బర్డ్‌ ఫ్లూ: భయం వద్దు.. జాగ్రత్త చాలు!

11 Jan, 2021 00:08 IST|Sakshi

బర్డ్‌ ఫ్లూ.. ఇన్‌ఫ్లూయంజా వైరస్‌. అడవి పక్షులు, వలస పక్షులు.. కోళ్లు, పిట్టలు, కాకుల ద్వారా వ్యాపించే వ్యాధి. హిమాచల్‌ప్రదేశ్, కేరళ తదితన ఆరు  రాష్ట్రాల్లో కోళ్లకు సోకడంతో బర్డ్‌ప్లూపై దేశవ్యాప్తంగా కలకలం మొదలైంది. అప్రమత్తమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సత్వర నియంత్రణా చర్యలు చేపట్టాయి. తెలుగు నాట కోళ్ల పెంపకందారులు అవగాహన పెంచుకొని, అప్రమత్తంగా ఉంటే చాలని, ప్రస్తుతం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విజయవాడలోని పశు వ్యాధి పరిశోధనా కేంద్రం నిపుణులు చెబుతున్నారు. 

ఎలా వ్యాప్తిస్తుంది?
► బర్డ్‌ ఫ్లూ సోకిన కోళ్లు/పక్షులు తాగిన నీళ్లు, మేత ద్వారా..  
► నోటి నుంచి కారే ద్రవం, ముక్కు నుంచి కారే చిమిడి ద్వారా..
రెట్టల ద్వారా.. సంపర్కం ద్వారా..

కోళ్లకు సోకకుండా రైతులు ఏం చెయ్యాలి?
► కోళ్లను ముట్టుకునేటప్పుడు చేతులు, చెప్పులకు తొడుగులు వేసుకోవాలి లేదా ముందు, తర్వాత కూడా సబ్బుతో కడుక్కోవాలి. మేతను, నీటిని తీసుకెళ్లే వాహనాలు, ట్రాలీల చక్రాలను తరచూ శుభ్రం చేయటం వంటి జీవ భద్రతా చర్యలు తీసుకోవాలి.
► కోళ్ల ఫారాలలో, కోళ్లను పెంచే రైతుల ఇళ్ల దగ్గర కోళ్లు తిరిగే ప్రాంతాలను తరచూ శుభ్రం చేయాలి.
► ​​​​​​​కనీసం రోజు విడిచి రోజైనా సున్నం, బ్లీచింగ్‌ పౌడర్‌తో పరిసరాలను శుభ్రం చేసుకోవాలి. 
► ​​​​​​​కోళ్ల దగ్గర్లోకి వలస పక్షులు, కాకులు రాకుండా జాగ్రత్తపడాలి.
► ​​​​​​​కోళ్లు ఉన్న షెడ్‌/పాకల చుట్టూ వలలు, తెరలు లేదా ఇనుప మెష్‌లు ఏర్పాటు చేసుకోవాలి.
► ​​​​​​​చెరువులు, నీటి గుంటల దగ్గర కూడా వలలు, తెరలు ఏర్పాటు చేసుకోవాలి.
► ​​​​​​​బర్డ్‌ ఫ్లూ ప్రభావం తగ్గే వరకు పెరటి కోళ్లను ఆరు బయటకు వదలకుండా ఉంటే మంచిది. 

బర్డ్‌ ఫ్లూ సోకిందని గుర్తించేదెలా?
► తల మీద జుట్టు ఊదా రంగులోకి మారుతుంది.
► పాదాలు, పొట్ట కింద చర్మం కందినట్లు ఉంటుంది.
►  చెవి తమ్మెలు నీలి రంగులోకి మారుతాయి.
►  తల వాపు ఎక్కువగా ఉంటుంది.. మెడ తిరిగి పోతుంది.
►  విరేచనాలు అవుతుంటాయి. తూలుతూ నడుస్తుంటాయి.
► సోకిన కొద్ది సమయంలోనే చాలా కోళ్లు చనిపోతాయి.
► బర్డ్‌ ఫ్లూ సోకిన 92 శాతానికి పైగా కోళ్లు చనిపోతాయి.

కోళ్లకు సోకితే ఏం చేయాలి?
► బర్డ్‌ ఫ్లూ లక్షణాలతో ఉన్న కోళ్లను ఇతర కోళ్లకు దూరంగా ఉంచాలి.
► లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప పశువైద్యశాల సిబ్బందికి చెప్పాలి. 
► ఎక్కువ కోళ్లు చనిపోతుంటే వెంటనే పశువైద్యుడ్ని సంప్రదించాలి.
► బర్డ్‌ ఫ్లూతో చనిపోయిన కోళ్లకు పోస్టుమార్టం చెయ్యకుండా దూరంగా తీసుకెళ్లి పూడ్చేయాలి. 
► చనిపోయిన కోళ్లను ఎక్కడపడితే అక్కడ పడేయకూడదు.
► కోళ్ల ఫారాలు/కొట్టాలు, నీటి కుంటలకు దూరంగా లోతుగా పెద్దగొయ్యి తవ్వి సున్నం, బ్లీచింగ్‌ చల్లి పాతి పెట్టాలి. 

మనుషులకు సోకకుండా ఏం చేయాలి?
► బర్డ్‌ ఫ్లూ సాధారణంగా కోళ్లు, పక్షుల నుంచి మనుషులకు సోకదు. 
► అయినా సరే.. కరోనా కట్టడికి జాగ్రత్తలు తీసుకున్నట్టుగానే వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. 
► కోళ్ల కొట్టంలో పనులు చేసే వారు, కోళ్ల ఫారాల్లో పనిచేసే వారు విధిగా మాస్క్‌లు, చేతులకు రబ్బరు తొడుగులు, బూట్లు ధరించాలి.
► దాణా కలిపే పరికరాలు, ఫారాల్లో ఉపయోగించే ఇతర పరికరాలను రోజూ శుభ్రం చేసుకోవాలి.
► ఈ పరికరాలను ఒక ఫారం నుంచి మరొక ఫారానికి తీసుకెళ్లకూడదు. 
► ఒక ఫారంలో పనిచేసే వారు మరొక ఫారానికి వెళ్లకూడదు.
► బర్డ్‌›ఫ్లూతో కోళ్లు ఎక్కువ మొత్తంలో చనిపోతున్నట్లయితే ఆ ప్రాంతాల్లో పనిచేసే వారు విధిగా పీపీఈ కిట్‌లు ధరించాలి.
– పంపాన వరప్రసాద్, సాక్షి, అమరావతి

అవగాహన ముఖ్యం
మనుషులకు సోకే అవకాశం చాలా తక్కువ. ఈ వ్యాధి సోకుతుందన్న ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గుడ్లు, కోడి మాంసాన్ని నిరభ్యరంతరంగా తినొచ్చు. జిల్లా స్థాయిలో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశాం. బర్డ్‌ ఫ్లూ గురించి కోళ్ల పెంపకందారులు అవగాహన చేసుకోవాలి. దీని నియంత్రణకు ప్రభుత్వం సర్వసన్నద్దంగా ఉంది.
– డాక్టర్‌ కృష్ణ జ్యోతి, డెప్యుటీ డైరెక్టర్, పశుసంవర్ధక శాఖ

వెంటనే స్పందిస్తాం
పెరటి కోళ్ల పెంపకం జరుగుతున్న, పౌల్ట్రీ ఫారాలున్న గ్రామాలను గుర్తించాం. ముందస్తు నియంత్రణ చర్యలు తీసుకుంటున్నాం. కోళ్లు, కోడిగుడ్ల రవాణా వాహనాలపై నిఘా పెట్టాం. కోళ్ల రైతులు కోరిన వెంటనే స్పందించడానికి 829 బృందాలను ఏర్పాటు చేశాం. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉంది.
– అమరేందర్, డైరెక్టర్, ఏపీ పశుసంవర్ధక శాఖ

అవసరమైతే ఎవరికి ఫోన్‌ చెయ్యాలి?
శ్రీకాకుళం – 99899 32801, విజయనగరం – 99899 32825, విశాఖపట్నం – 99899 32834, తూర్పుగోదావరి – 99662 24818, పశ్చిమగోదావరి – 99899 32863, విజయవాడ – 99899 32851, గుంటూరు –    99899 32872, నరసరావుపేట – 99899 32873, ప్రకాశం –     99899 32879, నెల్లూరు – 99899 32893, చిత్తూరు – 99899 97067, కడప – 94416 14707, అనంతపురం – 99850 30053, కర్నూల్‌ – 99899 97251

మరిన్ని వార్తలు