టెక్నాలజీ వేసిన బాట.. ట్రావెలర్స్‌కి వరాల మూట..

12 Jun, 2022 07:41 IST|Sakshi

చిన్న బౌల్‌లో ఉల్లి పేస్ట్‌.. 
చిన్న బాటిల్‌లో కాఫీ.. 
చిన్న బకెట్‌లో వాషింగ్‌ మెషిన్‌.. 
చిన్న బాక్స్‌లో వంట..
ఇదేం చిన్నపిల్లలు ఆడుకునే లక్కపిడతల ఆట కాదు.. 
టెక్నాలజీ వేసిన బాట..
ట్రావెలర్స్‌కి వరాల మూట..
కొత్త ప్రదేశాలను చూడటమంటే మనసుకి ఎప్పుడూ ఆహ్లాదమే. 
ఒత్తిడికి దూరంగా రిలాక్స్‌ అవ్వడం కోసం... రిఫ్రెష్‌ కావడం కోసం...
పరుగుతీసే విహారయాత్రల్లో అలసటకి, ఆకలికి తావు లేదంటోంది టెక్నాలజీ. 
ప్రయాణికులకు లైట్‌ లగేజ్‌ పాలసీని చూపిస్తోంది. 
ఊళ్లు, రాష్ట్రాలు దాటి వెళ్లినా ఇంట్లో ఉన్నంత దర్జాగా గడపమంటోంది.
కంఫర్టబుల్‌ ట్రావెల్‌ని పరిచయం చేస్తోంది. 
పిల్లల తల్లులైనా, పండు ముసలి అయినా.. 
ఈ మినీ గాడ్జెట్స్‌ని వెంట పెట్టుకుని ప్రయాణిస్తే.. తిరుగే లేదు

రీచార్జబుల్‌ చాపర్‌

వంట అనగానే ఉల్లిపాయ ముక్కల దగ్గర నుంచి.. అల్లం, కొత్తమీర తురుము వరకూ ప్రతీది అవసరమే. ఇంట్లో అయితే తీరిగ్గా చాకు తీసుకుని కట్‌ చేయడమో, మిక్సీ పట్టుకోవడమో చేస్తుంటాం. కానీ క్యాంపింగ్‌లో అవన్నీ సాధ్యం కాదుlకదా! అందుకే ఈ మినీ చాపర్‌. ఇందులో అల్లం, వెల్లుల్లి వేసినా.. క్యారెట్, బీట్‌రూట్‌ వేసినా.. చకచకా తరిగేస్తుంది. కచ్చాపచ్చా చేసేస్తుంది. ఉల్లిపాయలు, కూరగాయలు, చికెన్, మటన్‌ ఇలా వేటినైనా సరే.. నచ్చిన విధంగా, వంటకానికి కావాల్సిన విధంగా తరిగిపెడుతుంది.

వీటిలో ముందే చార్జింగ్‌ పెట్టుకుని వాడుకునేవి అందుబాటులో ఉన్నాయి. మూడు గంటలు చార్జింగ్‌ పెడితే 35 సార్ల వరకు ఉపయోగించుకోవచ్చు. ఫోన్, పవర్‌ బ్యాంక్‌తో కూడా చార్జింగ్‌ పెట్టుకోవచ్చు. ఐదేళ్లలోపు పిల్లలకు ఆపిల్, బనానా వంటివి నిమిషాల్లో పేస్ట్‌ చేసి, అదే బౌల్‌లో తినిపించొచ్చు. దీన్ని క్లీన్‌ చేయడం చాలా సులభం.


యూనివర్సల్‌ కార్‌ రైస్‌ కుకర్‌ 
ఈ ప్రత్యేకమైన డివైజ్‌.. కారులో ప్రయాణించేవారికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కారులోనే భోజనం సిద్ధం చేసుకోవచ్చు. దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్లడానికి అనుకూలంగా ఉంటుంది. రైస్‌ కుకర్‌ లోపలి భాగంలో నాన్‌–స్టిక్‌ కోటింగ్‌తో సులభంగా శుభ్రమయ్యే విధంగా ఉంటుంది. ఈ మల్టీఫంక్షనల్‌ స్మార్ట్‌ రైస్‌ కుకర్‌ అన్నం వండటమే కాకుండా.. ఓట్‌ మీల్, సూప్‌తో పాటు గుడ్లు, కూరగాయలు, చికెన్, మటన్‌ వంటివి ఉడికించడం ఇలా చాలానే చేస్తుంది. పైగా తినేంత వరకూ ఆహారాన్ని వేడిగానే ఉంచుతుంది. ఇది నీటి లీకేజ్‌నూ నివారిస్తుంది.


