Veena Nagda: కత్రినా కైఫ్‌ పెళ్లి వేడుకల్లో.. మెహందీ క్వీన్‌.. సెలబ్రిటీ ఆర్టిస్టుగా మంచి ఆదాయం!

9 Dec, 2021 14:58 IST|Sakshi

Bollywood Mehendi Artist Veena Nagda Been Roped In For Katrina Kaif Mehendi Ceremony: వధూవరులకు పెళ్లికళ తెప్పించే అంశాల్లో మెహందీ చాలా ముఖ్యమైనది. చేతులకు అందమైన మెహందీ డిజైన్లు వేయడంతో పెళ్లితంతు సందడిగా ప్రారంభమవుతుంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల దాకా అందరి పెళ్లిళ్లలో మెహందీ హడావుడి మామూలుగా ఉండదు. ప్రస్తుతం జరుగుతోన్న ప్రముఖ బాలీవుడ్‌ నటి కత్రినా కైఫ్‌ పెళ్లి వేడుకల్లో మెహందీ ఫంక్షన్‌ ఎంతో గ్రాండ్‌గా జరిగింది.

ఈ వేడుకలో కత్రినాను మరింత అందంగా కనిపించేలా మంచి మంచి మెహందీ డిజైన్లను వేశారు ఆర్టిస్ట్‌ ‘వీణా నాగాదా’. బాలీవుడ్‌ సెలబ్రిటీల నుంచి అంబానీ ఇంట జరిగే అన్ని వేడుకల్లో వీణా మెహందీ డిజైన్లు ఉండాల్సిందే. ప్రముఖస్థాయి వ్యక్తులకు సందర్భానికి తగినట్లుగా సరికొత్తగా అలంకరిస్తూ ‘మెహందీ క్వీన్‌’గా ఎదిగారు వీణా. 

గుజరాత్‌లోని సనాతన జైన్‌ కుటుంబంలో పుట్టింది వీణా నాగాదా. ఐదుగురు అక్కాచెల్లెళ్లలో అందరిలో ఆఖరు. తండ్రి పూజారి, తల్లి గృహిణి. పదోతరగతి అయ్యాక.. పై చదువులకు ఇంట్లో వాళ్లు అనుమతించలేదు. ఏదైనా ఇంట్లోనే ఉండి నేర్చుకోమన్నారు. దీంతో కుట్లు, అల్లికలతోపాటు మెహందీ డిజైన్లు వేయడం నేర్చుకుంది.

శ్రద్ధగా నేర్చుకోవడంతో అతి కొద్దికాలంలోనే అనేక డిజైన్లను ఆకళింపు చేసుకుంది. తను నేర్చుకున్న డిజైన్లను స్నేహితులు, బంధువుల ఫంక్షన్స్‌లో వేస్తుండేది. వీణా పెట్టిన మెహందీ నచ్చడంతో తెలిసిన వారంతా తమ ఇళ్లలో జరిగే వేడుకలకు వీణాను మెహందీ పెట్టడానికి పిలిచేవారు. ఇలా డిజైన్లు వేస్తూ మంచి మెహందీ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకుంది. 

తొలి సెలబ్రిటీ కస్టమర్‌.. 
వీణాకు తొలి సెలబ్రిటీ కస్టమర్‌ పూనమ్‌ ధిల్లాన్‌. పూనమ్‌కు మెహందీ డిజైన్లు వేసినప్పటికీ అప్పుడు అంతగా పేరు రాలేదు. ఆ తర్వాత హృతిక్‌ రోషన్, సుసాన్నే పెళ్లిలో మెహందీ ఆర్టిస్ట్‌గా పనిచేయడంతో డిజైనర్‌గా మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత కరిష్మా కపూర్, రాణీ ముఖర్జీ, శిల్పాశెట్టి పెళ్లిళ్లకు కూడా వీణా మెహందీ డిజైన్లు వేసింది. ఆ డిజైన్లు సెలబ్రిటీలను బాగా ఆకర్షించడంతో... కరీనా కపూర్, దీపికా పదుకొనే, అమృతా అరోరా, మలైకా అరోరా ఖాన్, హేమమాలిని, ఇషా డియోల్, టీనా అంబానీ, ఇషా అంబానీ, నీతా అంబానీ, ట్వింకిల్‌ ఖన్నా, ప్రియాంక చోప్రా, కాజోల్, షర్మిలా ఠాగూర్, కాజల్‌ అగర్వాల్, కపిల్‌ శర్మ భార్య గిన్ని ఛత్రత్, జరీన్‌ ఖాన్, ఫరా ఖాన్, డింపుల్‌ కపాడియా, మాధురీ దీక్షిత్, ఆశాభోంస్లే, ఏక్తా కపూర్, జయప్రద వంటి వారెందరికో మెహందీ డిజైన్లు వేశారు. ఇండియాలోని ప్రముఖులు, బాలీవుడ్‌ సెలబ్రిటీలేగాక బెల్జియం, లండన్, మారిషస్, పారిస్, సింగపూర్, అమెరికాలలో కూడా వీణాకు కస్టమర్లు ఉన్నారు.   

 పెళ్లిళ్లకేగాక సినిమాలకూ... 
 పెళ్లికూతుర్లను ఆకర్షణీయంగా కనిపించే విధంగా డిజైన్లు వేయడంలో వీణ స్పెషలిస్టు. బ్రైడల్, అరబిక్, డైమండ్‌–పర్ల్, స్టోన్‌–మెహందీలు వేయడంలో అందెవేసిన చెయ్యి. పెళ్లిళ్లు, ఫంక్షన్స్‌లోనేగాక కొన్ని సినిమాల్లో కూడా మెహందీ డిజైన్లు వేశారు. బాలీవుడ్‌ సినిమాలైన ‘కభీ కుషీ కభీ గమ్‌’, కల్‌ హో నా హో, మేరే యార్‌ కీ షాదీ హై, యహ్‌ జవానీ హే దివానీ, పటియాల హౌస్‌ సినిమాల్లో పెళ్లి సీన్లలో నటించిన నటీనటులకు మెహందీ డిజైన్లు వేశారు.

అంతేగాక 2019లో కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ రెడ్‌ కార్పెట్‌లో పాల్గొన్న సోనమ్‌ కపూర్‌కు, అలియా భట్‌ వివిధ సినిమాల్లో నటించిన కొన్ని సీన్లకు డిజైన్లు వేశారు. బాలీవుడ్‌ సెలబ్రిటీ పెళ్లిళ్ళే గాక, వారు చేసుకునే కర్వా చౌత్‌లలో కూడా వీణా మెహందీ డిజైన్లు వేయాల్సిందే. సెలబ్రెటీ ఆర్టిస్టుగా మంచి ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ప్రస్తుతం ముంబైలో ఉంటోన్న వీణా ఇక్కడే ఒక ఇన్‌స్టిట్యూట్‌ను నిర్వహిస్తూ మెహందీ కోర్సు నేర్పిస్తోంది. ఇప్పటిదాకా 55 వేల మంది విద్యార్థులు వీణా వద్ద మెహందీ డిజైన్లు నేర్చుకున్నారు.

చదవండి: Mugdha Kalra: నా బాబు కూడా ఈ ప్రపంచం నుంచే వచ్చాడు కదా.. అందుకే..

మరిన్ని వార్తలు