బరువు పెరుగుతున్నా.. మానసిక చికాకులను ఆపడానికైనా అదే సరైన ఔషదం

19 Jan, 2022 12:13 IST|Sakshi

బరువు పెరుగుతున్నట్టు అనిపించినా, మానసిక చికాకులను ఆపడానికైనా వ్యాయామం సరైన ఔషధంగా పనిచేస్తుంది. అందులోనూ కరోనా మహమ్మారి కాలంలో శరీరానికి తగినంత శక్తిని అందించడానికి కూడా వ్యాయామం ఎంతగానో తోడ్పడుతుందని తెలిసిందే. ఇక నేడు, రోజూ 8–9 గంటల పాటు ఉద్యోగం చేసేవారు తమ జీవన శైలిలో విపరీతమైన మార్పులను చవిచూస్తున్నారు. వీటన్నింటికీ సరైన సమాధానం శారీరక శ్రమను కలిగించే వ్యాయామం. వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ అయ్యాక బెడ్‌రూమ్, లివింగ్‌ రూమ్‌లలో పనిచేసే కొత్త సంస్కృతి వచ్చి చేరింది. ఈ గదులు సౌకర్యంగా అనిపించినా, వారి ఆరోగ్యంపై కనిపించని ప్రభావం మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. 

చురుకుదనానికి..
నిద్రలో ఉన్నప్పుడు కూడా బరువు తగ్గడంలో సహాయపడే రోజువారీ అలవాటుగా వ్యాయామాన్ని భాగం చేసుకోవాలి. శరీరం తన శారీరక కదలికలను తగ్గించుకున్నప్పుడు రకరకాల సమస్యలు, వ్యాధులు ఎలాంటి హెచ్చరిక లేకుండా వచ్చి చేరిపోతాయి. అప్పుడు శరీరానికి పని లేకుండా గంటలతరబడి కూర్చోవడం వల్ల ఆరోగ్యం ఎలా పాడైందో గ్రహిస్తారు. ముఖ్యంగా 40 ఏళ్ల తర్వాత మహిళలు శారీరక శ్రమ తగ్గితే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. శరీరాన్ని చురుకుగా ఉంచుకోవడం వల్ల గుండె సమస్యలు, మధుమేహం, కీళ్లనొప్పులు.. మొదలైన ఆరోగ్య సమస్యలు దరిచేరకుండా కాపాడుకోవచ్చు. 

నడకతో బలం
కండరాలను బలపరచడంలోనూ, నిద్రను మెరుగుపరచడంలోనూ ఎంతో ప్రభావంతంగా పనిచేస్తుంది నడక. అంతేకాదు ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. అలై్జమర్స్‌ ప్రమాదాన్ని నివారిస్తుంది. రుతుక్రమం ఆగిపోయిన స్త్రీలపై జరిగిన ఒక అధ్యయనంలో ప్రతిరోజూ 30 నిమిషాల నడక వారి తుంటి పగుళ్ల ప్రమాదాన్ని 40 శాతం తగ్గించిందని గుర్తించారు. హార్వర్డ్‌ హెల్త్‌ రీసెర్చ్‌ ప్రకారం 70 కిలోలు ఉన్న వ్యక్తి 30 నిమిషాల పాటు (గంటకు ఆరున్నర కిలోమీటర్ల వేగంతో) నడిస్తే 167 కేలరీలు ఖర్చు చేస్తారని అంచనా వేశారు.  

హానికారకాలకు దూరం
30 నిమిషాల పాటు నడవడం సౌకర్యంగా ఉంటే నడకను సాధారణ జాగింగ్‌కు అప్‌గ్రేడ్‌ చేయవచ్చు. నడక కంటే జాగింగ్‌ ఇంకాస్త ప్రభావవంతంగా ఉంటుంది. ఇది హానికరమైన కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. వాకింగ్‌లాగానే జాగింగ్‌ చేయడానికి ఎలాంటి పరికరాలు అవసరం లేదు. ప్రారంభించడానికి ఒక జత బూట్లు ఉంటే చాలు. 

బరువును తగ్గించే సైక్లింగ్‌
సైక్లింగ్‌ చేయడం వచ్చినా మూడు పదుల వయసు దాటిన తర్వాత దానిని దాదాపుగా మూలన పడేస్తారు మహిళలు. కానీ, 30 ఏళ్ల తర్వాతనే సైక్లింగ్‌ వలన శరీరానికి మరిన్ని ప్రయోజనాలు అందుతాయి. హార్వర్డ్‌ హెల్త్‌ ఉదహరించిన ఒక పరిశోధనా ప్రకారం శారీరక శ్రమ, బరువులో మార్పులను అధ్యయనం చేయడానికి పరిశోధకులు 16 సంవత్సరాల పాటు 18,000 మందికి పైగా మహిళలను గమనించారు. వీరి అధ్యయనంలో వ్యాయామం చేయని మహిళలు సగటున 20 పౌండ్ల బరువు పెరిగారు. అదే రోజూ 30 నిమిషాలు సైక్లింగ్‌ చేసిన వారు 20 పౌండ్ల బరువు తగ్గారు. దీనివల్ల సైక్లింగ్‌ మిగతా వాటికన్నా అదనపు ప్రయోజనాలు ఇస్తుందని నిరూపించారు. 


మెరుగైన ఆనందానికి..
ఈత అనేది వినోదంతో పాటు ఆరోగ్యకరమైన చర్య. ఈత హృదయ స్పందన రేటును పెంచుతుంది. కండరాలను టోన్‌ చేస్తుంది. శరీరానికి మొత్తం వ్యాయామం అందిస్తుంది. కీళ్ల నొప్పులు ఉన్నవారికి, ఇతర రకాల శారీరక శ్రమలు నొప్పిని తీవ్రతరం చేస్తాయి కానీ, ఈత మరిన్ని ప్రయోజనాలు అందిస్తుంది. ఆర్థ్రరైటిస్‌ ఉన్న వ్యక్తులకు కూడా ఈత ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తుంది. నీటి ఆధారిత వ్యాయామాల వల్ల కీళ్ల పనితనం మెరుగుపడుతుంది.

సంపూర్ణ ఆరోగ్యం..
ఇది శారీరక శ్రమకు రూపం మాత్రమే కాదు. మానసిక ఒత్తిడిని నివారిస్తుంది. బరువును తగ్గించడంతో పాటు మొత్తం ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడుతుంది. యోగాలోని ధ్యానం అలై్జమర్స్‌ రాకుండా నిరోధించడమే కాదు జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఇతరులతో పోల్చితే యోగా చేసే వ్యక్తులు 43 శాతం తక్కువ వైద్య సేవలను ఉపయోగించుకుంటారని అధ్యయనాలు చూపుతున్నాయి. 

మరిన్ని వార్తలు