ఫోల్డబుల్‌ బెడ్‌–చైర్స్‌–స్టూల్స్‌
దూర ప్రయాణాల్లో ఫోల్డబుల్‌ బెడ్స్, ఫోల్డింగ్‌ చైర్స్, ఫోల్డింగ్‌ స్టూల్స్‌ లగేజ్‌లో భాగం చేసుకోవడం చాలా మంచిది. దారిలో.. ఖాళీ స్థలాల్లో ఆగి విశ్రాంతి తీసుకునేప్పుడు బాగా ఉపయోగపడతాయి. వృద్ధులు, పిల్లలు కాస్త నడుము వాల్చడానికీ.. రెస్ట్‌గా ఉండటానికీ కంఫర్టబుల్‌గా ఉంటాయి. పైగా అవి ఫోల్డ్‌ చేసుకునే వీలు ఉండటంతో లగేజ్‌లో ఎక్కువ స్థలం ఆక్రమించవు. తేలికగా కూడా ఉంటాయి.


మల్టీఫంక్షన్‌ జ్యూసర్‌
భీకరమైన ఆకలిని సైతం ఒక గ్లాసు జ్యూస్‌ తీర్చేస్తుంది. అందుకే నీరసం వచ్చినా.. ఆకలేసినా, దాహం వేసినా ముందుగా జ్యూస్‌ కార్నర్‌ దగ్గరకు పరుగుతీస్తాం. ప్రయాణాల్లో ఈ మినీ జ్యూసర్‌ని లగేజ్‌లో ప్యాక్‌ చేసుకుంటే చక్కగా ఎక్కడ కావాలంటే అక్కడ ఎప్పుడు కావాలంటే అప్పుడు నచ్చిన జ్యూస్‌ సిద్ధం చేసుకోవచ్చు. డివైజ్‌ ముందువైపు ఉన్న బటన్‌ ప్రెస్‌ చేస్తే.. లోపలున్న బ్లేడ్స్‌ గిర్రున తిరుగుతూ హెల్దీ జ్యూస్‌ని తయారుచేస్తాయి. వాటర్‌ బాటిల్‌లా ఉన్న ఈ డివైజ్‌లో ట్రాన్స్‌పరెంట్‌ గ్లాస్‌ బౌల్‌లో పండ్లు లేదా కూరగాయల ముక్కలు, పాలు లేదా నీళ్లు, పంచదార లేదా తేనె జోడించి మిక్సీ పట్టుకోవాలి. అదే గ్లాస్‌ బౌల్‌లో జ్యూస్‌ తాగెయ్యొచ్చు. దీనికి ముందుగానే చార్జింగ్‌ పెట్టుకుంటే.. పవర్‌ కనెక్షన్‌తో అవసరం లేకుండానే పని చేస్తుంది.


క్యాంపింగ్‌ కుక్‌వేర్‌ కిట్‌
వంట అనగానే చాలా పాత్రలు అవసరం అవుతాయి. కానీ ప్రయాణాల్లో అన్ని పాత్రలు పెట్టుకోవడం అసాధ్యం. అవుట్‌డోర్‌లో అవసరానికి తగ్గట్టు రూపొందిన కిట్‌ ఇది. చూడటానికి చిన్న సైజ్‌ హాట్‌ బాక్స్‌లా ఉంది కదూ. కానీ దీన్ని ఓపెన్‌ చేస్తే.. రెండు పెద్ద పెద్ద పాత్రలు, రెండు చిన్న పాత్రలు, బౌల్స్, గరిటెలు ఇలా అవసరమైనవన్నీ ఇందులో ఉంటాయి. పైగా ఈ బాక్స్‌ క్లోజ్‌ చేయడానికి క్లిప్స్‌లా ఉపయోగపడే గ్రీన్‌ కలర్‌ ఫోల్డబుల్‌ స్టిక్స్‌.. బాక్సులు ఓపెన్‌ చేశాక వాటిని హ్యాండిల్స్‌లా మార్చుకోవచ్చు. దాంతో ఈ పాత్రల్లో ఏది వండుకున్నా సర్వ్‌ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. చిన్న గ్యాస్‌ సిలిండర్‌పైన లేదా కట్టెలపైనా చాలా సులభంగా వంట చేసుకోవచ్చు. ఈ కుక్‌వేర్‌ మొత్తాన్ని పెట్టుకోవడానికి ఒక ప్రత్యేకమైన బ్యాగ్‌ కూడా లభిస్తుంది.


