కోడలి సాయం.. మామకు థాంక్స్‌

30 Oct, 2020 07:54 IST|Sakshi

ఇంటి బాధ్యత ఎప్పుడూ కోడలిదే. మామగారి ఆదేశాలు, సూచనలు ఆమెకు శిరోధార్యం. ఇక మామ సాయం కోరితే చేయకుండా పోయే సమస్యే లేదు. అక్కినేని వారి ఇంటి కోడలు సమంత మామగారైన నాగార్జునకు చిన్న సాయం చేసింది. సాయం చేసే అవకాశం ఇచ్చినందుకు మామగారికి థ్యాంక్స్‌ చెప్పింది.చెప్పిన పని బాగా చేయగలిగినందుకు సంతోషపడుతోంది. ‘బిగ్‌బాస్‌4’ షోకు షూటింగ్‌ వల్ల హాజరు కాలేకపోయిన నాగార్జున స్థానంలో పండగ రోజు సమంత షో చేసి అందరి మన్ననలు 
అందుకుంది.

అక్కినేని వారి కోడలు సమంతను చూసి తెలుగు ప్రేక్షకులు ముచ్చట పడుతున్నారు. ప్రతిష్టాత్మక బిగ్‌బాస్‌ 4 షోను ఆమె రక్తి కట్టించడమే ఇందుకు కారణం. షూటింగ్‌ రీత్యా యాంకర్‌గా రావాల్సిన మామగారు నాగార్జున హాజరు కాలేకపోయినందుకు ఆయన స్థానంలో బాధ్యత తీసుకుని చక్కగా నెరవేర్చినందుకు ఆమెను ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు. ‘నేను మనాలిలో ఉన్నాను. షోకు హాజరు కాలేకపోతున్నాను’ అని ఎపిసోడ్‌ మొదలులో నాగార్జున వీడియో సందేశం అందించి షోను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను సమంతకు అప్పజెప్పారు.

అయితే అది విజయదశమి పండగ షో. స్టేజ్‌ మీద మూడుగంటల పాటు మారథాన్‌లా పరిగెత్తించాలి. సమంత ఇంతకు మునుపు అలా ఏ షోనూ హోస్ట్‌ చేయలేదు. తెలుగు మాట్లాడటంలో ఇంకా కొద్దిగా సమస్య ఉంది. అదీగాక బిగ్‌బాస్‌ షోను ఆమె ఫాలో కాలేదు. అయినా సరే మామగారి ఆదేశాన్ని శిరోధార్యంగా భావించి షోను నిర్వహించారు. గత రెండు మూడు రోజులుగా అన్ని వైపుల నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చిందని తెలిశాక ఊపిరి పీల్చుకుని నిన్న (అక్టోబర్‌ 29) నాగార్జునకు థ్యాంక్స్‌ చెబుతూ ట్వీట్‌ చేశారు. తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు.

నా మామగారు...
‘అంతా నా మామగారు నాగార్జున ప్రోత్సాహమే ఈనాటి నా సంతోషానికి కారణం. బిగ్‌బాస్‌ వేదిక మీద నేను హోస్ట్‌గా పని చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. నేను అలా డయాస్‌ మీద ఎప్పుడూ పని చేయలేదు. తెలుగు మాట్లాడగలనా అని సందేహం. బిగ్‌బాస్‌ చూడలేదు. అయినప్పటికి మామగారు నా భయాలన్నీ పోయేలా ఉత్సాహపరిచి ఈ షో నా చేత చేయించారు. ఆయన వల్లే నేను ఇది చేయగలిగాను’ అని ఆమె ట్వీట్‌లో సంతోషాన్ని వ్యక్తం చేశారు. అక్టోబర్‌ 25 నాటి పండుగ ఎపిసోడ్‌లో ఆమె ముదురు గులాబీ రంగు చీరలో, సంప్రదాయబద్ధమైన తలకట్టుతో వేదిక మీద ఆకట్టుకునేలా షోను నిర్వహించడం అభిమానులకు నచ్చింది. 

ఉద్వేగంతో..
సమంత బిగ్‌బాస్‌ ఎపిసోడ్‌ చేస్తున్నందున, ఆరోజు పండగ అయినందున నిర్వాహకులు భారీగా ఎపిసోడ్‌ను ప్లాన్‌  చేశారు. హైపర్‌ ఆది వంటి టీవీ స్టార్‌లను కో ప్రెజెంటర్‌లుగా ఆహ్వానించారు. ఆర్‌ ఎక్స్‌ 100 ఫేమ్‌ కార్తికేయ, పాయల్‌ విడివిడిగా డాన్స్‌ నంబర్లు ప్రెజెంట్‌ చేశారు. వీరందరినీ సమంత కోఆర్డినేట్‌ చేశారు. వీరితో పాటు బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్‌లను ఉత్సాహ పరుస్తూ వారితో గేమ్స్‌ ఆడించారు. వారిని పేరు పేరునా పలకరిస్తూ ఎంతో తెలిసినవారిలా వ్యవహరించారు. పండగ సందర్భంగా హౌస్‌మేట్స్‌కు వారి కుటుంబ సభ్యుల వీడియోలను చూపించే సమయంలో ఆ హౌస్‌మేట్స్‌ ఉద్వేగంతో కన్నీరు కార్చగా సమంత కూడా ఉద్వేగానికి లోనయ్యారు.

మరిదిగారు వచ్చారు
సమంత ఈ షోలో మరిది అఖిల్‌ను ఆహ్వానించడం కూడా ఒక ఎట్రాక్షన్‌గా నిలిచింది. ‘ఇప్పుడు వేదిక మీదకు మోస్ట్‌ ఎలిజిబుల్‌ బేచిలర్‌ వస్తున్నాడు’ అంటూ అఖిల్‌ను ఆహ్వానించారు. అఖిల్‌ నటించిన తాజా చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బేచిలర్‌’ ట్రైలర్‌ను ఈ సందర్భంగా ప్రదర్శించారు. ‘నీకు అమ్మాయిని వెతకమంటావా... నా సెలెక్షన్‌ను ఒప్పుకుంటావా’ అని సమంత అడిగితే ‘నీ సెలక్షన్‌  ఎంత బాగుంటుందో అన్నయ్యను చూస్తే తెలుస్తుందిగా వొదినా’ అని అఖిల్‌ అనడం అభిమానులను మురిసేలా చేసింది. పసుపు పచ్చటి షేర్వాణిలో అఖిల్‌ సమంత పక్కన షోలో కాసేపు మెరిశారు.

ఇంతకు ముందు రమ్యకృష్ణ
బిగ్‌బాస్‌ 3 షో చేస్తుండగా వెకేషన్‌కు వెళుతూ నాగార్జున ఒకటి రెండు ఎపిసోడ్లు హాజరు కాలేకపోయారు. ఆ సమయంలో ఆయన మిత్రురాలు, నటి రమ్యకృష్ణ హోస్ట్‌గా వచ్చి మెప్పించారు. ఇప్పుడు సమంత సాయానికి వచ్చారు. ఇంటి కోడలే మామగారి స్థానంలో రావడం ప్రేక్షకులకు ఆకర్షణగా మారింది. షూటింగ్‌ 16 రోజులు అని నాగార్జున చెప్పడం వల్ల సమంత మరో ఎపిసోడ్‌కు కూడా వస్తారని ప్రేక్షకులు భావించారు. అయితే నాగార్జున ఈ వారమే బిగ్‌బాస్‌ను అందుకుంటారని వార్తలు వస్తున్నాయి. సమంత హీరోయిన్‌గా ఇప్పుడు ఆచి తూచి నటిస్తున్నారు. మజిలి, ఓ బేబి, జాను సినిమాల తర్వాత కొత్త సినిమా విషయంలో ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం ఆమె యాడ్స్‌కు పని చేస్తూ బిజీగా ఉంటున్నారు. ఈ షో అనుభవంతో మున్ముందు టీవీలో కనిపిస్తారని ఆశిద్దాం.
– సాక్షి ఫ్యామిలీ

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు