రాత్రికి రాత్రే చెరువు మాయం చేసిన దుండగులు! తెల్లారేసరికి అక్కడ..!

1 Jan, 2024 12:42 IST|Sakshi

కొన్ని రాష్ట్రాల్లో జరిగే వింత ఘటనలు చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. వామ్మో! ఇదేంటి అనిపిస్తుంది. సాధారణంగా దొంగలు చైన్‌లు, పర్సులు, ఇళ్లు దోచుకుంటారు. ఇది అందరికీ తెలిసిందే. కానీ బిహార్‌లో మాత్రం దొంగలు చాలా వెరైటీగా ఉంటారు. అక్కడ ఒక్కసారి ఏకంగా బ్రిడ్జినే ఎత్తుకుపోయారు. ఆ తర్వాత ఓ సొరంగం మార్గం ద్వారా బెగుసరాయ్‌లోని రైల్వే యార్డ్ నుంచి ఏకంగా రైలు ఇంజన్‌ని ఎత్తుకుపోయారు. ఇలాంటి విచిత్రమైన చోరీలతో బిహార్‌ తరుచుగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. మళ్లీ ఇప్పుడూ ఈ చెరువు కారణంగా మరోసారి హాట్‌టాపిక్‌గా వార్తల్లో నిలిచింది. ఎక్కడైన చెరువుని ఎత్తుకెళ్లడం గురించి విన్నారా! అదికూడా ఒక్కరాత్రిలో మాయం చేయడం అంటే నమ్ముతారా?. అదేమీ ఆషామాషీ వ్యవహారం కాదు. ఆ దుండగలు ఎవరో గానీ ఎత్తుకెళ్లే దమ్ముంటే ఏదైనా చెయ్చొచ్చు అన్నా రేంజ్‌లో చేసి చూపించారు!.

ఈ విచిత్ర ఘటన బిహార్‌లోని దర్భంగా జిల్లాలో చోటు చేసుకుంది. అక్కడ స్థానికంగా ఉండే ప్రజల అవసరాలకు ఉపయోగపడే ఓ చెరువు రాత్రికి రాత్రే మాయమైపోయింది. తెల్లారేసరికి ఆ ప్రదేశంలో నీళ్లు లేకుండా మట్టితో పూడుకుపోయి, అక్కడ  ఒక గుడిసె మాత్రమే కనిపించింది. దీంతో షాకైన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక్కడ చెరువుని చేపలు పట్టడానికి, వ్యవసాయానికి వినియోగించేవాళ్లమని స్థానికులు చెబుతున్నారు. ఇంతకమునుపు మండల అధికారులు చెరువు పూడిక తీత పనులు మొదలుపెట్టారని తాము అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆ పనులు నిలిపేసినట్లు చెప్పుకొచ్చారు. అయితే ఇదంతా ఎలా జరిగిందన్నాది తామకిప్పటికీ అంతుపట్టడం లేదన్నారు. అంతేగాదు రాత్రికి రాత్రే ఎలా చెరవు మాయం చేశారన్నది తమకు తెలియదని ఫిర్యాదులో పోలీసులకు తెలిపారు.

అయితే గత కొద్దిరోజులుగా ఈ ప్రదేశంలో రోజూ రాత్రిపూట ట్రక్కులు నడిచేవని స్థానికులు చెప్పారు. ట్రక్కులతోపాటు ప్రొక్లెయినర్లు, ఇతర భారీ యంత్రాలు ఆ చెరువు వద్ద పనులు సాగించినట్లు పోలీసులకు తెలిపారు. అయితే అక్కడ ఏం జరుగుతుందనేది తమకు మాత్రం తెలియదని పేర్కొన్నారు. తీరా అక్కడికి వెళ్లి చూడగా.. నీళ్లు ఉన్న చెరువు స్థానంలో మొత్తం మట్టితో నింపేసి.. అక్కడ ఒక గుడిసె వేసినట్లు గుర్తించారు. అంతేగాదు ఈ పని అంతా కేవలం రాత్రి పూట మాత్రమే జరిగిందని స్థానికులు పోలీసులకు తెలిపారు.

కానీ దర్భంగాలో పెరుగుతున్న భూముల ధరల కారణంగా దుండగుల దృష్టి ఈ చెరువుపై పడిందని అంటున్నారు. అందుకే ఇంతలా పకడ్బంధీగా చీకట్లోనే చెరువు కబ్జా చేసేందుకు యత్నించారని స్థానికులు చెబుతున్నారు. కాగా ఈ ఘటనకు ఎవరు పాల్పడ్డారు, చెరువుని మాయం చేసేలా మట్టిని ఎలా నింపారనేది తెలియాల్సి ఉంది. పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామని అన్నారు. ఇది మాములు మిస్టరీ కాదు. ఎదుకంటే?  కటిక చీకటిలోనే గుట్టు చప్పుడు కాకుండా అదికూడా ఏకంగా ఓ చెరువునే మాయం చేశారు దుండగలు. 

(చదవండి: New Year 2024: ఇవాళ ఇవి తింటే..లక్కే లక్కు..డబ్బే..డబ్బు..)

>
మరిన్ని వార్తలు