కాస్మెటిక్‌ స్టోరేజ్‌ బాక్స్‌
సాధారణంగా టూర్‌ అనగానే.. ఆడవారికి అందంపై ప్రత్యేక శ్రద్ధ ఉంటుంది. వ్యాక్సింగ్, పెడిక్యూర్, మ్యానిక్యూర్, ఫేషియల్‌ వంటివన్నీ చేయించుకుని సిద్ధంగానే ఉంటారు. అయితే ఇంటికి దూరంగా ప్రయాణాలు చేస్తున్నప్పుడు డ్రెస్‌కి తగ్గ జ్యూయెలరీ, లిప్‌స్టిక్స్, నెయిల్‌ పాలిష్‌ వంటి చిన్నచిన్నవన్నీ చాలా ముఖ్యం. వాటిని లగేజ్‌లో ఏదో మూల వేసుకునే కంటే.. అన్నీ ఒకే బాక్స్‌లో స్టోర్‌ చేసుకోవడం చాలా ముఖ్యం. అందుకు సహకరిస్తుంది చిత్రంలోని ఈ స్టోరేజ్‌ బాక్స్‌. ఇందులో అద్దంతో పాటు నాలుగు అరలు ఉంటాయి. అద్దం బాక్స్‌ మూతలా కూడా పని చేస్తుంది. ఒక్కో అరలో ఒక్కో వెరైటీ చొప్పున జ్యూయెలరీ, మేకప్‌ కిట్, హెయిర్‌ క్లిప్స్, హెయిర్‌ బ్యాండ్స్‌ వంటివి ఉంచుకుంటే సరిపోతుంది. ఈ బాక్స్‌లోని అరలు 360 డిగ్రీలు తిరుగుతూ రెడీ అవడానికి అనువుగా ఉంటాయి.

ఫోల్డింగ్‌ బార్బెక్యూ గ్రిల్‌

చిత్రంలోని ఈ  గ్రిల్‌ ఫోల్డ్‌ చేస్తే కాస్త పొడవాటి పుస్తకంలా కనిపిస్తుంది. దీనిలో రెండు గ్రిల్స్‌ ఉంటాయి. ఒకటి బొగ్గులు వేసుకునేందుకు.. మరొకటి ఆహారాన్ని గ్రిల్‌ చేసేందుకు ఉపయోగపడతాయి. బొగ్గులు లేదా చెక్క ముక్కలతో నిప్పు రాజేసి.. పైన చికెన్, మటన్, చేపలు, రొయ్యలు, కూరగాయల ముక్కలు ఇలా వేటినైనా సరే రుచికరంగా గ్రిల్‌ చేసుకోవచ్చు. ౖహె క్వాలిటీ స్టెయిన్‌లెస్‌ స్టీల్‌తో రూపొందిన ఈ మేకర్‌ని సులభంగా వెంట తీసుకుని వెళ్లొచ్చు. అవసరం లేనప్పుడు ఫోల్డ్‌ చేసి లాక్‌ చేసుకునే వీలుంటుంది. డివైజ్‌తో పాటు రోస్టింగ్‌ స్టిక్‌ కూడా లభిస్తుంది.


