గుడ్లగూబ టవర్‌ ఎక్కడుందో తెలుసా..

1 May, 2021 19:17 IST|Sakshi

గుబ్బల మంగమ్మ గుహ నాగరక సమాజానికి పెద్దగా పరిచయం లేని ప్రదేశం. దట్టమైన అడవి, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఓ వాగు, ఆ వాగు మధ్యలో ఓ గుహ, ఆ గుహలో ఉన్న దేవత పేరు మంగమ్మ. ఆదివాసీల దేవత. ఈ గుహాలయానికి వెళ్లే దారిలో ప్రయాణించడం సరదాగా మాత్రమే కాదు, విచిత్రంగా కూడా ఉంటుంది. రోడ్డుకు ఒకవైపు తెలంగాణ, మరో వైపు ఏపీ భూభాగం. ఈ ఆలయానికి తెలంగాణ రాష్ట్రం– ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అనే తేడా లేకుండా తెలుగువాళ్లందరూ వస్తారు. ఒకప్పుడు ఆదివాసీలు మాత్రమే కనిపించేవారు. ఇప్పుడు నాగరకులు కూడా వస్తున్నారు. మంగమ్మ దేవతకు ఆదివాసీలు ఆది, గురువారాల్లో మొక్కులు చెల్లించుకుంటారు. ఆ రెండు రోజుల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. మిగిలిన రోజుల్లో ప్రశాంతమైన పర్యాటకానికి వేదిక ఈ ప్రదేశం. 

దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో ఇక్కడ సెల్‌ఫోన్‌ నెట్‌వర్క్‌లు పనిచేయవు. దీంతో పర్యాటకులు ఫోన్‌లను బ్యాగ్‌లో పెట్టేసి కుటుంబ సభ్యులు, స్నేహితులతో సరదాగా గడుపుతారు. పిక్‌నిక్‌కి వచ్చిన వాళ్లు ఇక్కడే వంట చేసుకుని తింటూ ప్రకృతి ఒడిలో రోజంతా హాయిగా గడుపుతారు. ఇది చక్కటి ఎకోటూరిజం పాయింట్‌ కూడా. 

జీవ జలపాతం
ఈ గుహాలయం పైన ఓ జలపాతం ఏడాదంతా జాలువారుతుంటుంది. వాగులో నీరు ఎప్పుడూ మోకాళ్ల లోతు ఉంటాయి. స్వచ్ఛమైన నీటి ధార కింద తడవకుండా వెనక్కి వస్తే పిక్‌నిక్‌ అసంపూర్తిగా ముగించినట్లే. 

గుడ్లగూబ టవర్‌
సెల్‌ఫోన్‌ డిస్టర్బెన్స్‌ ఉండదు కాబట్టి పక్షుల కిలకిలరవాలను ఆస్వాదించడానికి ఏ అడ్డంకీ ఉండదు.ఆలయానికి సమీపంలో తెలంగాణ అటవీశాఖ బేస్‌ క్యాంప్‌ ఉంది. గుహాలయాన్ని దాటి మరింతగా అడవి లోపలికి వెళ్తే ఓ గుట్టపై 33 అడుగుల ఎత్తులో వాచ్‌టవర్‌ ఉంది. పేరు గుడ్లగూబ టవర్‌. ఈ వాచ్‌టవర్‌ పైకి ఎక్కితే కనుచూపు మేరలో పెద్ద పెద్ద గుట్టలు, చిక్కటి అడవి కంటికి ఇంపుగా కనిపిస్తాయి.
– తూమాటి భద్రారెడ్డి, సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం, గిరివనపర్యాటకం

ఆ రాష్టం– ఈ రాష్ట్రం నడిమధ్య నీటి వాగు
మంగమ్మ గుహ ఉన్న వాగు రెండు  తెలుగు రాష్ట్రాలకు సరిహద్దు అన్నమాట. ఒకవైపు తెలంగాణ, భద్రా ద్రి కొత్తగూడెం జిల్లా – మరోవైపు ఆంధ్రప్రదేశ్, పశ్చిమగోదావరి జిల్లా. ఆలయం ఉన్న గుహ తెలంగాణ, ఆలయానికి మెట్ల దారి ఉన్న ఆర్చి ఆంధ్రప్రదేశ్‌.

మరిన్ని వార్తలు