గుడిసెలో నివసించేవారు. మేనమామ సోమరి, తాగుబోతు. దాంతో ఇటు తమ కుటుంబంతోపాటు మేనమామ కుటుంబాన్ని బాలరాజే పోషిస్తూండేవాడు. టూరిస్ట్‌ గైడ్‌గా పనిచేస్తూ. ఈ చలాకీ పిల్లవాడు టూరిస్ట్‌లు ఇచ్చిన డబ్బు తీసుకుని ‘టాటా గిడి గిడీ’ అంటూ తనదైన శైలిలో కృతజ్ఞతలు తెలిపేవాడు. ఒకరోజు గుంటూరుకు చెందిన ధనిక దంపతులు కారులో మహాబలిపురం వస్తారు. వాళ్లకు పిల్లలు ఉండరు. ఆ జంటకు మన బాలరాజే గైడ్‌. వాళ్లను మహాబలిపురం తిప్పుతుండగా తల్లికి ఆరోగ్యం పాడైనట్టు చెల్లి రాధ వచ్చి చెబుతుంది. ఆ అన్నా, చెల్లి పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్లిపోతారు. కానీ అప్పటికే వాళ్లమ్మ చనిపోయుంటుంది. ఈ విషయం తెలిసిన గుంటూరు దంపతులు ఆ పిల్లలిద్దరినీ దత్తత తీసుకోవాలనుకుంటారు. ప్రతినెల తనకు వంద రూపాయలు ఇవ్వాలనే నియమం మీద ఆ పిల్లలను ఆ దంపతులకు దత్తత ఇస్తాడు బాలరాజు మేనమామ.

పిల్లలను తీసుకుని వెళుతుండగా తమ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగిందని టెలిగ్రాం అందుతుంది ఆ దంపతులకు. దాన్నొక అపశకునంగా, దానికి బాలరాజు గ్రహచారమే కారణం అనుకుంటూంటారు ఆ దంపతులు. ఆ మాటను చాటుగా విన్న ఆ అన్నా, చెల్లెలు తిరిగి తమ ఇంటికి వెళ్లిపోతారు. బాలరాజు గురువుగా భావించే ఓ శిల్పాచార్యుడు ఆ పిల్లవాడిని ఓదారుస్తాడు. శిల్పాచార్యుడు పర్యవేక్షిస్తున్న శిల్పాల తయారీ స్థలంలో ఓ వినాయకుడి విగ్రహం ఉంటుంది. దాని దగ్గరున్న ఓ శిలాఫలకంలో కొన్ని వాక్యాలు రాసి ఉంటాయి. వాటిల్లో ఉన్నట్టే పరిస్థితులు ఎదురవుతుంటాయి బాలరాజుకు. చదువులేని బాలరాజుకు ఆ సంఘటనలే లోకజ్ఞానాన్ని కలగజేస్తుంటాయి. ఇంతలోకి గుంటూరు దంపతుల్లోని భార్య ఈ పిల్లల మీద బెంగతో మంచం పడుతుంది. ఆ పిల్లలను తీసుకెళితే తన భార్య మళ్లీ ఆరోగ్యవంతురాలవుతుందని తలుస్తాడు. పిల్లలను వెదుక్కుంటూ మళ్లీ మహాబలిపురం వస్తాడు. దత్తత ఇవ్వమని పిల్లల మేనమామను బతిమిలాడుతాడు. మేనమామ ఒప్పుకొని పిల్లలను అతనితో పంపించేస్తాడు. పిల్లల మాట వినగానే ఆ తల్లి కళ్లు తెరుస్తుంది. బాలరాజు కోరిక మేరకు అతని మేనమామ కుటుంబాన్ని కూడా తమ ఇంటికి తీసుకొస్తారు గుంటూరు దంపతులు. అలా బాలరాజు కథ సుఖాంతమవుతుంది. 

ఇది ‘వా రాజా వా’ అనే తమిళ సినిమాకు రీమేక్‌. మూల కథ.. నాగరాజన్‌. మాటలు.. ముళ్లపూడి వెంకటరమణ, దర్శకత్వం.. బాపు. ఈ బ్లాక్‌ అండ్‌ వైట్‌ సినిమా కథను టూకీగా 1970, ఆగస్ట్‌ చందమామ సంచికలో బాపూ బొమ్మలతో ప్రచురించారు. 

చదవండి: హెచ్చరిక!! ఈ శతాబ్దం చివరి నాటికి భూమిపై ఘోర మారణహోమం..