లంచ్‌ అండ్‌ డిన్నర్‌ బాక్స్‌
ప్రయాణాల్లో ఎంతో కొంత సర్దుబాటు ఉంటుంది. ఇవే తినాలి.. ఇలానే తినాలి అని కాకుండా, దొరికినది ఏదో ఒకటి తిని కడుపు నింపుకోవాలనే ప్రయత్నిస్తారు. అలాంటి వారికి ఈ బాక్స్‌ భలే చక్కగా ఉపయోగపడుతుంది. ఉదయాన్నే బ్రేక్‌ ఫాస్ట్‌ నుంచి డిన్నర్‌ దాకా మొత్తం ఈ బాక్స్‌లోనే కానిచ్చేయొచ్చు. అడుగున నీళ్లు పోసుకుని.. పై రెండు బాక్సుల్లో గుడ్లు, చిలగడ దుంపలు, జొన్న కండెలు, కూరగాయ ముక్కలు, చికెన్‌ లేదా మటన్‌ ముక్కలు.. ఇలా అన్నింటినీ ఆవిరిపై ఉడికించుకోవచ్చు. రకరకాల రైస్‌ ఐటమ్స్‌ని ఇందులో సిద్ధం చేసుకోవచ్చు. కావాల్సిన రెసిపీని ముందే బాల్స్‌లో వేసుకుని తినడానికి ఓ అరగంట ముందు పవర్‌ కనెక్ట్‌ చేసుకుంటే సరిపోతుంది. డార్మెటరీల్లో, హోటల్‌ రూమ్స్‌లో ఉండాల్సి వచ్చినప్పుడు ఇలాంటి బాక్స్‌ బాగా ఉపయోగపడుతుంది.


కాఫీ మేకర్‌
కాఫీ లేకుంటే పూట గడవని వారు.. ప్రయాణాల్లో ఉన్నప్పుడు కాఫీని మిస్‌ అవ్వాల్సిన పనిలేదు. చిత్రంలోని ఈ బాటిల్‌ 80–120 సెకన్లలో టేస్టీ కాఫీని అందిస్తుంది. ఈ డివైజ్‌ కింద వైపున్న మినీ వాటర్‌ ట్యాంక్‌లో నీళ్లు లేదా పాలు నింపుకుని, డివైజ్‌లోపల కాఫీ పౌడర్‌ వేసుకుంటే.. వేడివేడి కాఫీ రెడీ అయిపోతుంది. ఇది చాలా నిశ్శబ్దంగా పనిచేస్తుంది. హాట్‌ కాఫీ కావాలా లేక కోల్డ్‌ కాఫీ కావాలా అనేది మన అభిరుచిని బట్టి ఉంటుంది.

ఫోల్డబుల్‌ వాషింగ్‌ మెషిన్‌
సాధారణంగా టూర్స్‌కి వెళ్లినప్పుడు ఆహారంతో పాటు దుస్తులు సమస్యగా మారతాయి. ఒక్క రోజు గడిస్తే చాలు.. మంచి బట్టలు, విడిచిన బట్టలు అంటూ వేరువేరుగా పెట్టడం, మోసుకొచ్చి తిరిగి ఇంట్లో ఉతుక్కోవడం అంతా పెద్ద పని. అయితే ఈ హై–ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్‌ ఆటోమేటిక్‌ అల్ట్రాసోనిక్‌ ఎలక్ట్రిక్‌ వాషింగ్‌ మెషిన్‌.. ఎక్కువ రోజులు క్యాంపింగ్‌కి వెళ్లినప్పుడు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇది తువ్వాళ్లు, లోదుస్తులు, సాక్స్, టీ–షర్టులు, ప్యాంట్స్‌ ఇలా అన్నింటినీ శుభ్రంగా ఉతికి పెడుతుంది.

అంతే కాదు బొమ్మలు లేదా ఇతర చిన్నచిన్న వస్తువులు, నగలు, పండ్లు, కూరగాయలు.. ఇలా అన్నింటినీ క్లీన్‌ చేస్తుంది. ఈ డివైజ్‌ని వినియోగించడం చాలా సులభం. దీన్ని పూర్తిగా ఓపెన్‌ చేస్తే.. బకెట్‌ మాదిరి పెద్దగా మారి, మాసిన దుస్తుల్ని నింపుకుంటుంది. వాషింగ్‌ పూర్తి అయిన తర్వాత మళ్లీ ఫోల్డ్‌ చేసుకుని, కవర్‌లో పెట్టుకుని సూట్‌ కేస్‌లో పెట్టేసుకోవచ్చు. కేవలం 13 నిమిషాల సమయంలో ఈ మెషిన్‌ దుస్తుల్ని శుభ్రంగా, సువాసనభరితంగా ఉతికేస్తుంది. దీనికి ప్రత్యేకమైన హ్యాండిల్‌ ఉంటుంది. ఇది వెంట ఉంటే.. ఎక్కువ దుస్తులతో పనిలేదు. అవసరానికి ఉతికి ఆరేసుకునే కంఫ్టబుల్‌ దుస్తులు రెండు మూడు జతలు పెట్టుకుంటే సరిపోతుంది.


ట్రావెల్‌ ఫ్రిజ్‌
వండిపెట్టే గాడ్జెట్స్‌ అన్నీ చక్కగానే ఉన్నాయి కానీ.. కూరగాయలు, పండ్లు, పాలు ఇవన్నీ నిలువ ఉండాలి కదా? అందుకే ఈ ట్రావెల్‌ ఫ్రిజ్‌. 22 లీటర్ల కెపాసిటీతో రూపొందిన ఈ డివైజ్‌లో కావాల్సిన ఆహారం, కూల్‌ డ్రింక్స్‌ వంటివన్నీ నిలువ చేస్తుంది. వాతావరణాన్ని బట్టి కూలర్‌గా, వార్మర్‌గా పని చేస్తుంది. ఇందులో పండ్లు, కూరగాయలు వంటివి నిలువ ఉంచుకోవడంతో పాటు.. కాఫీ, టీలను వేడిగా కూడా పెట్టుకోవచ్చు. ఇది పవర్‌ సేవింగ్‌ మోడ్‌ను కలిగి ఉంటుంది. ఇక ఇంట్లో పవర్‌ సాకెట్‌కి ఒక అడాప్టర్, కారులో ఒక అడాప్టర్‌ ఉండటంతో ట్రావెలింగ్‌కి ఇది కంఫర్టబుల్‌ డివైజ్‌గా నిలుస్తోంది.


లాండ్రీ ఫోల్డింగ్‌ బోర్డ్‌
బట్టలు ఉతకడం ఆరవేయడం ఒక పనైతే.. వాటిని మడతపెట్టడం మరోపని. అది కూడా టూర్స్‌లో బట్టలు మడతపెట్టడం మహా కష్టం. నిజానికి సరైన పద్ధతితో మడతపెడితే.. ఇస్త్రీ కూడా అవసరం ఉండవు కొన్ని దుస్తులకు. ఈ చిత్రంలోని బోర్డ్‌.. బట్టల్ని చకచకా మడతపెట్టడానికి సహకరిస్తుంది. పైగా పని కాగానే ఫోల్డ్‌ చేస్తే.. అల్మరా సొరుగులో లేదా బ్యాగ్‌లో పెట్టుకునేంత చిన్నదిగా మారిపోతుంది. ఇలాంటి బోర్డ్‌ని కూడా క్యాంపింగ్‌లో వెంట పెట్టుకుంటే.. ప్రయాణానికి బయలుదేరినప్పుడు ఎంత చక్కగా బ్యాగ్‌ సర్దుకున్నామో.. వచ్చేప్పుడు కూడా అంతే నీట్‌ ప్యాక్‌తో రావచ్చు.

బట్టలు ఉతకడం, ఆరబెట్టడమే కాదు.. ఉతికిన దుస్తుల్ని ఇస్త్రీ చేయడానికి మినీ ఐరన్‌ బాక్స్‌ ఉంటేబాగుండు అనిపిస్తుంది కదూ? ఉంది. కానీ ఇది ఐరన్‌ బాక్స్‌ కాదు, హ్యాండ్‌హెల్డ్‌ గార్మెంట్‌ స్టీమర్‌. చిత్రంలోని ఈ డివైజ్‌ సులభంగా, శ్రమ లేకుండా నిమిషాల్లో దుస్తుల్ని ప్రెస్‌ చేస్తుంది. ఇందులోని 70ఎమ్‌ఎల్‌ డిటాచబుల్‌ వాటర్‌ ట్యాంక్‌లో నీళ్లు నింపుకుంటే.. నిమిషానికి 22 గ్రామ్స్‌ ఆవిరితో 99.99% బ్యాక్టీరియాను చంపుతుంది. నలిగిన దుస్తుల్ని నిటారుగా తగిలించి, లేదా అడ్డంగా వాల్చి.. స్టీమ్‌ చేసుకోవచ్చు. 2.5 మీటర్స్‌ పవర్‌ కనెక్టర్‌తో రూపొందిన ఈ స్టీమర్‌ని వినియోగించడం చాలా సులభం.

