మంత్రగత్తె ముసుగుపై పోరాటం

29 Jan, 2021 06:41 IST|Sakshi
బిరుబలా రభా

పల్లెజీవనంలో స్వచ్ఛత ఉంటుంది. అమాయకత్వం కూడా ఉంటుంది. అక్కడే మూఢవిశ్వాసాలు కూడా బలంగా ఉంటాయి. మంత్రాలతో, చేతబడులతో మమ్మల్ని నాశనం చేస్తున్నారన్న అపోహలతో అలాంటి వారిని వేటాడి చంపాలనుకుంటారు. మంత్రాల నెపంతో జరిగే దారుణాలకు అడ్డుకట్టవేయడానికి కృషి చేస్తున్న స్త్రీ మూర్తి బిరుబాలా. గ్రామాల్లోని ఇలాంటి దురాచారాలకు, మంత్రవిద్యలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న 63 ఏళ్ల బిరుబాలా మంత్రగత్తెలు అనే పేరుతో మహిళలను చంపడం, వారిపై జరిగే దాడులను అడ్డుకోవడానికి ఆమె చుట్టుపక్కల గ్రామాలన్నీ తిరుగుతుంది. అలా 15 ఏళ్లుగా 42 మంది మహిళల ప్రాణాలను కాపాడింది. బిరుబాలా సేవలకు గాను ఇప్పటికే ఆమెను ఎన్నో అవార్డులు వరించాయి. ఈ యేడాది భారత ప్రభుత్వం బిరుబాలా సేవలను గుర్తించి పద్మశ్రీ అవార్డును ఇచ్చి సత్కరించింది. అస్సామ్‌ రాష్ట్రం గోల్‌పరా జిల్లాలో ఓ మారుమూల ప్రాంతంలో ఉంటారు బిరుబలా రభా. బెదిరింపులు ఎదురైనా సమాజానికి పట్టిన మూఢాచార దెయ్యంపై ఆమె ఇప్పటికీ పోరాటం చేస్తూనే ఉంది. 

ఊరూరా తిరుగుతూ..
ఆమె ప్రస్తుతం 15 మంది సభ్యులతో కలిసి ‘విచ్‌ హంట్స్‌’ అనే పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా క్యాంపెయిన్‌ చేస్తోంది. ‘మంత్రగత్తెలు’ అనే పేరుతో మహిళల ప్రాణాలు తీసే దుష్టచర్యకు వ్యతిరేకంగా పనిచేస్తూనే ఉంటాను’ అంటారు ఆమె. బిరుబాలా ఈ విషయమ్మీద మరింత స్పష్టతను వ్యక్తం చేస్తూ –‘నా విధానాలు నచ్చిన వ్యక్తులతో కలిసి గ్రామీణ ప్రాంతాలలో పర్యటించడం ద్వారా ప్రజలలో అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నాను’ అని తెలిపారు. అస్సాంలో పురుషులను కూడా ‘మంత్రగాళ్లు’ అనే నెపంతో చంపాలని ప్రయత్నాలు చేస్తుంటారు. 1996లో మతిస్థిమితం సరిగ్గా లేని బిరుబాలా కుమారుడిని ‘మంత్రగాడు’ అనే నెంపతో చంపాలని చూశారు. దీంతో తల్లడిల్లిన ఆమె ‘మిషన్‌ బిరుబాలా’ అని ఆ రోజునే మొదలుపెట్టారు. అందుకు స్థానిక సామాజిక కార్యకర్తలు, స్కూల్‌ టీచర్లు, వైద్యుల సహాయంతో మంత్రగత్తెల వేటకు వ్యతిరేకంగా ఒక బిల్లును సూచించారు. 

ఊరి నుంచి వెలి
మంత్రవిద్య వ్యతిరేక చట్టాన్ని వేగవంతం చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు. ఇలాంటి ప్రమాదకరమైన పద్ధతులను అంతం చేయడంలో సమాజానిది కీలకప్రాత అని తెలిపారు. 2010 నుండి మంత్రగత్తె–వేట పేరిట అస్సాం అంతటా దాదాపు 80 మంది మరణించారు. ఇటువంటి పద్ధతులకు వ్యతిరేకంగా స్వరం పెంచినందుకు ఒకప్పుడు తన ఊరి నుండే తరిమేయబడిన బిరుబాలా 42 మంది మహిళలను రక్షించారు. 

దయచేసి విడిచిపెట్టండి..
అస్సాం అసెంబ్లీ విచ్‌ హంటింగ్‌ యాక్ట్‌ 2015లో ఆమోదించింది.  ఈ చట్టం మంత్రగత్తె పేరుతో మనుషులను వేటాడటం సరికాదనడానికి సహాయపడుతుంది. దీని పట్ల మరింత సామాజిక అవగాహన కల్పించడానికి అదనపు డైరెక్టర్‌ జనరల్‌ పోలీస్‌ కులాధర్‌ సైకియా 2001లో ప్రాజెక్ట్‌ ప్రహరీని ప్రారంభించారు. 2015లో సోల్జర్‌ ఆఫ్‌ హ్యుమానిటీ అవార్డును బిరుబాలాకు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా బిరుబాలా మాట్లాడుతూ ‘మూఢనమ్మకాలు పెరగడానికి కారణం సరైన విద్య, ఆరోగ్య సదుపాయాలు గిరిజనులకు లేకపోవడమే. సదుపాయాలు కల్పించండి. నిందితులను దయతో విడిచిపెట్టండి’ అని వివరించి మానవత్వాన్ని చాటుకుంది. 

గౌరవ డాక్టరేట్‌..
బిరుబాలా సేవలను గుర్తించిన అస్సాం ప్రభుత్వం ఉత్తమ సామాజిక వ్యవస్థాపక పురస్కారాన్ని అందించింది. దీంతో పాటు మరెన్నో అవార్డులు బిరుబాలాను వరించాయి. మంత్రవిద్య, మంత్రగత్తె వేటకు వ్యతిరేకంగా పనిచేస్తున్న బిరుబాలాకు గౌహతి విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. ఏళ్ల తరబడి వేళ్లూనుకుపోయిన మూఢాచార వ్యవస్థను ఒక్కరి వల్ల ఏమవుతుందిలే అనుకోకుండా గళం విపి, కదం తొక్కి వ్యవస్థను గాడిన పెట్టిన బిరుబాలా లాంటి వ్యక్తులు ఎక్కడునా ఆదర్శప్రాయమైనవారే. 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు