ఈసారి పరేడ్‌లో ఒక ఫైటర్‌ ఒక టాపర్‌

22 Jan, 2021 00:16 IST|Sakshi
దివ్యాంగీ త్రిపాఠీ సీబీఎస్‌ఇ గోరఖ్‌పూర్‌ టాపర్‌; భావనాకాంత్ ఎయిర్‌ఫోర్స్‌ ఫైటర్‌ జెట్‌ పైలట్‌

పరేడ్‌కు ప్రత్యేక ఆకర్షణ

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌ నుంచి రాజ్‌పథ్‌ మీదుగా ఇండియా గేట్‌ వరకు ఎనిమిది కి.మీ. దూరం సాగవలసిన రిపబ్లిక్‌ డే పరేడ్‌ ఈ ఏడాది మునుపటంత సందడితో ఉండబోవడం లేదు. ఎప్పుడూ లక్షమంది వరకు వీక్షకులను అనుమతించేవారు. ఈ ఏడాది ఆ సంఖ్యను ఇరవై ఐదు వేలకు కుదించారు. ఆ ఇరవై ఐదు వేల మందిలో నాలుగు వేల మంది మాత్రమే సాధారణ ప్రజలు. మిగతావారంతా వి.ఐ.పి.లు, వి.వి.ఐ.పీలు. ఎప్పుడూ చిన్నాపెద్దా అందరూ పరేడ్‌ను చూడ్డానికి వచ్చేవారు. ఈ ఏడాది పదిహేనేళ్ల వయసు లోపువారికి, అరవై ఐదేళ్లు దాటిన వారికి రాజ్‌పథ్‌ ప్రవేశాన్ని నిషేధించారు. బయటి అతిథులు కూడా ఎవరూ రావడం లేదు. కారణం తెలిసిందే. సోషల్‌ డిస్టెన్స్‌.

అయితే.. ఇన్ని నిరుత్సాహాల నడుమ రెండంటే రెండే ఉల్లాసకరమైన విషయాలుగా కనిపిస్తున్నాయి. ఫ్లయింట్‌ లెఫ్ట్‌నెంట్‌ భావనా కాంత్‌ మన వాయుసేనలోని ఫైటర్‌ జెట్‌తో గగనతలంలో విన్యాసాలు చేయబోతున్నారు! రిపబ్లిక్‌ డే పరేడ్‌లో ఒక మహిళా ఫైటర్‌ పైలట్‌.. యుద్ధ విమానాన్ని చక్కర్లు కొట్టించబోవడం ఇదే మొదటిసారి. అలాగే దివ్యాంగి త్రిపాఠీ అనే విద్యార్థినికి పరేడ్‌ గ్రౌండ్స్‌లోని ప్రధాన మంత్రి బాక్స్‌లో కూర్చొని వేడుకలను తిలకించే అవకాశం లభించడం దేశంలోని బాలికలు, మహిళలందరికీ స్ఫూర్తినిచ్చే పరిణామం.

భావనా కాంత్‌ (28) భారతదేశపు తొలి మహిళా ఫైటర్‌ పైలట్‌. జనవరి 26 న ఆమె రిపబ్లిక్‌ డే పరేడ్‌లో పాల్గొన్న తొలి మహిళా ఫైటర్‌ పైలట్‌ అవుతారు. భారత వాయుసేన ఆమెకు ఈ అరుదైన, ఘనమైన, చరిత్రాత్మక అవకాశాన్ని కల్పించింది. 2016 లో తొలి ఫైటర్‌ పైలట్‌గా ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ (ఐ.ఎ.ఎఫ్‌) లోకి వచ్చారు భావన. ఇంచుమించుగా ఆమెతో పాటే అవని చతుర్వేది, మోహనా సింగ్‌ ఫైటర్‌ పైలట్‌ శిక్షణలో  చేరారు. అప్పటి వరకు మన సైన్యంలో మహిళా ఫైటర్‌ పైలట్‌లే లేరు. మూడేళ్ల అంచెలంచెల శిక్షణానంతరం 2019 మే లో యుద్ధ విమానాలు నడిపేందుకు భావన పూర్తి అర్హతలు సంపాదించారు. ప్రస్తుతం ఆమె రాజస్థాన్‌లోని వైమానిక స్థావరంలో విధి నిర్వహణలో ఉన్నారు. మిగ్‌–21 యుద్ధ విమానాన్ని అన్ని కోణాల్లో మలుపులు తిప్పి శత్రువు వెన్ను విరచడంలో నైపుణ్యం ఉన్న యోధురాలు భావనా కామత్‌ ఇప్పుడు.

