ఆడపిల్లకు ఒక అక్క ఉండాలి!

4 Jan, 2021 17:32 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

పనిలో ఉన్నాడు అతను. ఇంటి నుంచి ఫోన్‌ వచ్చింది. ‘అవునా!’ అన్నాడు మెల్లిగా. ముఖం మీదకు చిరునవ్వు వచ్చి వాలింది. అప్పటికి అతడి లంచ్‌ అవలేదు. అవకపోయినా కొంచెం వెయిట్‌ పెరిగినట్లుగా ఫీల్‌ అయ్యాడు. చేమంతి పుట్టినప్పుడు కాదు.. ఇప్పుడయ్యాడు అతడు ఆడపిల్ల తండ్రి!

స్కూల్‌ నుంచి వచ్చాడు చేమంతి అన్నయ్య. వస్తూనే ‘అమ్మా, చేమంతి ఎక్కడ?’ అని వెతుక్కున్నాడు. అమ్మ పుట్టాక (వాడు పుట్టాక అని అర్థం) అమ్మని వెతుక్కున్నాడు. చెల్లి పుట్టాక చెల్లిని వెతుక్కుంటున్నాడు. నిన్నటి ఆటేదో మధ్యలో ఆపేశారు అన్నాచెల్లెళ్లు. దాన్ని కంటిన్యూ చెయ్యాలి. అందుకే చెల్లి కోసం చూశాడు. ‘ఎక్కడుందో చూడు’ అని చెప్పే తల్లి.. ‘ఎందుకురా చేమంతి?’ అంది ఆరోజు! అదేం గ్రహించలేదు చేమంతి అన్నయ్య. ‘ఎక్కడికెళ్లింది చేమంతి?’ అని అడిగాడు. ‘ఎక్కడికీ వెళ్లలేదు. ఇకనుంచి చెల్లితో ఆటలు తగ్గించు. ఏడిపించడం కూడా..’ అంది తల్లి. తను కూడా కొన్ని తగ్గించింది. మొదట   కూతుర్ని ముద్దు చెయ్యడం తగ్గించింది.

ఆడపిల్ల ఎదిగాక అకస్మాత్తుగా ఆ ఇంట్లో పాత్రలు మారిపోయాయి. తండ్రి ఆమెకు చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ అయ్యాడు. అన్న ఆమెకు ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ కమాండో. తల్లి ఆమెకు ఆంతరంగిక సలహాదారు. ముగ్గురూ ఆమెకు కొంచెం దూరం కూడా అయ్యారు. రక్షణ వలయం కాస్త ఎడంగానే కదా ఉంటుంది. అమ్మ, నాన్న, అన్నయ్యలా అమ్మాయికి ఒక స్నేహితుడు కూడా ఉంటే అతడు ఆమెకు జడ్‌ ప్లస్‌ కేటగిరీ అయ్యేవాడు.

చేమంతి ఎందుకైనా మౌనంగా ఉంటే.. ‘ఏమైంది తల్లీ.. ఒంట్లో బాగోలేదా?’ అని తల్లి ఒళ్లోకి లాక్కుంటుంది. ‘పిల్లేంటి డల్‌గా ఉంది’ అని చేమంతి తండ్రి చేమంతి తల్లిని అడుగుతాడు. ‘చేమంతీ.. ఎందుకలా ఉన్నావ్‌!’ అని అన్నయ్య అడుగుతాడు. ‘ఏమైంది చేమంతీ! నేనేమైనా అన్నానా?’ అని చేమంతి స్నేహితుడు వెనక్కి ఆలోచిస్తాడు. చేమంతి కళ్లలో ఎందుకైనా నీళ్లు తిరుగుతుంటే ‘బయట ఎవరైనా ఏడిపిస్తున్నారా అమ్మా?’ అని తల్లి లోపలికి తీసుకెళ్లి అడుగుతుంది. ‘నేనున్నాను కదరా.. నాకు చెప్పు..’ అని తండ్రి కూతురి తల నిమురుతాడు. ‘చేమంతీ.. ఇలా రా.. కాలేజ్‌లో ఏమైనా జరిగిందా?’ అని అమ్మానాన్న లేకుండా చూసి అన్నయ్య అడుగుతాడు. ‘ఎవడాడు చేమంతీ.. పద’ అని హాకీ స్టిక్‌ చేతికిచ్చి బైక్‌ స్టార్ట్‌ చేస్తాడు చామంతి స్నేహితుడు. (చదవండి: గుడ్‌ టచ్‌.. బ్యాడ్‌ టచ్‌)

పన్నెండేళ్ల వయసుకొచ్చాక ఆడపిల్ల ఒంటికి ప్రొటెక్షన్‌ వస్తుంది. ఆమె ఆలోచనలకు ప్రైవసీ పోతుంది. ఎవడాడో చెప్పాలి. కాలేజ్‌లో ఏమైందో చెప్పాలి. మౌనంగా ఎందుకుందో చెప్పాలి. కన్నీళ్లు ఎందుకొస్తున్నాయో చెప్పాలి. చెప్పాలని ఉండి కూడా.. అమ్మకీ, నాన్నకీ, అన్నకీ, ఆఖరికి స్నేహితుడికీ చెప్పలేకపోతుంటే? తనే ధైర్యంగా ఉండాలి. తనే ధీమాగా, తనకు తనే హామీగా, తనే భద్రంగా, తనకు తనే రక్షణగా ఉండాలి. అలా ఉండాలంటే ఒక అక్క ఉండాలి. పన్నెండేళ్లు రాగానే ఇంట్లో వాళ్లంతా ఇంటి ఆడపిల్ల కోసం కత్తీ డాలూ పట్టుకుని రెడీ అయిపోతారు. పన్నెండేళ్లు వచ్చాక కాదు, పన్నెండేళ్లు వచ్చేలోపు ఆ కత్తీ డాలు పట్టుకోవడం తనకే తెలిసుండాలంటే ఇంట్లో అక్క ఉండాలి.  అమ్మ ఇవ్వలేని అనువు, నాన్న ఇవ్వలేని చనువు, అన్న ఇవ్వలేని సుళువు, స్నేహితుడు ఇవ్వలేని నెలవు అక్క ఇస్తుంది. బయట జరిగింది ఇంట్లో చెప్పుకోడానికే కాదు, ఇంట్లో జరిగింది బయటికి చెప్పుకోడానికీ అక్క ఉండాలి.

చెల్లెలికి అక్కను మించిన ఆప్తురాలు, ఆత్మీయ నేస్తం  ఎవరూ ఉండరని 38 దేశాల్లో లక్షా 20 వేలమంది పిల్లల్ని స్టడీ చేసి హార్వర్డ్‌ యూనివర్సిటీ తాజాగా వెల్లడించింది. అక్క గుండె చెల్లెలి కోసం కూడా కొట్టుకుంటుందట. అపరిచితురాలైనా.. ఆపదలో ‘అక్కా..’ అని పిలిస్తే అక్క కాకుండా పోతుందా?!
- మాధవ్‌ శింగరాజు

మరిన్ని వార్తలు