Bhogi Festival 2022: భోగం వైభోగం.. భోగి పళ్లు ఎందుకు?

14 Jan, 2022 01:32 IST|Sakshi

Bhogi 2022: మన మహర్షులు కాలంలో జరిగే మార్పులను గమనించి, ఖగోళంలో జరిగే మార్పులను తెలుసుకుని, ఆయా సమయాల్లో మనం ఏ విధంగా ప్రవర్తించాలో, దైవాన్ని ఎలా ఆరాధించాలో, ఏమేమి చెయ్యాలో తెలియజేస్తూ మనకు అనేక పండుగలను, పర్వదినాలను ఏర్పరిచారు. ఈ సంక్రాంతి పండుగ గోవులకు, ప్రకృతికి, పరమాత్మకు, పల్లెలకు, పొలాలకు, పంటలకు, మానవులకు సంబంధించిన పండుగ. మన సంస్కృతికి సంప్రదాయాలకు, ప్రకృతి ఆరాధనకు, కృతజ్ఞతా ప్రకటనకు సంబంధించిన పండుగ.

మనది – వ్యవసాయ ప్రధానమైన దేశం. పంటలు చేతికొచ్చి, ఫలసాయం అందినందువల్ల దానిని పది మందికీ పంచుతూ అలా పంచటంలోని ఆనందాన్ని అనుభవించటం భారతీయులందరికీ ఆచారం. ప్రకృతిలో జరిగే గొప్ప మార్పు సూర్య భగవానుడు మకర రాశిలో ప్రవేశించటం. దీనినే మకర సంక్రమణం, ’మకర సంక్రాంతి’ పండుగ అంటాము. ఈ మకర సంక్రమణం ముఖ్యంగా పితృదేవతలకు తర్పణాలను సమర్పిస్తూ కృతజ్ఞతలు ప్రకటించ వలసిన ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన రోజు. దైవారాధన – సూర్యారాధన చెయ్యవలసిన రోజు. దీనికి ముందురోజు భోగి పండగ జరుపుకుంటాం. భోగి అంటే భోగం, సౌఖ్యం. భోగాన్ని అనుభవించేవాడు భోగి. అతను మహా యోగి, ఇతను మహా భోగి అంటుండటం వాడుకలో గమనిస్తాము. భోగాలను అనుభవించమని ప్రబోధించే పండుగ భోగి పండుగ.

ఈ పండుగలో ఏ రోజు విశిష్టత ఆ రోజుదే అయినా, భోగి పండుగ నాడు మనమందరమూ ఆచరించే విశేషమైన అంశాలెన్నో ఉన్నాయి. భోగి పండుగ మానవులందరినీ భోగము ననుభవించమని, ఆనందంగా ఉండమనీ చెప్తోంది. పరమాత్మ పంచభూతాత్మకమైన, భోగ స్వరూపమైన ప్రకృతిని సృష్టించి, ఆ సృష్టిలోని భోగాలను ఎలా అనుభవించాలో ఆ జ్ఞానాన్ని విధి నిషేధ రూపమైన వేద విజ్ఞానరూపంగా అనుగ్రహించాడు. మనం ఆ నియమాలను పాటిస్తూ భోగాలననుభవించాలి.

భోగి పండుగనాడు సూర్యోదయానికంటే ముందే ఇంటిల్లిపాదీ నిద్ర లేచి, ముఖం, కాళ్ళు, చేతులు కడుక్కుని, అందరూ కలిసి ఆరుబైటకు చేరి, భక్తితో భోగిమంటలు వెయ్యటం అన్నది మనకి అనాదిగా వస్తున్న సంప్రదాయం.

భోగిమంటల కోసం దైవ నామ స్మరణ చేస్తూ, ఆవుపేడ పిడకలను, సమిధలను పెట్టి, కర్పూరంతో అగ్నిని రగిలిస్తారు. అగ్నిదేవుని ప్రార్ధిస్తారు. ఆ మంటలు కాస్త పెరిగాక, ఇంట్లో ఉన్న పాత సామాన్లను, అక్కర్లేని చెక్కముక్కలను అన్నింటినీ ఆ మంటల్లో వేస్తారు. అంటే అక్కర్లేని చెత్తను వదిలించుకుని కొత్తదనాన్ని కోరటం కనిపిస్తుంది. భోగిమంటల వల్ల మనకు కలిగే మరొక లాభమేమిటంటే, ఈ భోగి మంటలలో ఆవుపేడ పిడకలను, సమిథలను వెయ్యటం వలన అవి కాలుతున్నప్పుడు వచ్చే ధూమం వాతావరణాన్ని శుభ్రపరుస్తుంది. పిల్లలందరూ ఈ భోగి మంటలను ఉత్సాహంగా చేస్తారు, ఎంతో ఆనందిస్తారు.

భోగి మంటలలోని అంతరార్ధం ఏమిటంటే, బాధ కలిగించే అక్కర్లేని ఆలోచనలను, రాగద్వేషాది దుర్గుణాలను, కోపతాపాలను అగ్నిలో దగ్ధం చెయ్యాలి అంటే రాగద్వేషాలను వదిలెయ్యాలి అని గ్రహించటం. అందరితో సౌమనస్యంతో ఉండాలని నిర్ణయించుకోవటం.

భోగి పండుగ నాడు శ్రీ సూర్యనారాయణ స్వామిని, కుల దైవాన్ని, ఇష్టదైవాన్ని, శ్రీ కృష్ణ పరమాత్మను, త్రిలోకాధిపతియై, సకల భోగాలను అనుభవిస్తున్న దేవేంద్రుని ఆరాధించి, కొత్త బియ్యంతో వండిన పొంగలి, పరమాన్నాలను దేవతలకు నివేదించి, ఆ ప్రసాదాన్ని మనం తినాలి.

భోగి పళ్లు ఎందుకు?
రేగు పళ్ళనే భోగిపళ్ళు అంటాము. భోగిపళ్ళు పొయ్యటానికి రేగుపళ్ళు, చెరుకు ముక్కలు, పచ్చదనాన్ని కోరుతూ పచ్చి శనగలను అంటే హరిబూట్‌ గింజలను, గురు గ్రహ అనుగ్రహం కోసం నానబెట్టిన శనగలను, దిష్టిని పోగొట్టే కొన్ని ద్రవ్యాలను, వక్కల లాంటి నల్లని గింజలను కలిపి, శుభాన్ని కలిగించే చామంతి, గులాబీ, బంతిపూల వంటి పూరేకలను, అక్షతలను, రాగి నాణాలను లేక చిల్లర నాణాలను అన్నింటినీ కలిపి రెండు చేతులతో తీసుకుని, పిల్లలను తూర్పుముఖంగా కూర్చోబెట్టి వారికి పైనుంచి కిందికి దిగతుడిచి, తరువాత గుండ్రంగా సవ్యంగా, అపసవ్యంగా పిల్లల చుట్టూ మూడు సార్లు తిప్పుతూ ‘ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, అయిన వాళ్ళ దిష్టి, కాని వాళ్ళ దిష్టి, మంచివాళ్ళ దిష్టి, చెడ్డవాళ్ళ దిష్టి, ఎంత అందంగా ఉన్నారనే వాళ్ళ దిష్టి అందరి దిష్టి పోవాలి‘ అంటూ వారి తల మీద పొయ్యాలి. అలా దిగ తుడవటం వల్ల పిల్లలకు ఏదైనా దిష్టి తగిలితే, అది తొలగిపోతుంది.
కాలమంతా దైవ స్వరూపమే అయినా, ఏ మంచి సమయంలో ఎటువంటి మంచి పనులను చేస్తే, అఖండమైన మంచి జరుగుతుందో మన మహర్షులు చెప్పారు. దానిని ఆచరిస్తూ మనమందరమూ సమస్త సన్మంగళములను పొందుదుము గాక !!

ఆ మంటల అంతరార్థం
మనం అగ్ని ఆరాధకులం. కనుక మాకు అసలైన భోగాన్ని కలిగించమనీ, అమంగళాలను తొలగించమనీ ప్రార్ధిస్తూ అగ్నిహోత్రుని రగులుస్తాము. గతించిన కాలంలోని అమంగళాలను, చేదు అనుభవాలేమైనా ఉంటే వాటిని, మనసులోని చెడు గుణాలను, అజ్ఞానాన్ని అన్నింటినీ అత్యంత పవిత్రమైన అగ్నిలో – అజ్ఞానాన్ని వేసి దగ్ధం చేసుకోవటం, భోగాన్ని, మంగళాలను, జ్ఞానాన్ని పొందాలనే కోరికతో అగ్నిహోత్రుని పరబ్రహ్మ స్వరూపంగా భావించి పూజించటమే భోగి మంటల వెనక ఉన్న అంతరార్థం. కాస్త జ్ఞానం కలవారు, ఈ రోజుతో చలి వెళ్ళి పోతోంది. సూర్యభగవానునిలోని తేజస్సు పెరగబోతోంది, వృద్ధి అవుతుంది అనే భావనతో భోగి మంటలు వేస్తారు.

గోదాదేవిని ఆండాళ్‌ తల్లి అంటారు. ఈమె శ్రీ రంగనాథ స్వామిని భర్తగా పొంద గోరింది. ఇందుకోసం ఆ కాలంలో కాత్యాయనీ వ్రతాన్నాచరించిన గోపికలను ఆదర్శంగా తీసుకుంది. తాను ధనుర్మాసం నెలరోజులు మార్గళీ వ్రతాన్నాచరించి, తిరుప్పావై పాశురాలతో స్వామిని కీర్తించి, పరమాత్మ అనుగ్రహం పొందింది. మహా పర్వదినమైన భోగినాడు శ్రీరంగనాథ స్వామిని వివాహం చేసుకుని, పరమమైన భోగాన్ని పొందింది. మనం భోగి పండుగనాడు శ్రీ గోదా రంగనాథ స్వామి కల్యాణం జరిపించి, దర్శించి ఆనందిస్తాము.

భోగి పండుగ నాటి విశేషం పిల్లలకు భోగి పళ్ళు పొయ్యటం. భోగి పండుగ నాడు ముత్తైదువులను ఇంటికి పిలిచి, ఇంటి పెద్దలందరూ కలిసి ఇంట్లో ఉన్న ఐదారు సంవత్సరాల లోపు పిల్లలకు దృష్టి దోషం తగలకుండా దిష్టి తీస్తూ, భోగిపళ్ళు పోసి, సకల శుభాలు కలగాలని ఆశీర్వదిస్తారు. మంగళ హారతినిస్తారు. ఇది మన సంప్రదాయం. కనుక భోగిపళ్ళు పొయ్యటం వెనక అంతరార్థం దృష్టి దోషం పరిహరించటం, చెడు సోకకూడదని కోరుకోవటం, శుభం కలగాలని ఆశీర్వదించటం. ఇదే వేదంలో చెప్పిన ఇష్టప్రాప్తి, అనిష్ట పరిహారం. దీనిని పసితనం నుంచే పిల్లలకు నేర్పిస్తున్నామన్నమాట.

– సోమంచి రాధాకృష్ణ
 

మరిన్ని వార్తలు