Health: ఉదయాన్నే నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తీసుకుంటున్నారా? వేసవిలో ఇలా చేస్తే..

19 Apr, 2023 15:32 IST|Sakshi

మండే ఎండల్లోనూ... అందంగా... ఆరోగ్యంగా

ఎండాకాలం కాసేపు బయటికి వెళితే చాలు ముఖచర్మం కమిలిపోతుంది. విపరీతంగా చెమటలు పోస్తాయి. నీరసం, నిస్త్రాణ కలుగుతాయి. కాసేపు పని చేస్తే చాలు శరీరం అలసిపోయి, సొమ్మసిల్లినట్లు అవుతుంది. బయటికి వెళ్లేటప్పుడు కొన్ని చిట్కాలు పాటిస్తే ఎండల్లోనూ అందంగా ఆరోగ్యంగా ఉండవచ్చు. అవేమిటో చూద్దాం... 

పుదీనా, నిమ్మరసం- తేనెతో
►మంచి నీటిని మించిన ఔషధం లేదు. శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా కాపాడేది మంచినీరు మాత్రమే. కాబట్టి ఇప్పటినుంచీ దాహం వేసినా వేయకపోయినా వీలైనంత ఎక్కువగా నీళ్లు తాగడం అలవాటుగా మార్చుకోండి. 

►గుప్పెడు పుదీనా ఆకులను తాగే నీటిలో వేసుకుంటే... శరీరం చల్లగా ఉంటుంది. ఈ కాలంలో పుదీనా టీని ఎంచుకుంటే మరీ మంచిది. ఎండ ప్రభావాన్ని కొంతవరకూ తట్టుకోగలుగుతారు. 
►నిమ్మరసం వేసవికి ఔషధం లాంటిది. ఉదయాన్నే గ్లాసు నీటిలో కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి తీసుకుంటే  ఆరోగ్యంగా ఉంటారు. 

పెరుగు తీసుకుంటే
ఉప్పు, కొద్దిగా మసాలాలు జోడించి పెరుగు చిలికి చేసే మజ్జిగ శరీరంలో వేడిని చల్లారుస్తుంది. డీహైడ్రేషన్‌ ను నివారిస్తుంది. ఇది ఎలక్ట్రోలైట్ల భరితం. వేసవి తాపంతో పోరాడటానికి మజ్జిగ ఒక మంచి ఆప్షన్‌. దీనిలో క్యాలరీలు తక్కువ. కాల్షియం, పొటాషియంతో పాటు ప్రొటీన్‌ కూడా దీని నుంచి దొరుకుతుంది. అసిడిటీని తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అదేవిధంగా పెరుగు తీసుకోవడం కూడా మంచిదే. 

కొత్తిమీర రసంతో
►గసగసాలను ఎక్కువగా ఆహారపదార్థాల్లో వాడాలి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. అంతేకాదు, వేడిని తగ్గించి, శరీరాన్ని చల్లగా ఉంచుతాయి.
►కొత్తిమీరను ఆహారంలో అధికంగా తీసుకోవాలి. కొత్తిమీర రసం లేదా వంటకాల్లో దీన్ని వాడినా... శరీరంలోని అధిక ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. 

సీజనల్‌ పండ్లు తినడం వల్ల
►వేసవిలో ఆయిల్‌ ఫుడ్స్‌కి దూరంగా ఉండాలి. ఇంటి వంటలలో కూడా నూనె వాడకం తగ్గించాలి.
►ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. మసాలా కూరలు తగ్గించాలి.

►అల్పాహారంగా ఆవిరి కుడుములు, ఇడ్లీ వంటివి తీసుకుంటే మేలు.  
►కర్బూజా, పుచ్చకాయలు, ఈత కాయలు, తాటి ముంజలు వంటి సీజనల్‌ పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది.

►వేసవిలో రోజుకోసారి రాగిజావ తీసుకోవడం వల్ల కడుపులో చల్లగా ఉండటంతోపాటు మరెన్నో లాభాలు  ఉన్నాయి.
►రాగుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. దీన్ని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి.  

చర్మ సంరక్షణ ముఖ్యం
►వేసవిలో సన్‌స్క్రీన్‌ లోషన్‌ని రాసుకోవడం వల్ల చర్మానికి సమస్యలు తగ్గుతాయి. ఈ సన్‌ స్క్రీన్‌ లోషన్‌ని బయటికి వెళ్లినప్పుడు మాత్రమే కాకుండా ఇంట్లో ఉన్నప్పుడు కూడా అప్లై చేసుకోండి. సన్‌ స్క్రీన్‌ లోషన్‌ వాడటం వల్ల చర్మ సమస్యలు ఉండవు. అలాగే చర్మానికి రక్షణ ఉంటుంది.

►ఎండల్లో బయటకు వెళ్ళినప్పుడు చర్మాన్ని కవర్‌ చేసుకోవడం అవసరం. కాబట్టి మీరు బయటకు వెళ్లేటప్పుడు గొడుగుని తీసుకువెళ్లడం మర్చిపోకండి. అలానే ఎండాకాలంలో బయటకు వెళ్ళేటప్పుడు సన్‌ గ్లాసెస్‌ని ధరించడం, తలకు పెద్ద టోపీ పెట్టుకోవడం పైగా ఎలాంటి సమస్యలూ రావు.

చదవండి: ఇరవై మందార పూలు.. మెంతులు.. పచ్చకర్పూరం! ఇలా చేస్తే ఒత్తైన కురులు

మరిన్ని వార్తలు