భావన 1992 డిసెంబర్‌ 1న బిహార్‌లోని దర్భంగా లో జన్మించారు. అయితే ఆమె పెరిగింది అక్కడికి సమీపంలోని బెగుసరాయ్‌లోని రిఫైనరీ టౌన్‌షిప్‌లో. ఆమె తండ్రి తేజ్‌ నారాయణ్‌.. ఇంజనీర్‌. ఆ టౌన్‌షిప్‌లోని ఇండియన్‌ ఆయిల్‌ కార్పోరేషన్‌లో ఆయన ఉద్యోగం. భావన తల్లి రాధాకాంత్‌ గృహిణి. భావన తమ్ముడు నీలాంబర్, భావన చెల్లి తనూజ. వారిద్దరికీ భావనే అన్నిటా స్ఫూర్తి. భావనకు డ్రైవింగ్‌ అంటే ఇష్టం. అందుకే కావచ్చు డ్రైవింగ్‌కి అత్యున్నతస్థాయి అనుకోదగిన ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ జెట్‌ పైలటింగ్‌ను కెరీర్‌గా ఎన్నుకున్నారు. ఇంకా ఆమెకు ఖోఖో, బ్యాడ్మింటన్,  స్విమ్మింగ్, డిబేట్స్, సినిమాలు ఇష్టం. టౌన్‌షిప్‌లోని స్కూల్లో చదువు పూర్తయ్యాక భావన బెంగళూరులోని బి.ఎం.ఎస్‌. కాలేజ్‌లో మెడికల్‌ ఎలక్ట్రానిక్స్‌లో ఇంజనీరింగ్‌ చేశారు. తర్వాత టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో కొన్నాళ్లు పని చేశారు. ఎయిర్‌ ఫోర్స్‌లో జాయిన్‌ అయ్యేందుకు కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ రాసి ఉత్తీర్ణులయ్యారు. హైదరాబాద్‌ హకీంపేట్‌ ఎయిర్‌ ఫోర్స్‌ స్టేషన్‌లో ట్రైనింగ్‌ అయ్యాక మేడ్చెల్‌ జిల్లాలోని దుండిగల్‌ ఎయిర్‌ ఫోర్స్‌అకాడమీ నుంచి ఫ్లయింగ్‌ ఆఫీసర్‌గా బయటికి వచ్చారు. భారత రాష్ట్రపతి గత ఏడాది ఆమెకు నారీ శక్తి పురస్కారం ప్రదానం చేశారు.  
∙ ∙  
ఇక రిపబ్లిక్‌ డే పరేడ్‌ను పీఎం పక్కన కూర్చొని వీక్షించేందుకు ప్రత్యేక ఆహ్వానాన్ని పొందిన దివ్యాంగీ త్రిపాఠీ (18) ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ అమ్మాయి. 2020 సీబీఎస్‌ఇ 12వ తరగతి పరీక్షల్లో 99.6 శాతం మార్కులతో జిల్లాలోనే టాపర్‌గా నిలవడంతో దివ్యాంగికి ఈ అరుదైన అవకాశం లభించింది. ఆమెతో పాటు ఈ అవకాశం దేశంలోని మిగతా రాష్ట్రాల టాపర్స్‌కీ దక్కింది. ఇప్పుడు ఆమెకు స్నేహితుల నుంచి, బంధువుల నుంచి ఎదురౌతున్న ప్రశ్న ఒక్కటే. ‘ప్రధాని నరేంద్ర మోదీ పక్కన కూర్చొని ఉన్నప్పుడు నువ్వు ఆయనతో ఏం మాట్లాడతావు?’ అని! దివ్యాంగి తండ్రి ఉమేశ్‌నాథ్‌ కెమిస్ట్రీ ప్రొఫెసర్‌. తల్లి ఉష గృహిణి. ఈ నెల 13న కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు ‘పరేడ్‌’ను చూసేందుకు ఆహ్వానం వచ్చిందని ఆమె ఎంతో సంతోషంతో తెలిపారు.

గత ఏడాది ఢిల్లీలో జరిగిన  రిపబ్లిక్‌ డే పరేడ్‌

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు