అంతా చేసింది ‘బెస్ట్‌’ ఫ్రెండ్‌ అని​ తెలిసి షాక్‌

15 Jul, 2021 02:48 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

రెండో విలన్‌

‘‘కావ్యా (పేరుమార్చడమైనది) ఒక్కసారి కళ్లు తెరువమ్మా! ఏమైందే. వారం రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఇప్పుడిలా చేశావ్, నీకీ పెళ్లి ఇష్టం లేకపోతే ముందే చెబితే సరిపోయేది కదా!’’ సుభద్రమ్మ ఏడుస్తునే ఉంది. ‘‘నువ్వు కాసేపు మౌనంగా ఉండు’’ అంటూ భర్త రాఘవరావు సుభద్ర మీద కేకలేశాడు. కాసేపటికి కావ్య లేచి తల్లిదండ్రులని చూసి, తలదించుకుంది. ‘‘ఏమైందమ్మా! కాస్త ఆలస్యమైతే ఎంత దారుణం జరిగేది. ఉరివేసుకునే పరిస్థితి ఎందుకొచ్చింది తల్లీ’’ అనునయంగా అడిగాడు రాఘరావు. ఆ మాటలతో కావ్య తండ్రిని పట్టుకుని ఏడుస్తూనే ఉండిపోయింది. ‘‘నీకు ఇష్టమని చెప్పాకనే కదా, పెళ్లి పెట్టుకున్నది..’ సందేహంగా అడిగాడు కూతుర్ని.

‘‘నిజమే నాన్నా!’’ అంటూ ఎలా చెప్పాలో తెలియక ఆగిపోయిన కూతుర్ని చూసి, భయమేమీ లేదమ్మా ఇప్పటికైనా చెప్పు. ‘‘పెళ్లి ఆపేద్దామంటే వాళ్లకు చెప్పేస్తే. నీ చావు చూసే పెళ్లి వద్దమ్మా!’ అన్నాడు రాఘరావు.

‘‘అది కాదు నాన్న నేను ఎంతగానో నమ్మిన వంశీ (పేరుమార్చడమైనది) నన్ను టార్గెట్‌ చేశాడు’’ ఏడుస్తూనే చెప్పింది కావ్య.
అర్థం కాక ‘‘వంశీ నీ బెస్ట్‌ ఫ్రెండ్‌ కదమ్మా, ఏమైంది’’ కంగారుగా అడిగాడు.
కూతురు చెప్పిన విషయం వినడంతోనే రాఘవరావు కోపంతో ఉగిపోయాడు.
∙∙
కావ్య తన క్లాస్‌మేట్‌ వరుణ్‌(పేరు మార్చడమైనది)తో స్నేహంగా ఉండేది. బీటెక్‌ నాలుగేళ్లూ ఇద్దరూ చాలా క్లోజ్‌గా తిరిగారు. పెద్దలకు చెప్పి, పెళ్లి చేసుకుందామనుకున్నారు. కానీ, ఇద్దరికీ అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోయారు. ఇద్దరూ ఒక అవగాహనతో తాము క్లోజ్‌గా ఉన్నప్పుడు తీసుకున్న ఫొటోలు, వీడియోలు డిలీట్‌ చేసుకున్నారు. రెండుమూడు నెలల వరకు ఎవరి పనుల్లో వారుండిపోయారు. ఓ రోజు ఫ్రెండ్‌ ఫోన్‌ చేసి, డేటింగ్‌ సైట్స్‌లో కావ్య వరుణ్‌ క్లోజ్‌గా ఉన్న వీడియోలు, ఫోటోలు ఉన్నాయని చెప్పింది. వాటిని కావ్య చూసింది. వరుణ్‌కి ఫోన్‌ చేసి తిట్టింది కావ్య. తనేమీ వాటిని షేర్‌ చేయలేదని రివర్స్‌ అయ్యాడు వరుణ్‌. ఈ విషయాన్ని తన బెస్ట్‌ ఫ్రెండ్‌ అయిన వంశీకి చెప్పింది. ఎలాగైనా ఆ సైట్స్‌ నుంచి తన ఫొటోలు డిలీట్‌ చేయించమని వేడుకుంది. కావ్య చెప్పినట్టు వంశీ వాటిని వివిధ సైట్స్‌ నుంచి తొలగించేశాడు.

