అంపశయ్యపై ఉన్న భీష్ముడు ఉత్తరాయణంలో

20 Feb, 2021 07:29 IST|Sakshi

మాఘశుద్ధ అష్టమి

శనివారం భీష్మాష్టమి

46 రోజులపాటు అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలంలో ఈ రోజునే స్వచ్ఛంద మరణమనే వరం ద్వారా ప్రాణ త్యాగం చేసినందువల్ల మాఘశుద్ధ అష్టమికి భీష్మాష్టమి అని పేరు. తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం జీవితాంతం బ్రహ్మచారిగా ఉన్న భీష్ముడికి ఈ పర్వదినాన తర్పణ వదిలితే సంతాన ప్రాప్తి కలుగుతుందని, సంతానం ఉన్న వారి పిల్లలకు సద్బుద్ధులు కలుగుతాయనీ విశ్వాసం.

సాధారణంగా తండ్రి బతికి ఉన్నవారు తర్పణ లు వదలరాదు కానీ భీష్మ తర్పణం విషయంలో ఆ నియమాన్ని పాటించరు. అంతటి ప్రత్యేక స్థానం భీష్ముడిది. భీష్మాష్టమి రోజున సూర్యోదయానికి ముందే లేచి పూజామందిరాన్ని, ఇంటిని శుభ్రం చేయాలి. గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజామందిరాన్ని ముగ్గులతోనూ అలంకరించుకోవాలి. శిరఃస్నానం చేసి, తెలుపు రంగు దుస్తులను ధరించాలి. ఆ రోజంతా ఉపవాసముండి, రాత్రి జాగారం చేయాలి.

పూజకు విష్ణుమూర్తి ఫోటోను పసుపు, కుంకుమలు, తామర పువ్వులు, తులసి దళాలు, జాజిమాలతో అలంకరించుకోవాలి. విష్ణు అష్టోత్తరం, నారాయణ కవచం, శ్రీమన్నారాయణ హృదయం, విష్ణు సహస్రనామాలు, విష్ణు పురాణం పఠించాలి. లేదంటే కనీసం ‘ఓం నమోనారాయణాయ‘ అనే అష్టాక్షరీ మంత్రాన్ని 108 సార్లు జపించాలి.  అనంతరం ఆవునేతితో పంచహారతి ఇవ్వాలి. దేవాలయాల్లో విష్ణు అష్టోత్తరం, సత్యనారాయణ వ్రతం, బ్రహ్మోత్సవ దర్శనం, లక్ష తులసిపూజ వంటివి నిర్వహించడం ద్వారా శుభఫలితాలు చేకూరుతాయని పెద్దలు చెబుతారు.

మరిన్ని వార్తలు