పథేర్‌ పాంచాలి
బెంగాల్‌లోని నిశ్చింద్రపురం ఊరి చివరన ఉంటుంది హరిహర్‌ రాయ్‌గారి పాత పెంకుటిల్లు. వచ్చే కొద్దిపాటి సంపాదనతో అతను పూజారిగా జీవనం సాగిస్తుంటాడు కానీ గొప్ప కవి, నాటక రచయిత అవ్వాలని కలలు కంటుంటాడు. అతని భార్య సర్వజయ, కూతురు దుర్గ, కొడుకు అపు హరిహర్‌ రాయ్‌కు వరుసకు అక్క అయిన ఇందిరమ్మ అనే ముసలావిడ.. అతని కుటుంబ సభ్యులు. హరిహర్‌ రాయ్‌ సంపాదన కోసం ఊర్లు పట్టుకు తిరుగుతుంటాడు. సర్వజయకు ఇందిరమ్మంటే పడదు. దుర్గ, అపుల అల్లర్లు, ఆకతాయి పనులు, చిన్న చిన్న సంతోషాలతో కాలం గడుస్తూంటుంది. దుర్గ స్నేహితురాలి పెళ్లి కుదురుతుంది. ఆపెళ్లికి వెళ్లి తిరిగి వస్తూండగా కుండపోతగా వర్షం కురుస్తుంది. ఆ వానలో దుర్గ డాన్స్‌ చేస్తుంది. అలా వర్షంలో తడవడంవల్ల దుర్గకు జ్వరం వస్తుంది.

వైద్యంచేసినా జ్వరం తగ్గదు. తరువాతి రోజు రాత్రి తుఫాను వస్తుంది. ఆ రాత్రే దుర్గ చనిపోతుంది. పక్కింటి వాళ్ల సహాయంతో అంత్యక్రియలూ జరుగుతాయి. ఈ విషయం తెలియని హరిహర్‌రాయ్‌ ఊరి నుంచి ఇంటికి వస్తాడు. దుర్గ చనిపోయిందని తెలిసి భోరున విలపిస్తాడు. సర్వజయను ఓదార్చడమైతే ఎవరి తరమూ కాదు. తుఫానుకు వంటగది కూలిపోయి ఉంటుంది. ఆ ఊరు వదిలేసి కాశీ వెళ్లిపోవటానికి సిద్ధమవుతుంది ఆ కుటుంబం. గ్రామపెద్దలు వచ్చి ఊరు వదిలివెళ్లొద్దని సర్దిచెప్తారు. కానీ హరిహర్‌ రాయ్‌ ఒప్పుకోడు. ఇల్లు సర్దే క్రమంలో అపుకి దుర్గ దొంగలించిన పూసలదండ దొరుకుతుంది. అపు పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ దండను కొలనులోకి విసిరేస్తాడు. ఆ విషయం ఎవరికీ చెప్పడు. హరిహర్‌ రాయ్‌ కుటుంబం ఎద్దుల బండిలో కాశీకి బయలుదేరడంతో సినిమా ముగుస్తుంది. 

1929లో బిభూతిభూషణ్‌ బందోపాధ్యాయ రాసిన ‘పథేర్‌ పాంచాలి’ అనే బెంగాలీ నవల ఆధారంగానే అదే పేరుతో 1955లో ఈ సినిమాను తీశాడు సత్యజిత్‌ రాయ్‌. ఈ నవలను 1960లో మద్దిపట్ల సూరి తెలుగులో అనువదించారు. 

వేర్‌ ఈజ్‌ ది ఫ్రెండ్స్‌ హోమ్‌
(ఇరానియన్‌ సినిమా. కథ, దర్శకత్వం.. అబ్బాస్‌ కైరోస్తమి)
ఇరాన్‌లోని కొకర్‌ గ్రామంలో అహ్మద్‌ అనే ఎనిమిదేళ్ల పిల్లాడుంటాడు. ఇంటిపనుల్లో వాళ్లమ్మకు సాయం చేస్తూ ఊరిలోని బడిలో చదువుకునేవాడు. ఎప్పటిలాగే ఆరోజు కూడా ఇంటికి వచ్చి హోమ్‌వర్క్‌ చేయబోతుంటే తెలుస్తుంది పొరపాటున తన క్లాస్‌మేట్‌ మహమ్మద్‌ రెజా నమత్‌జాద్‌ నోట్‌బుక్‌ను తను తెచ్చేశాడని. వెంటనే ఆ నోట్‌బుక్‌ను అతనికి తిరిగి ఇవ్వకుంటే అతను హోమ్‌వర్క్‌ చేయలేడు. హోమ్‌వర్క్‌ చేయకుంటే టీచర్‌ క్లాస్‌లోకి రానివ్వడు. అందుకే ఎలాగైనా ఆ రోజే ఆ నోట్‌బుక్‌ను స్నేహితుడికి ఇవ్వాలని అనుకుంటాడు. జరిగిన విషయం తల్లితో చెప్తాడు. ‘రేపు ఇవ్వొచ్చులే’ అని వారిస్తుంది ఆమె. దాంతో అమ్మకు తెలియకుండా నోట్‌బుక్‌ను చొక్కాలోపల దాచుకుని పరుగులాంటి నడకతో బయలుదేరుతాడు అహ్మద్‌.

