వరి నాట్లేసే పరికరం

18 Aug, 2020 09:25 IST|Sakshi

చిన్న కమతాల్లో వరి నాటే పరికరం ఆవిష్కరించిన బొబ్బిలి యువకుడు 

ఒకరే నాలుగు గంటల్లో ఎకరంలో వరి నాట్లు పూర్తి 

ఇంజిన్, ఆయిల్‌ అక్కర్లేదు.. ఖరీదు రూ. 15 వేల లోపే 

వ్యవసాయ కుటుంబంలో పుట్టిన పట్టభద్రుడైన ఓ యువకుడు చిన్న కమతాల్లో వరి సాగు చేసే రైతుల ఇబ్బందులు, ఖర్చులు తగ్గించే ఆవిష్కరణలు అందిస్తున్నారు. అతని పేరు యడ్ల ఉమామహేశ్వరరావు. విజయనగరం జిల్లా బొబ్బిలి సమీపంలోని గున్నతోట వలస స్వస్థలం. దేశ విదేశాల్లో వాడుతున్న యంత్రాలను ఇంటర్నెట్‌ ద్వారా అధ్యయనం చేశాడు. చిన్న రైతులకు ఉపకయోగపడే వరి నాటే పరికరాన్ని తయారు చేయాలని రెండేళ్లుగా ప్రయోగాలు చేస్తున్నాడు. 

సాక్షి,  బొబ్బిలి :ప్రయోగాలకు అవసరమైన పట్టుదల, ఆలోచన ఉన్నాయి కానీ చేతిలో డబ్బు లేదు. ఇతరు సహాయం కోసం ఉమామహేశ్వరరావు ఎదురు చూడలేదు. ఆరు నెలలు ప్రైవేటు ఉద్యోగం చేసి కూడబెట్టిన రూ. 30 వేలతో వెల్డింగ్‌ మెషిన్, ఇనుప సామగ్రిని కొనుగోలు చేసి, ప్రయోగాలు కొనసాగించారు. చివరికి అతని ప్రయత్నం ఫలించింది. వెల్డింగ్‌ పనిలో తన స్నేహితుడు మెండి సత్యనారాయణ సహాయపడ్డారన్నారు.  

ఒక మనిషి ఈడ్చుకుంటూ వెళ్తూ వరి నాట్లు వేసే చిన్న పరికరం సిద్ధం అయింది. దీనికి ఎటువంటి ఇంజిన్‌ లేదు. పెట్రోల్, డీజిల్‌ అవసరం లేదు. తమ గ్రామంలోనే ఇటీవల ఓ రైతు పొలంలో తాను తయారు చేసిన పరికరంతో ఇటీవలే తొలిసారి వరి నాట్లు వేసి అందరితోనే శెభాష్‌ అనిపించుకున్నారు. 

విత్తనాలను ట్రేలో వేసి మొలక గడ్డి రీతిలో వరి నారు పెంచి, ఈ పరికరంతో నాట్లు వేసుకోవచ్చు. ఈ పరికరాన్ని నడపడానికి ఒక మనిషి చాలు. ఎకరా పొలంలో నాలుగు గంటల్లో నాట్లు పూర్తి చేశానని ఉమామహేశ్వరరావు ‘సాక్షి’కి తెలిపారు. వరుసల మధ్య 14 సెం.మీ. దూరం ఉంటుంది. వరుసల్లో మొక్కల మధ్య 7 సెం.మీ. దూరం పెట్టామని, దీన్ని రైతు వసరాలకు అనుగుణంగా మార్చుకోవచ్చని అన్నారు. ఈ వరుసల మధ్య పెరిగే కలుపు తీసే ఇనుప పరికరలను కూడా రూపొందించటం విశేషం. 

వరి నాటే పరికరం పనితీరును పరిశీలించిన బొబ్బిలి వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు మాల కొండయ్య సంతృప్తిని వ్యక్తం చేశారు. చిన్న కమతాల్లో వరి నాట్లు వేసే రైతులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. 

వరి నాట్లు వేసే పరికరాన్ని రైతులకు రూ.10 నుంచి 15వేల మధ్య విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఉమామహేశ్వరరావు తెలిపారు. ఇతరులెవరయినా తోడై పెట్టుబడి పెడితే స్టార్టప్‌ కంపెనీని నెలకొల్పి చిన్న రైతులకు ఉపయోగపడే పరికరాలను పెద్ద సంఖ్యలో తయారు చేసి రైతులకు అందించాలన్నది తన అభిమతమని ఉమామహేశ్వరరావు(93989 02285) తెలిపారు. – రేగులవలస వ్యాస్‌బాబు, సాక్షి,  బొబ్బిలి 

మరిన్ని వార్తలు