లక్ష మొక్కల నోము

5 May, 2022 00:27 IST|Sakshi

‘రోజూ ఉదయం బ్రష్‌ చేసుకున్న తర్వాత నువ్వు ఒక గ్లాసు నీళ్లు తాగు, ఒక గ్లాసు మొక్కకు తాగించు’ ఈ మాట పిల్లల మెదళ్ల మీద ఎంతటి ప్రభావాన్ని చూపుతుందో... ఆ మాట చెప్పినప్పుడు ఊహించలేం. కానీ పిల్లలు తప్పకుండా ప్రభావితం అయి తీరుతారు. ‘నువ్వు నాటేది ఒక్క మొక్క అయినా చాలు, దానిని బతికించి తీరాలి’ అని చెబితే పిల్లలు చాలెంజ్‌గా తీసుకుని తీరతారు.

తోటి పిల్లల మొక్కల కంటే తన మొక్కను ఇంకా బాగా పెంచాలని తాపత్రయపడతారు. పిల్లలను ఈ రకంగా ప్రోత్సహిస్తున్న వ్యక్తి స్వయంగా మొక్కలు నాటుతుంటే, నాటిన మొక్కల బాగోగులు స్వయంగా పట్టించుకుంటూ ఉంటే పిల్లలు రోల్‌మోడల్‌గా తీసుకోకుండా ఉంటారా? అలా పిల్లలకు మొక్కల రోల్‌ మోడల్‌గా మారారు బొల్లంపల్లి జ్యోతిరెడ్డి. పదివేలకు పైగా మొక్కలు నాటి పుడమిని పచ్చగా మార్చడంలో తనవంతు భాగస్వామ్యం అందిస్తున్న ఈ పర్యావరణ కార్యకర్త సాక్షితో పంచుకున్న అనుభవాలివి.

బొల్లంపల్లి జ్యోతిరెడ్డి పూర్వీకులది రంగారెడ్డి జిల్లా పడకల్‌. యాభై ఐదేళ్ల కిందట తాతగారు హైదరాబాద్‌ ఓల్డ్‌సిటీకి వచ్చి స్థిరపడడంతో జ్యోతిరెడ్డి తన పుట్టిల్లు ‘పాతబస్తీ’ అంటారు. పర్యావరణ కార్యకర్తగా మారడానికి ముందు తన జీవితాన్ని క్లుప్తంగా వివరించారామె.

 ‘‘పుట్టింది, పెరిగింది హైదరాబాద్‌ పాతబస్తీలో. అక్కడి ఆర్య హైస్కూల్‌లో చదువుకున్నాను. ఆ తర్వాత మలక్‌పేటలోని శ్రీవాణి కాలేజ్‌. ఇంటర్‌ తర్వాత పెళ్లి, మెడిసిన్‌లో సీటు వచ్చింది. కానీ కుటుంబ బాధ్యతల రీత్యా సీటు వదులుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత గ్రాడ్యుయేషన్‌ చేశాను. ముగ్గురు పిల్లలతో రామంతపూర్‌లో అత్తగారింట్లో గృహిణిగా జీవితం సాఫీగానే సాగుతూ ఉండేది. కానీ ఏదో వెలితి మాత్రం ఉండేది. అయితే మనిషిని సామాజిక జీవిగా మలచడంలో నేను చదువుకున్న ఆర్య స్కూల్‌ది చాలా కీలకమైన పాత్ర. నా సోషల్‌ యాక్టివిటీస్‌కి మూలం కూడా అదే. మేము ఉప్పల్‌కి మారాం. అక్కడ కూడా కాలనీలో పిల్లల కోసం సమ్మర్‌ క్యాంప్‌లు ఏర్పాటు చేయడం, క్రాఫ్ట్‌ క్లాసులు నిర్వహించడం వంటి ఏదో ఒక వ్యాపకంలో నిమగ్నమయ్యేదాన్ని.

వీటితోపాటు బ్యూటీపార్లర్‌లు నిర్వహిస్తూ కొంతకాలం నన్ను నేను బిజీగా ఉంచుకున్నాను. అప్పుడు ఉప్పల్‌ మెయిన్‌రోడ్‌ పొల్యూషన్‌ ఎంత తీవ్రంగా ఉందనేది నాకు అనుభవంలోకి వచ్చింది.ఒకసారి బయటకు వెళ్తే చాలు వాహనాల కాలుష్యం కారణంగా ముక్కు కారడం, దగ్గు, రకరకాల అలర్జీలు వచ్చేవి. భూమాత ఎదుర్కొంటున్న పరీక్షలు అర్థమయ్యాయి. పచ్చదనం లోపించిన పుడమి చల్లగా ఉండాలంటే ఎలా ఉంటుంది? అనిపించింది. నన్ను నేను పనిలో నిమగ్నం చేసుకోవడానికి ఎప్పుడూ ఏదో ఒక వ్యాపకం పెట్టుకుంటున్నాను, ఆ చేసే పని భూమాతకు పనికి వచ్చేదే అయితే బావుంటుంది కదా... అనుకున్నాను. అలా రూపుదిద్దుకున్నదే ‘గ్రీన్‌ ఇండియన్‌ సొసైటీ’
 