వాళ్లూరికి పక్కనున్న కొండ మీద ‘పొస్థే’ అనే ఊళ్లోనే ఉంటుంటాడు నమత్‌జాద్‌. పరిగెత్తుకుంటూ పోస్థేకి చేరుకుంటాడు అహ్మద్‌. కానీ అంతకు క్రితమే నమత్‌జాద్‌ వాళ్ల బంధువైన హెమాతి వాళ్ల ఇంటికి వెళ్లాడని తెలుస్తుంది. అతికష్టం మీద హెమాతి వాళ్ల ఇంటికీ వెళ్తాడు. అక్కడ హెమాతి ఉండడు. అహ్మద్‌ స్వగ్రామం అయిన కొకర్‌కే వెళ్లాడని తెలుస్తుంది. మళ్లీ పరిగెత్తుకుంటూ కొకర్‌కు వస్తాడు అహ్మద్‌. అక్కడా నమత్‌జాద్‌ కనిపించడు. మళ్లీ పోస్థేకు వెళతాడు. అయినా నమత్‌జాద్‌ జాడ కనిపెట్టలేకపోతాడు. ఈలోపు రాత్రవుతుంది. నిరాశతో ఇల్లు చేరతాడు అహ్మద్‌. ఎక్కడికెళ్లావంటూ పిల్లాడిని మందలిస్తుంది తల్లి. తన హోమ్‌వర్క్‌తో పాటు నమత్‌జాద్‌ హోమ్‌వర్క్‌ కూడా పూర్తిచేస్తాడు అహ్మద్‌. తరువాతి రోజు తరగతి గదిలో పిల్లల హోమ్‌వర్క్‌ చూసిన టీచర్‌ నమత్‌జాద్‌ హోమ్‌వర్క్‌ బుక్‌లో గుడ్‌ అని రాస్తాడు.

డ్రీమ్స్‌
(జపనీస్‌ సినిమా. కథ, దర్శకత్వం.. అకిరా కురసోవా)
ఇందులో మొత్తం 8 కథలుంటాయి. ఒక కథకు మరో కథకు సంబంధం ఉండదు. దేనికదే స్వతంత్ర కథగా నడుస్తుంది. వీటిల్లోని సన్‌షైన్‌ త్రూ ది రైన్‌ అనే ఒక కథ గురించి మాత్రం ఇక్కడ తెలుసుకుందాం. జపాన్‌లోని ఓ గ్రామంలో ఒక ఆరేళ్ల పిల్లాడు ఉంటుంటాడు. ఒకరోజు మధ్యాహ్నం హఠాత్తుగా వానపడుతుంది. ఓ వైపు ఎండగానే ఉంటుంది.. ఇంకోవైపు చినుకులు పడుతునే ఉంటాయి. పిల్లవాడి అమ్మ పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి చేటలో ఎండబెట్టిన వాటిని ఇంట్లోకి చేరుస్తుంటుంది. పిల్లాడేమో వానలో నిలబడి ఉంటాడు. ‘ఇలా ఎండా.. వానా ఒకేసారి వస్తే మన ఇంటి పక్కనున్న అడవిలో నక్కల పెళ్లి జరుగుతుంది.

వాటి పెళ్లిని మనుషులు చూస్తే వాటికి కోపం వస్తుంది. అందుకే త్వరగా ఇంట్లోకి వచ్చేయ్‌’ అంటుంది అమ్మ. ఆమె అలా ఇంట్లోకి వెళ్లగానే పిల్లాడు వడివడిగా నడుచుకుంటూ ఇంటి పక్కనున్న అడవిలోకి వెళ్లిపోతాడు. అక్కడ ఆకాశాన్ని తాకే పెద్దపెద్ద చెట్లు ఉంటాయి. వాటి మొదళ్లు చాలా లావుగా బలంగా ఉంటాయి. పిల్లాడు ఓ చెట్టు వెనుక దాక్కుంటాడు. నక్కల వేషధారణలోని స్త్రీ, పురుషుల గుంపు లయబద్ధంగా సంగీత వాయిద్యాలు వాయిస్తూ నాట్యం చేస్తూంటుంది. ఆ గుంపుకి కనిపించకుండా పిల్లాడు ఓ చెట్టు బోదె వెనుక దాక్కుని అంతా గమనిస్తుంటాడు. కాని ఓ ఇద్దరు ఆ బాలుడిని కనిపెడ్తారు. కళ్లతో కోపాన్ని చూపిస్తారు. పిల్లాడు భయపడి ఇంటికి పారిపోతాడు. వాడి కోసం ఎదురుచూస్తున్న అమ్మ ‘నా మాట వినకుండా నక్కల పెళ్లి చూసి వాటికి కోపం తెప్పించావు.