‘హమ్మయ్య’ అనుకుని వంశీకి ‘థాంక్స్‌’ చెప్పింది. ఆరు నెలల తర్వాత ఇంట్లో పెద్దలు చూసిన సంబంధానికి ఓకే చెప్పింది. త్వరలో పెళ్లి అనుకున్నారు. భవిష్యత్తు సంతోషంగా ఉండబోతుందనుకున్న కావ్యకు పాత వీడియోలు, ఫొటోలు మళ్లీ వివిధ రకాల సైట్లలో అప్‌లోడ్‌ అయి ఉండటంతో షాకైంది. వంశీని అడిగితే పెళ్లికి ముందు తనతో గడిపితేనే, అవన్నీ తీసేస్తానని, లేదంటే సమాచారం అంతా పెళ్లికొడుక్కి చేరుతుందని బెదిరించడం మొదలుపెట్టాడు వంశీ. షాకైంది కావ్య. ‘సైట్స్‌ నుంచి తొలగించినట్టే తొలగించి, అవన్నీ దాచిపెట్టుకొని, పెళ్లి కుదిరే సమయానికి పాత వీడియోలను, ఫొటోలను అడ్డుపెట్టుకొని తన జీవితంతో ఆడుకుంటున్నాడ’ని అర్ధమైంది కావ్యకు. పెళ్లి ఆగిపోతుందని, పరువు పోతుందని భయపడి చావే శరణ్యం అనుకుంది. విషయమంతా తెలుసుకున్న రాఘరావు కూతురుని తీసుకొని పోలీసులను ఆశ్రయించాడు. కావ్య జీవితాన్ని నాశనం చేయాలనుకున్న వంశీ ఇప్పుడు కటకటాలు లెక్కపెడుతున్నాడు.        

వ్యక్తిగత వివరాలు గోప్యం
కొందరు సన్నిహితంగా ఉన్నప్పుడు ఫొటోలు, వీడియోలు తీసుకుంటుంటారు. చాలాసార్లు సీక్రెట్‌ కెమెరాల ద్వారా వీడియోలు తీస్తుంటారు. ఇద్దరి మధ్య సంబంధం చెడినప్పుడు వీటిని అడ్డుగా పెట్టుకొని ముఖ్యంగా అమ్మాయిలను రకరకాలుగా బ్లాక్‌ మెయిల్‌ చేస్తుంటారు. వివిధ రకాల యాప్‌ల ద్వారా ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్‌ చేసి పోర్న్‌సైట్‌లలో పెట్టడం ఎక్కువగా జరుగుతోంది. అందుకని ముఖ్యంగా అమ్మాయిలు జాగ్రత్తగా ఉండటం అవసరం. పరువు పోతుందని పొలీసులను సంప్రదించకుండా మూడోమనిషి సాయం తీసుకుంటే నష్టమే ఎక్కువ జరుగుతుంది. నేరాలకు అడ్డుకట్ట వేయాలంటే ముందు కేసు ఫైల్‌ చేయాలి. వారి వివరాలు పూర్తి గోప్యంగా ఉంచుతాం. సమస్యకూ సత్వరమే పరిష్కారం అందుతుంది. సైబర్‌ క్రైమ్‌ సమస్యలకు htps://4s4u.appolice.gov.in/
ఫోన్‌ నెంబర్‌: 90716 66667 సంప్రదించవచ్చు.

– జి.ఆర్‌. రాధిక, ఎస్పీ, (సైబర్‌ క్రైమ్‌ విభాగం), ఏపీ పోలీస్‌

బ్లాక్‌ చేయకూడదు..
బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారనగానే వెంటనే భయపడిపోతారు. వేధింపులు భరించలేక సదరు వ్యక్తి నెంబర్‌ బ్లాక్‌ చేస్తుంటారు. ఒకసారి వేధించాలనుకున్న వ్యక్తి రకరకాల మార్గాల ద్వారా బెదిరింపులకు దిగుతాడు. డబ్బులు ఇస్తామనో, మరో విధంగానో కాంప్రమైజ్‌ అవుతాను అనే ధోరణి నుంచి బయపడాలి. బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడనగానే వారి డేటా, కాల్‌ రికార్డ్‌ చేసుకోవాలి. అన్ని మెసేజ్‌లను స్క్రీన్‌ షాట్స్‌ చేసి పెట్టుకోవాలి. వెంటనే http://www.cybercrime.gov.in/ నేషనల్‌ పోర్టల్‌లో రిపోర్ట్‌ చేయాలి.

– అనీల్‌ రాచమల్ల, డిజిటల్‌ వెల్‌బీయింగ్‌ ఎక్స్‌పర్ట్, ఎండ్‌ నౌ ఫౌండేషన్‌

మరిన్ని వార్తలు