బిడ్డ పుట్టిన రోజే అమ్మకు కూడా పుట్టినరోజు

23 May, 2022 00:03 IST|Sakshi

శతక నీతి: సుమతి 

అమ్మ సృష్టికర్త. అమ్మ తన కడుపును గర్భాలయం చేసి మరణ సదృశమైన వేదనను పొంది బిడ్డకు జన్మనిస్తుంది, అందుకే ప్రతి బిడ్డ పుట్టినరోజు అమ్మకు కూడా పుట్టిన రోజే. బిడ్డ అమ్మ శరీరంలో అంతర్భాగం. ఈవేళ మనకున్న శరీరం అమ్మ కడుపులో పుట్టి పెరిగిందే కదా! పుట్టినది మొదలు మల మూత్రాదులను శుభ్రం చేసి, పెంచి పెద్దచేసి, ఆఖరి ఊపిరిలో కూడా పిల్లలు కష్టపడకూడదని, తాను ఎన్ని ఇబ్బందులు పడుతున్నా పైకి చెప్పకుండా పిల్లలు వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ తన ఆయుర్దాయం కూడా పిల్లలకు ఇవ్వమని ప్రార్థించే అమ్మ లాంటి వ్యక్తి ఈ లోకంలో మరొకరు ఉండరు. అమ్మే ఈ శరీరాన్ని ఇవ్వకపోతే మనకు ఈ శరీరం ఎక్కడిది ?  

మన సుఖ సంతోషాలకు మన కీర్తిప్రతిష్ఠలకు మూలమయిన ఈ శరీరం అమ్మ ప్రసాదించిందే. అమ్మను మించిన దైవం ఎక్కడుంది? అందుకే వేదం మొదటి నమస్కారం అమ్మకు చేయించింది– మాతృదేవోభవ–అని. మిగిలిన అందరికీ పుట్టిన రోజు ఒక్కటే కానీ అమ్మకు మాత్రం తాను స్వయంగా జన్మించిన రోజున ఒక పుట్టిన రోజుతోపాటూ, ఎంతమంది బిడ్డల్ని కంటుందో ఆమెకు అన్ని పుట్టినరోజులుంటాయి. అంటే అమ్మకు ఇద్దరు బిడ్డలుంటే మూడు పుట్టినరోజులుంటాయి. స్త్రీగా తన పుట్టినరోజును భర్త వేడుకగా చేస్తే, మిగిలిన పుట్టిన రోజులను బిడ్డలు తమకు జన్మనిచ్చినందుకు కృతజ్ఞతగా మొదట ఆమెకు కొత్త బట్టలు పెట్టి తరువాత తాము వేసుకుని వేడుక చేసుకోవాలి.

స్త్రీగా కూడా ఆమె పుట్టిల్లు, అత్తవారిల్లు... రెండింటి క్షేమాన్నీ ఆకాంక్షిస్తుంది. తల్లిగా రెండు వంశాలను తరింప చేస్తుంది. ధర్మపత్నిగా పురుషుడికి యజ్ఞయాగాది క్రతువుల నిర్వహణకు అర్హుడిని చేస్తుంది. భగవంతుడు ఎక్కడో ఉండడు, అమ్మరూపంలోనే మనకు అందుబాటులో ఉంటాడు. అందుకే బద్దెనగారు ‘‘నీరే ప్రాణాధారము, నోరే రసభరితమైన నుడువులకెల్లన్‌/నారియె నరులకు రత్నము/ చీరయె శృంగారమండ్రు సిద్ధము సుమతీ!’’ అన్నారు. మనుషులలో రత్నం అంత గొప్పది స్త్రీ అంటున్నారు.

అలాగే ‘చీరయె శృంగారమండ్రు...’ అన్నారు. చీర అంటే స్త్రీలు ధరించేదని కాదు. రాముడు నార చీరెలు కట్టుకున్నాడు అంటారు. చీర– అంటే వస్త్రం. శృంగారం అంటే పరమ పవిత్రమయిన అలంకరణ, శుద్ధమయినది... అని! కట్టుకున్న బట్టను బట్టి మనిషి జీవన విధానం తెలుస్తుంటుంది. వేల ఖరీదు చేసే వస్త్రాలే కట్టుకోవాలనే నియమం ఏదీ ఉండదు. ఏది కట్టుకున్నా బట్ట పరిశుభ్రంగా, ప్రకాశవంతంగా ఉండాలి. నిజంగా కష్టంలో ఉండి నిస్సహాయ పరిస్థితుల్లో తప్ప మనిషి ఎప్పుడూ పరిశుభ్రమైన వస్త్రాలనే ధరించాలి. పిల్లలు మరో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి.

ఎవరి బట్టలు వారు శుభ్రం చేసుకోవడం చిన్నప్పటినుండే అలవాటు చేసుకోవాలి. దీనివల్ల మీకు పరిశుభ్రత మీద ఆసక్తి పెరగడమే కాక, అమ్మ కష్టాన్ని కూడా తగ్గించిన వారవుతారు. మన సంప్రదాయం ప్రకారం బయట ఎక్కడికి వెళ్లి వచ్చినా ముందుగా కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోవాలి, బయట తిరిగొచ్చిన బట్టలు మార్చుకోవాలి. విడిచిన బట్టలు, తడి బట్టలు ఇంట్లో ఎక్కడంటే అక్కడ కుప్పలుగా వేయకుండా వాటి స్థానాల్లో వాటిని ఆరేయడమో, తగిలించడమో చేయాలి. అది మన శరీరానికి, పరిసరాలకే కాదు, మన ప్రవర్తనకు, మన శీలానికి, మన వ్యక్తిత్వానికి అలంకారం. అది మనకు గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. బద్దెన గారు చెప్పినవి చిన్నచిన్న మాటలే అయినా మన జీవితాలను చక్కటి మార్గంలో పెట్టే సూత్రాలు.
 
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

మరిన్ని వార్తలు