ఓ మగనక్క వచ్చి ఈ కత్తి నీకు ఇమ్మంది. దీన్ని తీసుకెళ్లి వాటికి తిరిగి ఇచ్చేసి క్షమాపణ చెప్పి రా! నక్కల క్షమాపణ సంపాదించే వరకు నిన్ను ఇంటికి రానివ్వను’ అంటుంది కరాఖండిగా. ‘నక్కలు ఎక్కడుంటాయో నాకు తెలీదు’ అంటాడు పిల్లాడు. ‘ఇలాంటి వాతావరణంలో నక్కలు ఇంద్రధనుస్సు కింద ఉంటాయి’ అని చెప్పి పిల్లాడిని బయటే ఉంచి తలుపు వేసేస్తుంది అమ్మ. రూళ్లకర్రలా ఉన్న ఆ కత్తిని తీసుకుని పక్కనే ఉన్న తోటలోకి వెళ్తాడు పిల్లాడు. ఆ తోటంతా రంగురంగుల పూలమయం. ఎదురుగా ఉన్న రెండు కొండల మధ్య అద్భుతమైన ఇంద్రధనుస్సు కనపడుతుంది. నడుచుకుంటూ దాని దగ్గరకు వెళ్తాడు పిల్లాడు. ఇక్కడితో ఈ కథ ముగుస్తుంది. ముగింపు ప్రేక్షకుల ఊహకే వదిలేస్తాడు దర్శకుడు. ఇలా మొత్తం ఎనిమిది కథలతో ఈ సినిమా సాగుతుంది. 

ఇంకెన్నో పిల్లల సినిమాలు..
పిల్లలూ.. ఇలా మిమ్మల్ని అలరించే ఇంకెన్నో మంచి సినిమాలు ఉన్నాయి. వీటిల్లో కష్టాంక (రష్యన్‌), ది రెడ్‌ బెలూన్‌ (ఫ్రెంచ్‌), చిల్డ్రన్‌ ఆఫ్‌ హెవెన్‌ (ఇరానియన్‌), ది కార్ట్‌ (ఇరానియన్‌), గిఖోర్‌ (అర్మీనియన్‌), ది బ్లూ అంబ్రెల్లా (హిందీ), ది ఓల్డ్‌ మ్యాన్‌ అండ్‌ ది సీ (క్యూబన్‌), ది మ్యాన్‌ హూ ప్లాంటెడ్‌ ట్రీస్‌ (ఫ్రెంచ్‌), ది కలర్‌ ఆఫ్‌ పారడైజ్‌ (ఇరానియన్‌), ది కిడ్‌ (అమెరికన్‌), బైసికిల్‌ థీవ్స్‌ (ఇటాలియన్‌), ది వైట్‌ బెలూన్‌ (ఇరానియన్‌), లాస్ట్‌ ఇన్‌ ది డెజర్ట్‌ (అమెరికన్‌), జంపింగ్‌ ఓవర్‌ పెడల్స్‌ అగైన్‌ (చెకోస్లోవియన్‌ ), కాక ముటై్ట (తమిళ్‌), ఇవాన్స్‌ చైల్డ్‌హుడ్‌ (రష్యన్‌), ది చైల్డ్‌హుడ్‌ ఆఫ్‌ మాక్సిమ్‌ గోర్కీ (రష్యన్‌), ది మిర్రర్‌ (ఇరానియన్‌), ది రన్నర్‌ (ఇరానియన్‌), స్ట్రే డాగ్స్‌ (ఇరానియన్‌) ... వంటివి తప్పక చూడాల్సిన కొన్ని చిత్రాలు. 

– అనిల్‌ బత్తుల (‘పిల్లల సినిమా కథలు పుస్తకం’ నుంచి..)

చదవండి: వింత ఆచారం! అల్లుడికి కట్నంగా 21 విషపూరితమైన పాములు..

మరిన్ని వార్తలు