ఏం మాటలివి!

30 Sep, 2020 00:14 IST|Sakshi

చాక్లెటీ ఫేస్‌.. ప్రియాంక. పెద్ద బొట్టు.. స్మృతీ ఇరానీ. తళుకులు.. జయప్రద. కులుకులు.. హేమమాలిని. సోగ్గత్తె.. మాయావతి. ఇవా రాజకీయ విమర్శలు! ఇప్పుడొకాయన.. మమతకు కరోనా అంటిస్తానంటున్నాడు! ఎలాగంటే.. ఆవిణ్ణి హగ్‌ చేసుకుంటాడట! ఏం మాటలివి? ఇష్యూ మీద ఢీకొనాలి గానీ.. మనిషి మీదా వెళ్లి పడటం?!

రాజకీయాల్లోకి మహిళలు రాలేకపోవడం ఉండదు. వాళ్లను రానివ్వకపోవడం, వచ్చాక  నిలదొక్కుకోనీయక పోవడం ఉంటుంది. నానా మాటలు అంటారు. అయితే ఆ మాటలు ‘నువ్వు నీ హామీలు నెరవేర్చలేక పోయావు’ అనే ఆరోపణలతో ఆగేవి కావు. ‘నువ్వేంటో నాకు తెలుసు’ అనేంత వరకు వెళ్తాయి. బీజేపీ కొత్త జాతీయ కార్యదర్శి అనుపమ్‌ హజ్రా కూడా అంతవరకూ వెళ్లారు. ‘కూడా’అని అనడం దేనికంటే ఆయన బాగా చదువుకున్న వ్యక్తి. యూనివర్శిటీ ప్రొఫెసర్‌! 

కార్యదర్శిగా అనుపమ్‌ శనివారం పదవీ బాధ్యతలు చేపట్టగానే ఆదివారం దక్షిణ 24 పరగణాల జిల్లాలోని బరూయ్‌పూర్‌లో ప్రెస్‌ మీట్‌ పెట్టి.. పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కరోనా బాధితుల విషయంలో అమానుషంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఆ సమయంలో ఆయన గానీ, అనుచరులు గానీ మాస్క్‌లతో లేరు. మీడియా ప్రతినిధులు ఆ విషయమే అడిగారు. ‘‘మా కార్యకర్తలకు కరోనా అంటే భయం లేదు. ఎందుకంటే.. అంతకంటే ప్రమాదకరమైన మమతా బెనర్జీతో తలపడుతున్నారు’’ అని అన్నారు అనుపమ్‌. అక్కడితో ఆగిపోలేదు. ‘‘నాకు గానీ కరోనా రావాలీ.. వెళ్లి మమతను హత్తుకుంటాను’’ అన్నారు! ఒక మహిళను అనకూడని మాట. వివేకం నశించినప్పుడు నాలుక కట్టడి తప్పుతుంది. ఇలా కట్టడి తప్పి, మహిళా రాజకీయనేతలను తప్పుగా మాట్లాడిన నాలుకల క్లబ్బులో అనుపమ్‌ తాజా సభ్యుడు.

ఎన్నికల ప్రచారంలో, పార్లమెంటు సమావేశాలలో మహిళా నేతలతో మాటా మాటా వచ్చినప్పుడు వారిని ఎదుర్కోలేక, విమర్శల్ని వారి ఒంటి మీదకో, ఇంటి మీదకో మళ్లిస్తుంటారు పురుష నాయకులు. పురుషులపై పురుషులు, పార్టీలపై పార్టీలు చేసుకునే ఆరోపణలు, విమర్శల్లో కూడా వాళ్లు తిరగడం.. స్త్రీల చుట్టూనే! నాయకుల ఈ నోటి దుడుకుపై ఎన్నికల సంఘం, జాతీయ మహిళా కమిషన్, లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్‌ ఎంతగా అభిశంసించినా, పోలీస్‌ స్టేషన్‌లలో ఎన్ని కేసులు నమోదైనా, సోషల్‌ మీడియాలో వేల కామెంట్‌లుగా నిరసనలు వ్యక్తం అయినా.. అవేవీ హెచ్చరికలు కావడం లేదనడానికి తాజా నిదర్శనమే మమతా బెనర్జీపై అనుపమ్‌ హజ్రా చేసిన వ్యాఖ్యలు. ఆయన కన్నా ముందు అదుపు తప్పిన వారు ఎందరో ఉన్నారు. వారిలో ఎవరు ఎవర్ని ఏమన్నారో ఒకసారి గతంలోకి వెళ్దాం.

‘‘రాంపూర్‌ ప్రజలారా.. ఉత్తర ప్రదేశ్‌ ప్రజలారా.. భారతదేశ ప్రజలారా.. ఆ మనిషి ఏమిటో తెలుసుకోడానికి మీకు 17 ఏళ్లు పట్టింది. నేను పదిహేడు రోజుల్లో కనిపెట్టేశాను. ఆమె లోదుస్తులు ఖాకీ రంగువి.’’ 
(జయప్రద గురించి ఆజమ్‌ఖాన్, సమాజ్‌వాది పార్టీ)

‘‘ఆమె తన తళుకుబెళుకుల వస్త్రాలతో, ఆటపాటలతో రాంపూర్‌ సాయంత్రాలను రంగులమయం చేయడానికి వచ్చారు.’’  (జయప్రద గురించి ఫిరోజ్‌ఖాన్, సమాజ్‌వాది పార్టీ)
‘‘ఊర్మిళను పార్టీలో చేర్చుకున్నారు. ఆమెకేం తెలుసు పాపం. అమాకురాలు. భోలీ భాలీ లడికీ. పాలిటిక్స్‌లో జీరో నాలెడ్జ్‌. ఆ కళ్లు బాగుంటాయని కాంగ్రెస్‌ తెచ్చుకుంది.’’ (గోపాల్‌శెట్టి, బీజేపీ)

‘‘స్మృతీ ఇరానీ గడ్కారి పక్కన కూర్చొని రాజ్యాంగాన్ని మార్చే విషయం మాట్లాడుతోంది. ఆమె గురించి ఓ విషయం చెబుతా వినండి. ఆమె తన నుదుటిపై పెద్ద బొట్టు పెట్టుకుంటుంది. నాకొకరు చెప్పిందేమిటంటే అంత పెద్దబొట్టు పెట్టుకుని కనిపించేవారు తరచు భర్తలను మార్చేవారు అయుంటారని! మారే భర్తల సంఖ్య పెరిగే కొద్దీ బొట్టూ పెద్దది అవుతుందట.’’ (జయదీప్‌ కవాడే, పీపుల్స్‌ రిపబ్లికన్‌ పార్టీ)
‘‘ఆమె ప్రతిరోజూ ఫేషియల్‌ చేయించుకుంటుంది. మన నాయకుణ్ణి సోగ్గాడు అంటోంది. ఆయన కాదు సోగ్గాడు. ఆరవై ఏళ్ల వయసులో తలకు రంగు వేసుకునే ఆమే సోగ్గత్తె. జుట్టంతా ముగ్గు బుట్ట అయ్యాక కూడా రంగు వేసుకుంటోంది.’’ (మాయావతి గురించి సురేంద్ర నారాయణ సింగ్‌).

‘‘రాహుల్‌ గాంధీ మీద నమ్మకం లేదు కాబట్టే, చాక్లెటీ ఫేస్‌లను తెచ్చుకుంటున్నారు.’’  (ప్రియాంక గురించి కైలాశ్‌ విజయ్‌వర్గియా, బీజేపీ).

‘‘స్కర్ట్‌లు వేసుకునే పిల్ల చీర కట్టి గుళ్లు తిరుగుతోంది. గంగాజలం అంటే గిట్టని అమ్మాయి గంగానదిని పూజిస్తోంది.’’  (ప్రియాంక గురించి జయకరణ్‌ గుప్తా, బీజేపీ)

‘‘ఈ సంగతి అందరికీ తెలుసు. ప్రియాంక ఢిల్లీలో ఉన్నప్పుడు జీన్స్, టాప్‌ వేసుకుంటుంది. నియోజకవర్గాల్లో పర్యటించేటప్పుడు చీర కట్టుకుని బొట్టు పెట్టుకుంటుంది.’’  (హరీష్‌ ద్వివేదీ, బీజేపీ)

‘‘వ్హావ్‌.. 50 కోట్ల రూపాయల విలువైన గర్ల్‌ ఫ్రెండ్‌ని ఎక్కడైనా చూశారా!’’ (ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌ను విమర్శించేందుకు, అతడి భార్య సునంద పుష్కర్‌ను ఉద్దేశించి నరేంద్ర మోదీ).

‘‘బీజేపీలో అందమైన ముఖం ఒక్కటీ లేదు. వాళ్లకున్న ఒకే ఒక్క ఆకర్షణీయమైన ముఖం హేమమాలిని. వోట్ల కోసం ఆమె చేత డ్యాన్స్‌ చేయిస్తున్నారు. పాటలు  పాడిస్తున్నారు. ఆమె కూడా పార్టీకి ఓట్లు రాబట్టడానికి ఆడి, పాడుతున్నారు.’’  (సజ్జన్‌ సింగ్‌ వర్మ, యు.పి.ఎ.). 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా