సాయి సత్య బోధ

21 Nov, 2020 09:22 IST|Sakshi

మనిషి జీవితంలో సైన్స్‌కి అందని విషయాలు చాలా ఉన్నాయి... రామాయణ.. మహా భారతాల్ని కల్పితాలు అని వాదించే నాస్తికులు, అబ్దుల్‌ కలాం లాంటి ప్రముఖ శాస్త్రవేత్తలు సైతం సత్యసాయి దర్శనం చేసుకుని ఆయన బోధలను ఆలకించినవారే! సత్యం ధర్మం శాంతి ప్రేమ అహింస అనే వాటిని ఆయుధాలుగా చేసుకుని.. లవ్‌ ఆల్‌ సర్వ్‌ ఆల్‌ అని తన బోధనల ద్వారా ప్రజల్లో ప్రేమ తత్వాన్ని నింపారు సత్య సాయి. నేను మీ నుంచి ఆశించేది ఒక్కటే...అదే ప్రేమ... మీ ప్రేమ నాకు కావాలి.. అంటూ ఉండేవారు సత్యసాయి. భౌతికంగా ఆయన మనకు కనుమరుగై కొన్ని ఏళ్లు గడిచినా ఇప్పటికీ పుట్టపర్తిలోని ప్రశాంతినిలయంలో భగవాన్‌ జయంతి వేడుకలు జరుగుతూనే ఉన్నాయి. 

ఎక్కడెక్కడి నుంచో వచ్చిన అందరూ ఇక్కడ 10 నుంచి 15 రోజులు సేవ చేస్తూ ఒకే కుటుంబంగా ఉంటూ వచ్చిన వాళ్ళకి  సేవ చేస్తూ ఉంటారు. పదాహారేళ్ల పిల్లలు... ఎవరో తిని తాగిన ఎంగిలి విస్తళ్లు, కప్పులు మేము తియ్యడం ఏమిటా అనుకోకుండా ఒకరితో ఒకరు సేవలో పోటీ పడుతూ సంతోషంగా చేస్తున్నారు. కరోన కారణంగా సామాజిక దూరం పాటించడం కోసం మందిరంలో... ఇంకా చాలా చోట్ల వృత్తాలు గీసి ఉంచారు. బాబా తన బోధలలో ఎక్కువగా ఒక విషయం చెప్పేవారు... చావుకు భయపడద్దు... చెప్పుడు మాటలు నమ్మద్దు... భగవంతుడిని విడవద్దు... అని. బహుశ వీటిని దృష్టిలో పెట్టుకునే కాబోలు... ఎంతోమంది ఈ కరోన సమయంలో కూడా సేవకు వచ్చారు.

సత్యసాయి బోధామృతం..
►రోజును ప్రేమతో మొదలు పెట్టు... ఇతరుల కోసం ప్రేమతో సమయం వెచ్చించు. రోజంతా నీలో ప్రేమను నింపుకో. ప్రేమతోనే ఈ రోజు ముగించు. దేవుణ్ణి గుర్తించడానికి అదే సరైన దారి. 
►కోరికలు ప్రయాణాలలో తీసుకు వెళ్లే వస్తువులలాంటివి. ఎక్కువయిన కొద్దీ జీవిత ప్రయాణం కష్టం అవుతుంది.
►దైవమే ప్రేమ. ప్రేమలో జీవించు.
►ప్రతి అనుభవం ఒక పాఠం ప్రతి వైఫల్యం ఒక లాభం
►ఎక్కడ దేవుని మీద విశ్వాసం ఉంటుందో అక్కడ ప్రేమ ఉంటుంది. 
►ఎక్కడ ప్రేమ వుంటుందో అక్కడ శాంతి ఉంటుంది. ఎక్కడ శాంతి ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. 
– ఇన్‌పుట్స్‌: పోరంకి లక్ష్మీప్రసన్న (నవంబర్‌ 23 సత్యసాయి జయంతి) 

మరిన్ని వార్తలు