రూ. 3000 ఖరీదైన చీర రూ.300 కే!!

14 Oct, 2021 01:03 IST|Sakshi

ఆన్‌లైన్‌లో ఆఫర్ల ఎర

సుమతి (పేరు మార్చడమైనది) ఆన్‌లైన్‌లో పండగ ఆఫర్ల కింద వచ్చిన అప్లికేషన్స్‌ చూస్తూ ఉంటే మంచి కలర్‌ కాంబినేషన్‌ ఉన్న పట్టు చీర కనపడింది. ‘మూడు వేల రూపాయల చీర, మూడు వందలకే’ అని ఉండటంతో క్లిక్‌ చేసింది. ఆ చీర బుక్‌ అవ్వాలంటే అందులో ఇచ్చిన అకౌంట్‌లో డబ్బులు జమ చేయడంతోపాటు వివరాలన్నీ పొందుపరిచిన ఒక ఫారాన్ని నింపాలి. డబ్బు కట్టడంతోపాటు వివరాలన్నీ ఇచ్చింది. కానీ, ఎన్ని రోజులైనా ఆ చీర మాత్రం రాలేదు.

‘మా లక్కీ స్కీమ్‌లో పాల్గొనండి, ఐ ఫోన్‌ గెల్చుకోండి’ అని ఉన్న అప్లికేషన్‌ను శేఖర్‌ (పేరు మార్చడమైనది) క్లిక్‌ చేశాడు. ఆ లక్కీ డిప్‌లో పాల్గొనాలంటే రెండు వేల రూపాయలు చెల్లించి, స్కీమ్‌లో చేరాలని ఉంది. తన వివరాలతో పాటు, రెండు వేల రూపాయలు ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించి, ఆ స్కీమ్‌లో చేరాడు. కానీ, శేఖర్‌కి ఫోన్‌ రాలేదు. ఆ డబ్బులూ తిరిగి రాలేదు.

సబ్‌స్క్రైబర్స్‌ని పెంచుకోవడానికి ఆఫర్లు
లైక్స్, కామెంట్స్, సబ్‌స్క్రిప్షన్స్‌ పెంచుకోవడానికి కొందరు ‘ఉచితం లేదా డిస్కౌంట్‌’ అనే పదాలను ఎరగా వేస్తుంటారు. ‘50,000 రూపాయల ధర పలికే గడియారాన్ని 5,000కే అమ్ముతున్నాను’ అనే ఆఫర్లు వస్తుంటాయి.

మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ మోసం..
‘ఆఫర్‌’ని ఎరగా వేసి వివరాలన్నీ సేకరించి, ఆ తర్వాత మోసానికి పాల్పడే వారుంటారు. వివరాలన్ని ‘డార్క్‌’వెబ్‌సైట్లలో పెడుతూ, మరో ఆన్‌లైన్‌ మోసాలకు ఉపయోగించడానికి ఆ డేటాను వాడుతుంటారు.

ఒరిజినల్‌ అని చెప్పి, అమ్మడం
ఇది మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ మోసం. బ్రాండెడ్‌ వస్తువులా అనిపించే రెప్లికా ఐటమ్‌ చూపించి అసలైనదే అని చూపుతారు. మీతో పాటు మరికొంతమందిని తమ స్కీమ్‌లో చేర్చితే ‘50,000 రూపాయల వస్తువు 5000 కు సొంతం చేసుకోవచ్చు అనే ఆశను చూపెడతారు.

నాణ్యతలేని వస్తువులతో ఎర
రెప్లికా వస్తువుల్లోనూ గ్రేడ్స్‌ ఉంటాయి. అవి చూడటానికే బాగుంటాయి కానీ, ఏ మాత్రం పనిచేయవు. అలాంటి వస్తువులను చూపి, డబ్బులు రాబట్టి మోసం చేస్తారు.

ఆఫర్ల వర్షం
దసరా, దీపావళి, సంక్రాంతి వంటి ముఖ్యమైన పండగల సమయంలో జనాల బలహీనతను దృష్టిలో పెట్టుకొని, బంపర్‌ ఆఫర్, వీల్‌ తిప్పడం, స్క్రాచ్‌ కార్డ్‌లు.. వంటి వాటితో ఆన్‌లైన్‌ మోసానికి దిగుతుంటారు.
 ఈ షాపింగ్‌ మోసాలు ఢిల్లీ చుట్టుపక్కల నుంచి అధికంగా జరుగుతున్నట్టు తెలుస్తుంది. వీటిల్లో ఎక్కువగా ఫోన్లు, వాచీలు, చీరలు, డ్రెస్సుల విషయాల్లో జరుగుతుంటాయి.
 
ఆన్‌లైన్‌ షాపింగ్‌ మోసానికి ముందే హెచ్చరికలు
► ఒక వస్తువులు లేదా సేవ నమ్మశక్యం కాని తక్కువ ధరతో ప్రచారం చేయబడుతుంది అంటే ఆలోచించాలి. మోసానికి ముందు ఇదొక హెచ్చరిక అనుకోవాలి.
► ఆన్‌లైన్‌ చెల్లింపులు కాకుండా వస్తువు ఇంటికి వద్దకు వచ్చాకే చెల్లింపు అనే ఎంపిక మంచిది.
► డిస్కౌంట్‌ ఆఫర్‌ని పొందడానికి తమ వోచర్‌ కోసం ముందే చెల్లించాలనే ఎంపికలు ఉంటాయి. అలాంటి వాటికి దూరంగా ఉండటం మంచిది.
► నకిలీ సోషల్‌ మీడియా ఆధారిత కథనాలు కొత్తగా అభివృద్ధి చెందుతున్నాయి. ఆన్‌ లైన్‌ లో చాలా తక్కువ ధరలకు ఉత్పత్తులను విక్రయిస్తున్నాయి, అనేది నిజం కాదు.
► విక్రేత విదేశాల్లో ఉన్నప్పుడు పే మనీ లేదా క్రెడిట్‌/ డెబిట్‌ కార్డ్‌ లావాదేవీ వంటి సురక్షిత చెల్లింపు సేవ ద్వారా చెల్లింపును అనుమతించరు. వారు మిమ్మల్ని ౖఖ్కీ ని చెప్పమని లేదా క్యూఆర్‌ కోడ్‌ని స్కాన్‌ చేయాలని లేదా చెల్లింపులను స్వీకరించడానికి గూగుల్‌ ఫారమ్స్‌ లేదా చిన్న లింక్‌లను పూరించమని అడుగుతారు.  
► కొత్తగా పుట్టుకు వచ్చిన వెబ్‌సైట్లలో నిర్ధారణకు రాకుండా కొనుగోళ్లు చేయకూడదు. వాటి తాలూకు ఫౌండర్స్‌ ఎవరనేది కూడా చూసుకోవాలి. బ్రాండ్‌ పేరుతో ఉన్న వెబ్‌సైట్స్‌ కూడా నకిలీ పేరుతో వస్తాయి. పండగల సమయాల్లో ఈ– తరహా మోసాలు ఎక్కువ. కాబట్టి, వాటి వాడుక, హెచ్‌టిటిపిఎస్, యుఆర్‌ఎల్‌ చెక్‌ చేసుకొని కొనాలి.  

షాపింగ్‌ మోసాల నుండి రక్షణ
► మీరు తీసుకోవాలనుకున్న వస్తువు ‘సమీక్ష (రివ్యూ)లు చదవండి. వాటి నాణ్యత, రిటర్న్‌ పాలసీల వంటివి ఉన్నాయేమో చూడండి.
► ఎప్పుడైనా (యాప్‌) అప్లికేషన్‌ అంతర్నిర్మిత సాధనాలతోనే కమ్యూనికేట్‌ చేయండి. అప్లికేషన్‌ వెలుపల కమ్యూనికేట్‌ చేయవద్దు.
► సురక్షిత నగదు చెల్లింపు కోసం  
https://URL చూడండి.
► అమ్మకం దారుకి మీ బ్యాంక్‌
OTP / PIN నంబర్లను ఏ రూపంలోనూ షేర్‌ చేయవద్దు.
► మీరు ఫోన్‌ మాట్లాడే సమయంలో చెల్లింపు లావాదేవులను ఎప్పుడూ చేయవద్దు.
► అమ్మకం దారు అందించిన ఏవైనా షార్ట్‌ లింక్‌లను క్లిక్‌ చేసి, వాటిని పూరించవద్దు.
     గూగుల్‌ లింక్‌ ద్వారా వచ్చిన ఫామ్‌లను పూరించవద్దు. క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయవద్దు, మీరు స్కాన్‌ చేస్తుంటే మీ ఖాతా నుండి డబ్బు డెబిట్‌ అవుతుంది.


అనీల్‌ రాచమల్ల, డిజిటల్‌ వెల్‌బీయింగ్‌ ఎక్స్‌పర్ట్, ఎండ్‌ నౌ ఫౌండేషన్‌

మరిన్ని వార్తలు