Parenting Tips: ప్రేమతోనే పెంచుతున్నారా? చీటికిమాటికీ చిర్రుబుర్రులాడకండి! ఇలా చేస్తే..

5 Sep, 2022 13:28 IST|Sakshi
ప్రతీకాత్మ చిత్రం

కేరెంటింగ్‌

సాధారణంగా ప్రతి తల్లీ తండ్రీ తమ పిల్లలను ప్రేమగా... అపురూపంగా పెంచాలనుకుంటారు. అదే సమయంలో వారు జీవితం లో ఉన్నత స్థితికి వెళ్లాలని కోరుకుంటారు. వారికి కావలసిన వాటిని సమకూర్చడం కోసం శక్తికి మించి కష్టపడతారు. ఈ క్రమంలో తల్లిదండ్రులు వాళ్లకి కొన్ని విషయాలలో మితిమీరిన స్వేచ్ఛను ఇస్తుంటారు.

మరికొంతమంది అందుకు పూర్తి విరుద్ధం. పిల్లలకు ఏ ఒక్క విషయంలోనూ స్వేచ్ఛ ఇవ్వకుండా ప్రతి విషయంలో తాము చెప్పినట్లే నడుచుకోవాలంటారు. తీవ్రమైన క్రమశిక్షణలో పెడుతుంటారు. అతి స్వేచ్ఛ వల్ల పిల్లలు పెద్దల మాటను వినకపోవడం లేదా అతి క్రమశిక్షణ వలన పంజరంలో బంధించిన పక్షుల్లా స్వేచ్ఛను కోల్పోయి ఏ పనీ చేతకాని వాళ్లలా తయారవడం వంటి దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉంది. అందుకే పిల్లలను ఎలా పెంచాలో తెలుసుకుందాం.

సానుకూల భావాలకు పాదు 
తల్లిదండ్రులు చేయవలసిన మొట్టమొదటి పని పిల్లలలో పాజిటివిటీని పెంపొందించడం. ఏదీ తమకు లేదు, రాదు, తెలియదు, చేతకాదు, చెయ్యలేము అనుకోకుండా అన్నింటినీ పాజిటివ్‌ గా చూడగలగడాన్ని నేర్పించాలి.

చదువులో గాని, ఆటల్లో గాని వారికి కావాల్సిన ప్రోత్సాహాన్ని, ప్రేరణను తల్లిదండ్రులే పిల్లలకు అందించాలి. తద్వారా వారిలో ఏదైనా సాధించగలం అనే సానుకూల దృక్పథం పెరుగుతుంది. ఇది వారు జీవితం లో ఉన్నత శిఖరాలకు చేరేందుకు చాలా ముఖ్యం. 

పరోపకార గుణం..
కొందరు తల్లిదండ్రులు పిల్లలకు చిన్నప్పటి నుంచే స్వార్థాన్ని నూరిపోస్తుంటారు. స్వార్థం ఉండటం తప్పు కాదు కానీ, పరోపకార గుణం లేకపోతే మాత్రం వారు నిస్సారంగా తయారవుతారు. అందువల్ల బాల్యం నుంచి వారిలో ఇతరులకు సహాయపడే గుణాన్ని అలవాటు చేయాలి.

తోటివాళ్లకు, చుట్టుపక్కల వారికి, పెద్దవాళ్లకు ఏదైనా అవసరంలో ఉన్నప్పుడు అడగనక్కరలేకుండానే స్పందించి సాయపడేలా వారిని ప్రోత్సహించాలి. అందువలన వారు అందరితో కలివిడిగా ఉంటూ స్నేహపూరిత వాతావరణాన్ని అలవాటు చేసుకుంటారు. తద్వారా వారిలో ఏదో సాధించాలనే ఆశయం, నాయకత్వ లక్షణాలు కూడా అలవడతాయి. 

చీటికిమాటికీ చిర్రుబుర్రులాడవద్దు
మనం కొన్ని సందర్భాల్లో పిల్లలపై తెలియకుండానే కోపానికి లోనవుతాం. ఉదాహరణకు వారు మన కళ్ల ముందే ఏదైనా గోడ ఎక్కడం లేదా ప్రమాదకర వస్తువులతో ఆడుకోవడం వంటివి చేసినప్పుడు పట్టరాని కోపం వస్తుంది. అయితే ఇలాంటి సందర్భాలలో కోపం కన్నా సంయమనం చాలా అవసరం. వారిని దగ్గరకు తీసుకొని అలా చేయకూడదని నెమ్మదిగా చెప్పాలి.

వారు చేసిన పని వలన జరిగే అనర్థాలను వివరించాలి. మనం ఎంత ఎక్కువ వారి మీద చికాకు పడితే వారు అంత మొండిగా తయారయ్యే ప్రమాదం ఉంది. వారి అలవాటును మనం వ్యతిరేకించడాన్ని వారు సహించలేరు. అందుకే ముందుగా వారితో మంచిగా మాట్లాడి వారిని మచ్చిక చేసుకోవాలి. అలాగే పిల్లలను బెదిరించడం, బ్లాక్‌మెయిల్‌ చేయడం మంచిది కాదు.

తల్లి/ తండ్రి మీద ప్రేమను పెంపొందించాలి
భార్యాభర్తల మధ్య సఖ్యతలేని పిల్లలు చిన్నప్పటినుంచి అభద్రతాభావానికి లోనవుతారు. తల్లిదండ్రులు అన్యోన్యంగా ఉంటే పిల్లలు జీవితంలో విజయం సాధిస్తారని అనేక అధ్యయనాలు తెలుపుతున్నాయి. భార్యాభర్తల సఖ్యత పిల్లల ఎదుగుదలకు దోహదపడుతుంది.