ఫోల్డింగ్‌ బేబీ బెడ్‌
ప్రయాణాల్లో పిల్లల నిద్రే పిల్ల తల్లులకు పెద్ద సమస్య. తిని, ఆడుకుంటున్నంత సేపు ఎలా అయినా మేనేజ్‌ చేయొచ్చు కానీ.. నిద్రపోతే మాత్రం వాళ్లకి కంఫర్టబుల్‌గా ఉండాల్సిందే. లేదంటే ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. అందుకోసమే రూపొందింది ఈ బేబీ బ్యాగ్‌. హై క్వాలిటీ–లార్జ్‌ కెపాసిటీ కలిగిన ఈ బ్యాగ్‌ని.. కేవలం పిల్లల వస్తువుల్ని స్టోర్‌ చేయడానికి ఉపయోగించుకోవడంతో పాటు.. వాళ్లకి నిద్ర వస్తే బెడ్‌లా మార్చుకోవచ్చు. తల భాగంలో ఎత్తు ఉండేలా పిల్లలకు అనుకూలంగా ఈ బ్యాగ్‌ రూపొందింది. పిల్లలకు కావాల్సిన టవల్స్, దుప్పట్లు, దుస్తులు, పాల డబ్బాలు, వాటర్‌ బాటిల్స్‌ అన్నీ ఈ బ్యాగ్‌లోనే పెట్టుకోవచ్చు.


స్టాప్‌ స్లీప్‌ రింగ్‌
వాహనం నడుపుతున్నప్పుడు డ్రైవర్‌ అర సెకన్‌ రెప్ప వాలిస్తే ఎంత ప్రమాదమో చెప్పనవసరం లేదు. అలా నిద్రపోనివ్వదు ఈ పరికరం. రెండు వేళ్లకు కలిపి దీన్ని పెట్టుకుని, బటన్‌ ఆన్‌ చేసుకుంటే చాలు. డ్రైవర్‌ నిద్రపోయే అవకాశమే లేదు. ఒకవేళ అప్రయత్నంగా నిద్రలోకి జారుకున్నా తట్టి తట్టి లేపుతుంది. ప్రమాదం నుంచి కాపాడుతుంది. ‘ది నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సైంటిఫిక్‌ రీసెర్చ్‌’ ఈ పరికరాన్ని పరీక్షించి, డ్రైవ్‌ చేసేవాళ్లు దీన్ని వాడటం సురక్షితమని నిర్ధారించింది. నిద్ర ఆవహించే ఐదు నిమిషాల ముందే ఈ పరికరం కనిపెట్టి.. చేతిని వైబ్రేట్‌ చేస్తుంది. అందుకు సహకరించే అత్యాధునిక టెక్నాలజీ (స్లీపింగ్‌ మూడ్‌ని గుర్తించే సెన్సర్‌) ఇందులో ఉంది. ప్రమాదాన్ని సూచిస్తుంది. ఈ పరికరానికి వేగంగా చార్జింగ్‌ ఎక్కుతుంది. పైగా అధిక సమయం నిలబడుతుంది. దాంతో దీన్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు.


నెక్‌ ఫ్యాన్‌
వర్షం పడితే తప్ప ఉక్కపోతలకు ఏ కాలమైనా ఒకేలా ఉంటుంది. ఉంటే ఏసీలో ఉండాలి లేదంటే ఫ్యాన్‌ కింద కూర్చోవాల్సిన పరిస్థితి. ప్రయాణమంతా ఏసీ కారులోనే అయితే బాగానే ఉంటుంది. కానీ లాంగ్‌ డ్రైవ్‌లో ఎన్నో చోట్ల దిగాల్సి ఉంటుంది. ఎన్నో ప్రదేశాలు చూడాల్సి ఉంటుంది. దిగిన ప్రతిసారి వేడికి అల్లాడిపోవడం తప్పదు. ముఖం జిడ్డు పట్టకుండా ఫ్రెష్‌గా ఉండాలన్నా.. అలసట అనేది తెలియకుండా ఉండాలన్నా ఈ నెక్‌ ఫ్యాన్‌ ఒకటి మెడలో వేసుకుంటే సరిపోతుంది. దీనికి రెండు ఫ్యాన్స్‌ ఉంటాయి.

మెడలో వేసుకోగానే రెండు వైపుల నుంచి ముఖానికి చల్లటి గాలి తగులుతుంది. ఆ రెండు ఫ్యాన్స్‌ను.. 360 డిగ్రీల యాంగిల్‌లో ఫోల్డ్‌ చేసుకోవచ్చు. దాంతో దీన్ని ఈజీగా హ్యాండ్‌ బ్యాగ్‌లో పెట్టుకోవచ్చు. దీని చార్జర్‌ మొబైల్‌ కనెక్టర్‌లా ఉండటం వల్ల.. పవర్‌ సాకెట్, ల్యాప్‌టాప్, పవర్‌ బ్యాంక్, కార్‌ చార్జర్‌ ఇలా దేనికైనా దీన్ని కనెక్ట్‌ చేసుకోవచ్చు. ఫ్యాన్‌కి మధ్యలో ఉన్న చిన్న క్యాప్‌ ఓపెన్‌ చేసుకుని పెర్ఫ్యూమ్‌ వేసుకుంటే ఆ సుగంధాన్ని ఆస్వాదించవచ్చు. చార్జి్జంగ్‌ ఎక్కుతున్న సమయంలో రెడ్‌ లైట్, చార్జింగ్‌ ఫుల్‌ అయిన తర్వాత బ్లూ లైట్‌ వెలుగుతుంటాయి.


డ్రైయర్‌ బ్యాగ్‌

తడిగా ఉన్న వస్తువుల్ని, దుస్తుల్ని పొడిగా మార్చడం సమయంతో కూడిన పని. క్యాంపింగ్‌ సమయంలో అంత సమయం ఉండదు. పైగా బయట ప్రయాణాల్లో వైరస్, బ్యాక్టీరియా భయాలూ ఎక్కువే. అందుకు సహకరిస్తుంది ఈ డ్రైయర్‌ బ్యాగ్‌. సన్నగా లంచ్‌ బాక్స్‌లా కనిపిస్తున్న ఈ డివైజ్‌ని ఓపెన్‌ చేస్తే చాలా పెద్ద బ్యాగ్‌లా మారిపోతుంది. ఇది వాటర్‌ ప్రూఫ్‌ గాడ్జెట్‌. ఇందులో మొబైల్స్, వాచెస్, కళ్లజోడు, తాళం చెవి, మాస్క్, బేబీ బాటిల్‌ లేదా బొమ్మలు, బ్రష్‌లను కేవలం 10 నిమిషాల్లో తడి లేకుండా పొడిబారేలా చేయడంతో పాటు.. వాసననూ తొలగిస్తుంది.

99 శాతం బ్యాక్టీరియా, వైరస్‌లను నాశనం చేస్తుంది. బేబీ క్లాత్స్, అండర్‌వేర్స్, ఇన్నర్‌ వేర్స్, సాక్స్‌లు, టవల్స్, ఇతర దుస్తులను వేడి గాలిలో ఆర బెడుతుంది. బీచ్‌లో ఆడిన లేదా సిమ్మింగ్‌ పూల్లో తడిచిన బట్టలన్నీ ఈ బ్యాగ్‌లో వేస్తే చాలు. పది నిమిషాల్లో పనైపోతుంది. దీనిలోని హీటింగ్‌ మోటర్‌ని బయటికి తీసి కూడా ఉపయోగించొచ్చు. సోఫాలు, పిల్లోస్, బెడ్స్, సింక్స్‌ వంటివెన్నో తడి లేకుండా పొడిబారేలా చేయొచ్చు.
ఇవే కాక.. సుదూర ప్రయాణాలకు ఇంకా ఫోల్డబుల్‌ వాటర్‌ బాటిల్స్, నాయిస్‌ బ్లాకర్‌ హెడ్‌ ఫోన్స్‌ (నిద్రపోయేవారికి), పోర్టబుల్‌ మినీ మ్యూజిక్‌ బాక్స్, ఎలక్ట్రిక్‌ టీ కెటిల్, గ్యాస్‌ అండ్‌ చార్‌కోల్‌ గ్రిల్‌.. ఇలా చాలానే లగేజ్‌లో భాగం చేసుకోవచ్చు. ప్రయాణాన్ని సుఖవంతంగా మార్చుకోవచ్చు.
సంహిత నిమ్మన 


ఛదవండి:మైండ్‌ హెల్త్‌: పల్లె మహిళే మెరుగు..

మరిన్ని వార్తలు