Gospel: దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు..

4 Apr, 2022 08:19 IST|Sakshi

సువార్త

సీమోను అత్త జ్వరంతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి. మార్కు 1:30. ఒక వ్యక్తి పడి ఉంటే ఆనందించేవారు లోకంలో కొందరుంటారు. నిలబడినవారిని సయితం పడగొట్టాలని ప్రయత్నం చేసేవారూ లేకపోలేదు. అయితే ఎందుకు కొరగాని వారిని ఎన్నుకొని వారికి సముచిత ప్రోత్సాహాన్ని అందించి వారిని సమసమాజ నిర్మాణం కోసం వాడుకోగలిగిన మహనీయుడు నిత్య దేవుడు. 

ఇశ్రాయేలు దేశంలోని కపెర్నహూము అనేది చారిత్రాత్మక ప్రదేశం. దానికి యేసు పట్టణం అనే పేరు కూడా ఉంది. మొదటి శతాబ్దపు చరిత్ర ఆనవాళ్లు నేటికీ అక్కడ కనబడుతుంటాయి. సమాజ మందిరం నుండి యేసుప్రభువు సీమోను ఇంటికి వెళ్ళాడు. అడుగుపెట్టగానే ఆయన దృష్టి జ్వరంతో పyì  ఉన్న పేతురు అత్తమీద పడింది. ఆ ఇంటిలో చాలామంది ఉన్నారు కానీ యేసుక్రీస్తు దయగలిగిన చూపు వ్యాధితో బాధపడిన వ్యక్తి మీదకు మరలింది. అవును! ఆయన దృష్టి ఎప్పుడూ అభాగ్యుల మీదనే. ఎక్కడ సమస్య ఉందో... ఎక్కడ కన్నీరు ఉందో... ఎక్కడ ఇబ్బంది ఉందో అక్కడికే క్రీస్తు పాదాలు నడిచాయి. ఆ సమస్యకు పరిష్కారమిచ్చుటకు ఆయన ప్రేమ అలాంటి స్థలాలకు ఆయనను నడిపించింది. 

మేలు చేయడానికి ముందు సీమోను పేతురు తన అత్త పరిస్థితిని ప్రభువుతో చెప్పుకున్నాడు. ఆయన ఓపికతో విన్నాడు. ఆయన ప్రార్థన ఆలకించువాడు గదా! మనుష్యుల విన్నపాలు వినడంలో ఆయనకున్నంత ఓపిక ఈ విశ్వంలో ఎవ్వరికైనా ఉందా? మనుష్యుల హృదయాంతరంగాన్ని అర్థం చేసుకోవడంలో ఆయనకున్న ఓర్పు మరెవ్వరికైనా ఉందా? నా దేవుడు నా గోడు వింటాడు అనే నమ్మికతో ఆయన పాదాల దగ్గర మోకరిల్లిన వారిని తోసివేసిన సంఘటన ఒక్కటైనా ఉందా? జీవన సంఘర్షణలో శాంతిమార్గాన్ని వెదుక్కొంటూ క్రీస్తు వద్దకు వచ్చినవారు నిరాశతో వెనుదిరిగినవారు కనిపిస్తారా? తన అత్త దుస్థితినంతా వివరించిన పేతురు ద్వారా ఆ కుటుంబానికి మేలు జరిగింది. తీవ్ర జ్వరంతో పడి ఉన్న ఆమెను యేసుక్రీస్తు చేయిపట్టి లేవనెత్తి స్వస్థపరిచారు. వెంటనే ఆమె లేచి అక్కడున్నవారికి ఉపచారం చేయడం ప్రారంభించింది.  

ప్రియ మిత్రమా! ఎంతకాలం మౌనంగా విలపిస్తావు? తీవ్రమైన నిరుత్సాహంతో కుమిలిపోతావు? ఇప్పుడే మాట్లాడు... నిన్ను ప్రేమించు నీ దేవుడు నీ ప్రార్ధన వింటున్నాడు. నీ వేమి చెప్పాలనుకుంటావో చెప్పు! కరుణావాత్సల్యాలు నీపై కుమ్మరించు నీ ప్రభువు నిన్ను నిరుత్సాహపరచడు. ఎంతసేపు మాట్లాడాలనుకుంటావో మాట్లాడు...ఆయన విసుగు చెందడు. నీ భారం ఎంత ఆయనపై మోపినా ఆయన అలసిపోడు. నీకు మేలు చేయడంలో దేవుడు ఎప్పుడూ సంసిద్ధుడే! నీవు చెప్పే నీ కష్టాల చరితను మనుష్యులు ఒకసారి వింటారేమో! రెండుసార్లు వింటారేమో. ఆ తర్వాత వారికీ విసుగొస్తుంది గనుక ముఖం చాటేస్తారు. నీ దేవుడు అలాంటివాడు కాదు. ఎన్నిసార్లు ఆయన పాదసన్నిధికి వచ్చి ఆయన్ను తండ్రి అని పిలిచినా ఆయన ప్రసన్నమైన వదనంతో జవాబునిస్తాడు. నీ స్థితిని చక్కదిద్ది ఊహించలేని మేళ్లు నీ జీవితంలో చేస్తాడు. – డా. జాన్‌ వెస్లీ,  క్రైస్ట్‌ వర్షిప్‌ సెంటర్‌ 

మరిన్ని వార్తలు