చాలామంది పిల్లలు అయితే అమ్మతో లేదా నాన్నతో మాత్రమే చనువు గా ఉంటారు. ఇంకొకరితో పెద్దగా మాట్లాడరు. తమకు సంబంధించిన ఏ విషయం కూడా వారితో షేర్‌ చేసుకోరు. ఇలా కాకుండా ఇద్దరితో సమానంగా వారి అభిప్రాయాలను పంచుకునేలా అలవాటు చేయాలి. తమకు ఎటువంటి ఇబ్బంది కానీ, అవసరం కానీ వచ్చినా, కష్టం కలిగినా ధైర్యంగా  చెప్పుకునేలా వారిని ప్రోత్సహించాలి

సాధించే గుణాన్ని నేర్పాలి
పిల్లలు ఏదైనా సాధించాలనే గుణాన్ని వారికి చిన్నప్పటి నుండి నేర్పించాలి. వారు ఎప్పుడు ఏదైనా ఒక గోల్‌ పెట్టకొని దాని మీద ఫోకస్‌ చేసేలా వారికి తర్ఫీదు ఇవ్వాలి. ఎటువంటి సావాళ్లనైనా వారు భయపడకుండా ధైర్యంగా స్వీకరించేలా వారికి ప్రోత్సహించాలి.

వారి ఏ పనినైనా కష్టంతోకాకుండా ఇష్టంగా చేయడం నేర్పాలి. ఇది వారిలో పోరాట పటిమను పెంపొందించి జీవితంలో ఏదైనా సాధించాలనే తపనను వారిలో చిన్నపటి నుండి బలంగా నాటుతుంది.

మీ ఒత్తిడిని పిల్లల మీద వెయ్యవద్దు
మనలో చాలామంది మన దైనందిక జీవితంలో ఉండే ఒత్తిడి తాలూకు ఫ్రభావాన్ని తమ కుటుంబసభ్యులపై ముఖ్యంగా పిల్లలపై చూపిస్టుంటారు. మనకు తెలియకుండా ఇది మన పిల్లలలో ఒకవిధమైన నెగిటివిటీని పెంచుతుంది. వారు క్రమక్రమంగా మనల్ని శత్రవుల్లా చూడటం ప్రారంభిస్తారు కాబటిట ఒత్తిడిని, కోపాన్ని వారి మీద చూపించకూడదు.

మనం మన పనిలో ఎంత ఒత్తిడిలో ఉన్నా వారి దగ్గరకు వచ్చేటప్పటికి అవేమీ వారి మీద చూపించకూడదు. ప్రేమగా దగ్గరకు తీసుకొని మాట్లాడటం అలవరచుకోవాలి. ఇలా చేయడం వలన వారు మనపై ఉండే భయాన్ని కోల్పోయి ప్రతి విషయాన్ని మనతో షేర్‌ చేసుకోవడం అలవాటు చేసుకుంటారు. దానితోపాటు మనకు తెలియకుండానే మన ఒత్తిడి కూడా ఎగిరిపోతుంది. 

తప్పును అంగీకరించడం నేర్పాలి
చాలా సార్లు పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులను తిడతారనే భయంతో మరొకరిని నిందిస్తారు. అటువంటి పరిస్థితిలో పిల్లలకు అబద్ధం చెప్పకుండా ప్రతి చిన్న, పెద్ద తప్పును అంగీకరించడం నేర్పాలి. 

బుజ్జగించి చూడండి
కొందరు పిల్లలు చిన్న విషయాలకే కోపం తెచ్చుకుంటారు. ప్రతిదానికీ మారాం చేయడం, అలగడం వంటి వాటితో పెద్దలను విసిగిస్తుంటారు. అటువంటి పరిస్థితిలో పిల్లలను తిట్టడం లేదా చేయి చేసుకోవడం వల్ల వారు మరింత మొండిగా తయారయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల సాధ్యమైనంత వరకు వారిని బుజ్జగించి చూడాలి.

దారిలోకి రాకపోతే చిన్నగా బెదిరించాలి కానీ చేయి చేసుకోవడం లేదా తిట్టడం మంచిది కాదు. అలాగే పిల్లల మంచి అలవాట్లను అభినందించడం అవసరం. వారిని ప్రేమతో పెంచాలి. వారిలో ప్రేమను పెంపాలి.            

చిన్న చిన్న బాధ్యతలు అప్పగించాలి
పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులు వారికి ఏ పనీ చెప్పరు. ఒకవేళ వాళ్లే ఏదైనా చేయాలని ఉత్సాహం చూపించినా, నీకెందుకు ఈ పనులు, చక్కగా చదువుకో పో.. అంటూ ఉంటారు. వారు ఎప్పుడూ చదువుకోవాలని, ఎంత చదివితే అంత ప్రయోజనం అని భావిస్తారు.

అయితే పిల్లలకు చదువుతోపాటు ఇంట్లో చిన్న చిన్న బాధ్యతలను కూడా అప్పజెప్పాలి. దీనివలన వారిలో కార్యదక్షత పెరిగి సంఘంలో ఎలా నడుచుకోవాలో తెలుస్తుంది. అందువల్ల రోజూ మన ఇంటిలో ఉండే కొన్ని బాధ్యతలను వారు క్రమం తప్పకుండా నిర్వర్తించేలా వారిని ప్రేరేపించాలి. 

చదవండి: స్త్రీ శక్తి: బ్యాక్‌ ఆన్‌ ది బైక్‌ పడి లేచిన కెరటం
Dengue Fever- Prevention Tips: డెంగీ జ్వరాన్ని ఎలా గుర్తించాలి? నివారణకు చర్యలేంటి? పిల్లలకు జ్వరం వస్తే!

మరిన్ని వార్తలు