నారు... నీరు!
‘మొక్కలు నాటడం’ అనే మాట వినగానే ‘మరి వాటిని బతికించడం?’ అనే కౌంటర్‌ కూడా వినిపిస్తుంటుంది. నేను మొక్కలు నాటుతున్నాను, అలాగే వాటిని బతికించే బాధ్యత కూడా తీసుకున్నాను. నేను చేస్తున్నది మొక్కుబడిగా మొక్కలు నాటడం కాదు, బాధ్యతగా పచ్చదనాన్ని పెంపొందించడం. నేను మొక్క నాటుతున్నది భూమాతకు చల్లదనాన్నివ్వడం కోసం, కాబట్టి మొక్కను బతికించి చిగురు తొడిగితే మురిసిపోవడం కూడా నా సంతోషాల్లో భాగమే. అందుకే ఎవరి ఇంటి ముందు నాటుతున్నానో ఆ ఇంటి వాళ్ల నుంచి ‘మొక్కను బతికిస్తాం’ అనే మాట తీసుకుంటాను. పబ్లిక్‌ ప్రదేశాల్లో నాటే మొక్కలకు మనుషులను పెట్టి నీళ్లు పోయిస్తున్నాను. నా బాధ్యతలో స్కూల్‌ టీచర్లు బాగా సహకరిస్తున్నారు.

హైదరాబాద్‌ నగరంలోని స్కూళ్లతోపాటు జిల్లాల్లో విశాలమైన ఆవరణ ఉన్న ప్రభుత్వ పాఠశాలను ఎంచుకుంటున్నాను. మొక్క నాటి ట్రీ గార్డు పెట్టిన తర్వాత ఆ ట్రీ గార్డుకు నంబరు ఇస్తాం. పెద్ద క్లాసుల పిల్లలకు ఒక్కో చెట్టు బాధ్యత ఒక్కొక్కరికి అప్పగిస్తాం. ఆ మొక్కలు చిగురించినప్పుడు ఫొటో తీసి వాట్సాప్‌ గ్రూప్‌లో షేర్‌ చేస్తారు టీచర్లు. స్కూళ్లలో మొక్కలు నాటడానికంటే ముందు పిల్లలకు చెట్లు ఎంత అవసరమో, చెట్లు లేకపోతే ఎదురయ్యే పరిణామాలెలా ఉంటాయో... వివరించి చెబుతాను. అలాగే ఇంట్లో మొక్కలు నాటి పెంచమని కూడా చెబుతాను. ‘మనకు దాహమైతే గ్లాసుతో నీళ్లు తీసుకుని తాగుతాం.

మొక్కలకు దాహమైతే మరి? అవి కదలలేవు కాబట్టి వాటికి మనమే నీళ్లు తాగించాలి. మీరు అన్నం తినే ముందు మొక్కకు నీళ్లు పోస్తారా లేక నీళ్లు తాగిన తర్వాత మొక్క దాహం తీరుస్తారా? అదేదీ కాకపోతే ఉదయం నిద్ర లేచిన వెంటనే నీళ్లు పోస్తారా? అని పిల్లల డైలీ రొటీన్‌లో మొక్కకు నీళ్లు పోయడాన్ని ఒక తప్పనిసరి పనిగా చెప్తాను. బాల్యంలో మెదడు మీద పడిన ముద్ర ఎప్పటికీ చెరిగిపోదు. అందుకే నా గ్రీన్‌ ఇండియన్‌ సొసైటీ నిర్మాణానికి బాలయోధులను తయారు చేసుకుంటున్నాను. లక్ష మొక్కలు నాటాలనే నా లక్ష్యసాధనకు బ్రాండ్‌ అంబాసిడర్‌లు పిల్లలే అవుతారు’’ అని చెప్పారామె.
కరోనా కారణంగా ఆమె మొక్కల నోముకు కొంత విరామం వచ్చింది. ఇప్పుడు మళ్లీ మొదలవుతోంది. లక్ష మొక్కల టార్గెట్‌ని చేరే వరకు ఇక విరామం తీసుకునేది లేదంటున్నారు జ్యోతిరెడ్డి.  

తొలి మొక్క వేప!
మొక్కల ఎంపికలో కొన్ని నియమాలు పాటిస్తున్నాను. నిమ్మ, కలబంద, వేప, సపోట, నారింజ, తులసి, యూకలిప్టస్, గన్నేరు మొక్కలు ప్రధానంగా ఉంటాయి. నా తొలి మొక్క వేప. ఆలయాల్లో పండ్లు, పూల మొక్కలు. పబ్లిక్‌ ప్రదేశాల్లో గాలిని శుద్ధి చేయడమే ప్రధానమైన ఔషధ మొక్కలు, త్వరగా పెరిగే వృక్షజాతులను ఎంచుకుంటున్నాను. మొదట్లో అన్ని మొక్కలనూ నర్సరీ నుంచి కొనేదాన్ని. తర్వాత ప్రభుత్వ అధికారులు సంబంధిత డిపార్ట్‌మెంట్‌ల నుంచి కొన్ని రకాల మొక్కలు ఇచ్చి సహకరిస్తున్నారు.
– జ్యోతిరెడ్డి, పర్యావరణ కార్యకర్త

– వాకా మంజులారెడ్డి

మరిన్ని వార్తలు