శభాష్‌ భరత్‌.. 99 రోజుల్లో 11 రాష్ట్రాలు దాటి 

28 Mar, 2021 10:35 IST|Sakshi

ధన్యవాద సమర్పణ.. భరత్‌ అనే అతడు

అసలైతే పాదాభివందనం చేయాలనుకున్నాడు భరత్‌. కానీ ఒకరా ఇద్దరా!  డాక్టర్లు, నర్సులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, సామాజిక కార్యకర్తలు.. వేలు, లక్షలు! 
ఎంతమందికని పాదాభివందనం చేయగలడు? పోనీ.. ‘ఎందరో కరోనా యోధులు.  అందరికీ వందనాలు’ అనుకుని మనసులోనే చేతులు జోడించవచ్చు.  అలాక్కూడా కాదు, అంతకన్నా ఎక్కువగా కృతజ్ఞతలను చెల్లించాలనుకున్నాడు.  కాలి నడకన కన్యాకుమారి నుంచి బయల్దేరి శ్రీనగర్‌లోని దాల్‌ సరస్సుకు చేరుకున్నాడు.  తన ప్రయాణాన్ని ఒక స్తుతిగా, నమస్కృతిగా చెల్లించుకున్నాడు. 

భరత్‌ది మైసూర్‌. కరోనా కాలంలో కష్టాలు పడుతున్నవాళ్లను చూశాడు. ఆ కష్టాలను తమవిగా భావించి చేయి అందించిన వాళ్లూనూ చూశాడు. ఆసుపత్రులలో కరోనా బాధితుల్ని చూశాడు. ప్రాణానికి ప్రాణమిచ్చి వారిని కాపాడిన వైద్యులను, సిస్టర్స్‌ని చూశాడు. ప్రతి చోటా ఏదో ఒక సహాయం చేయడానికి వచ్చినవారే! ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా.. మనిషిలోని మంచితనాన్ని కూడా బయట పెట్టింది. ఏడాదిగా చూస్తున్నాడు భరత్‌. కరోనా యోధులకు అవార్డులు ఇస్తున్నారు. వారిని అభినందిస్తూ పెయింటింగ్‌ లు వేస్తున్నారు. సత్కరిస్తున్నారు. సర్టిఫికెట్‌ లు ఇస్తున్నారు.

మ్యూజియంలు ఏర్పాటు చేస్తున్నారు. తనూ ఏదైనా చేయాలని అనుకున్నాడు. అనుకోవడం కాదు, చేయకుండా ఉండలేకపోయాడు. ఇప్పటికే అతడు పర్యావరణాన్ని పరిరక్షించే పనిలో ఉన్నాడు. మొక్కలు నాటుతున్నాడు. ఫిట్‌నెస్‌పై అవగాహన కల్పిస్తున్నాడు. ఆ పనులను కొనసాగిస్తూనే దేశవ్యాప్తంగా కరోనా యోధులకు అభివాదాలు తెలియజేసేందుకు ‘వాక్‌ ఫర్‌ హ్యుమానిటీ’ (మానవత్వం కోసం పాదయాత్ర) ను తలపెట్టాడు. 4000 వేల కి.మీ. పొడవైన ఆ మహా సంకల్పాన్ని పూర్తి చేశాడు!


∙∙ 
ముప్పై మూడేళ్ల భరత్‌ 2020 డిసెంబర్‌ 11న తన పాద యాత్రను ప్రారంభించాడు. మైసూర్‌ నుంచి కన్యాకుమారి వెళ్లి అక్కడ తొలి అడుగు వేశాడు. చివరి అడుగు జమ్ము కశ్మీర్‌. శ్రీనగర్‌లోని దాల్‌ సరస్సు ఒడ్డుకు చేరీచేరగానే.. పసుపు, ఎరుపు రంగుల్లో తను రూపకల్పన చేసుకున్న యాత్ర పతాకాన్ని రెండు చేతులతో రెపరెపలాడించాడు. మొత్తం 99 రోజుల ప్రయాణం. హైవేల మీదుగా రోజుకు 45 నుంచి 50 కిలో మీటర్ల నడక. మొత్తం 11 రాష్ట్రాలు దాటుకుంటూ వెళ్లాడు భరత్‌. కరోనా రాక ముందు వరకు అతడు రకరకాల వ్యాపారాలు చేసేవాడు. కరోనాతో అవన్నీ దెబ్బతిన్నాయి.

లాక్‌డౌన్‌లో పూర్తిగా ఇంటికే పరిమితం కావడం, ఆ మాత్రం అవకాశం కూడా లేని కరోనా యోధులు నిరంతరం ఇంటికి దూరంగా గడపడం చూశాక భరత్‌కు తను కూడా ఏదైనా చేయాలన్న ఆలోచన కలిగింది. నిస్వార్థంగా సేవలు అందిస్తున్న లక్షల మందికి ధన్యవాద సమర్పణ చేయదలచుకున్నాడు. పాదయాత్ర తో వారి రుణం తీర్చుకోవాలనుకున్నాడు. దారి మధ్యలో కొన్ని చోట్ల చెట్ల కింద సేద తీరాడు. సామాజిక కార్యకర్తలను పరిచయం చేసుకున్నాడు. 150 చోట్ల మొక్కలు నాటాడు. అతడి ఒంటరి ప్రయాణానికి ఏదో ఒక రూపంలో శక్తిని అందించినవారు ఎందరో ఉన్నారు. ‘‘ఈ కృతజ్ఞతా ప్రయాణం నా ఒక్కడిదే కాదు. వాళ్లందరిది కూడా’’ అంటున్నాడు భరత్‌.

మరిన్ని వార్తలు